Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాట్లాడుకోమంటే అర్థం కాలేదా..?

  1. పర్సెంటేజీ ఇవ్వకుండా పని చేస్తారా..!
  2. రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన గ్యాంగ్‌
  3. వాహనం, యంత్రాలను ఎత్తుకపోయిన వైనం
  4. మద్దికెరలో అధికారపార్టీ వర్గీయుల అరాచకత్వం
  5. ముగ్గురికి తీవ్ర గాయాలు.. కేసు నమోదు
  6. రైల్వే ఫుట్‌ ఓవర్‌ పనులకు అడ్డంకులు


టెండరు ప్రక్రియ ద్వారా రైల్వే పనులు దక్కించుకున్నారు. వారం రోజుల క్రితం పనులను ప్రారంభించారు. మూడు రోజుల క్రితం అక్కడికి కొందరు వచ్చారు. ‘ఇక్కడ పనులు చేయాలంటే మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకుండా ఎలా పనులు చేస్తున్నారు..?’ అని బెదిరించారు. తాము పనివారమని, ఏదైనా ఉంటే కంపెనీ నిర్వాహకులతో మాట్లాడుకోవాలని పనిచేసేవారు బదులిచ్చారు. దీంతో పర్సెంటేజీ విషయం తేలేవరకూ పనులు ఆపేయాలని దుండగులు హెచ్చరించి వెళ్లారు. అయినా కంపెనీ తరపున ఎవరూ వారి వద్దకు వెళ్లకపోవడంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు రాళ్లు, కర్రలతో చితకబాదారు. వాహనం, యంత్రాలను ఎత్తుకుపోయారు. ఈ అరాచకం ఎక్కడో బీహార్‌లో జరిగిందేమో అనుకోకండి. మద్దికెరలో జరిగిన ఘటన.. నియోజకవర్గం అరాచకత్వం ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. 


మద్దికెర, డిసెంబరు 2: మద్దికెర నుంచి డోన్‌, బేతంచెర్ల వరకు రైల్వేస్టేషన్లలో ఫుట్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను రూ.19.50 కోట్లకు అనంతపురం జిల్లాకు చెందిన వీవీఆర్‌కే అసోసియేట్‌ కంపెనీ వారు దక్కించుకున్నారు. మద్దికెర రైల్వేస్టేషన్‌లో వారం క్రితం ఫుట్‌ ఫ్లై ఓవర్‌ పనులను కంపెనీవారు చేపట్టారు. విషయం తెలుసుకున్న పత్తికొండ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుల అనుచురులు మూడు రోజుల క్రితం అక్కడికి వచ్చారు. కంపెనీ మేనేజర్‌ నందకిశోర్‌తో మాట్లాడారు. ఈ ప్రాంతంలో పనులు చేయాలంటే మాట్లాడుకోవాల్సిందే అని హెచ్చరించారు. పర్సెంటేజీ మాట్లాడుకోకుండా పనులు ఎలా చేస్తారని దబాయించారు. దీంతో ఆ వ్యవహారాలు తమకు సంబంధం లేదని, కంపెనీవారితో మాట్లాడుకోవాలని అక్కడున్నవారు సమాధానం ఇచ్చారు. పనులను కొనసాగించారు. దీంతో గురువారం మధ్యాహ్నం దాదాపు 10 మంది అనుచరులతో వచ్చిన కొందరు వ్యక్తులు మేనేజర్‌ నందకిశోర్‌, సూపర్‌వైజర్‌ కృష్ణయ్య వద్దకు వెళ్లారు. ‘మాట్లాడుకోవాలని చెబితే అర్థం కాదా..? పర్సెంటేజీ మాట్లాడేవరకూ పనులు చేయవద్దని హెచ్చరించినా ఎలా చేస్తారు..? మా ప్రాంతంలో పనులు చేయాలంటే మాకు పర్సెంటేజీ ఇవ్వాల్సిందే..’ అని బెదిరించారు. దీంతో కాంట్రాక్టర్‌ ఇక్కడ లేరని, మీరే మాట్లాడుకోవాలని ఆ ఇద్దరు సమాధానం ఇచ్చారు. దీనికి ఆగ్రహించి ఆ సదరు వ్యక్తులు మూకుమ్మడిగా రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. వారి దాడిలో నందకిశోర్‌, నందకుమార్‌, కృష్ణయ్య లకు గాయాలయ్యాయి. అంతేకాక వాహనాల తాళాలు ఇవ్వండి అని బెదిరించి, తాళాలు తీసుకున్నారు. బొలేరో వాహనం, మిల్లర్‌ను ఎత్తుకుపోయారు. ‘మీ కాంట్రాక్టర్‌ను వచ్చి మాట్లాడుకుని వీటిని తీసుకెళ్లమనండి’ అని చెప్పి వెళ్లారు. అంతవరకూ వాహనాలు ఇచ్చేది లేదని, ఇలాగే పనులు చేస్తే మళ్లీ వచ్చి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. దీంతో అక్కడ పనిచేసేవారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.


ప్రశాంతంగా ఉండే ఊరిలో..


మద్దికెర ప్రశాంతంగా ఉండే ఊరు. ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలసి ఉంటారు. అలాంటి చోటుకు వేరే ప్రాంతం వారు వచ్చి ఇలా దాడులు చేయడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో రైల్వే పనులు జరగన్వికుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


పోలీసులకు ఫిర్యాదు


రైల్వే పనులు చేస్తున్న తమపై కొందరు దాడి చేశారని, తమ వాహనాలను ఎత్తుకుపోయారని వీవీఆర్‌కే కంపెనీ మేనేజర్‌ నందకిశోర్‌ మద్దికెర ఎస్‌ఐ మమతకు ఫిర్యాదు చేశారు. ఏడుగురు గుర్తు తెలియని వైసీపీ వర్గీయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


వాహనాలను ఎత్తుకెళ్లారు..


రైల్వే పనులు వద్దకు సుమారు 10 మంది వచ్చి మాపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మా వాహనాలను ఎత్తుకెళ్లారు. 


- నందకిశోర్‌, మేనేజర్‌ 


చేయి విరిగింది..


మేము రైల్వే పనులు వద్ద ఉండగా కొందరు వచ్చి రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. నా ఎడమ చేయి విరిగింది. మణికట్టుకు తీవ్ర గాయం అయింది. 


- నందకుమార్‌


మూకుమ్మడిగా దాడి..


మద్దికెర రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పనులు చేస్తుండగా కొందరు దాడి చేశారు. కూర్చుని మాట్లాడుకుందామన్నా వినకుండా కొట్టారు. నా భుజానికి గాయం అయింది.


- కృష్ణయ్య, సూపర్‌వైజర్‌ 

Advertisement
Advertisement