బీఎస్ఎఫ్ పరిధి విస్తరణ..మళ్లీ మమత, ధన్‌కర్ ఢీ..!

ABN , First Publish Date - 2021-12-10T23:44:12+05:30 IST

టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ మధ్య..

బీఎస్ఎఫ్ పరిధి విస్తరణ..మళ్లీ మమత, ధన్‌కర్ ఢీ..!

కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. బీఎస్ఎఫ్ పరిధి విస్తరణకు కేంద్ర ఇటీవల తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమవుతోంది. తమ పరిధిలోకి రాని గ్రామాల్లోకి బీఎస్ఎఫ్‌ను అడుగుపెట్టనీయవద్దని మమతాబెనర్జీ ఇటీవల రాష్ట్ర పోలీసులను ఆదేశించగా, ఆ ఆదేశాలను ధన్‌కర్‌ ముఖ్యమంత్రికి రాసిన ఒక లేఖలో తప్పుపట్టారు. ఆ లేఖను ట్విట్టర్‌కు ఆయన షేర్ చేశారు.


ప్రజలు, జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, సామరస్యం, పరస్పర సహకారానికి గాను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవరించాలని మమతా బెనర్జీకి రాసిన లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఎస్‌ఎఫ్ పరిధిని ప్రస్తుతం ఉన్న 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు విస్తరిస్తూ కేంద్ర హోం మంత్రి నోటిఫికేషన్‌కు భిన్నంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయని, ఇది సమాఖ్య స్ఫూర్తి, జాతీయ భద్రతకు విఘాతం కలిగించే సంకేతాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసుల మధ్య సామరస్య వాతావరణాన్నే కానీ ఘర్షణకు తావీయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.


బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం

తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ వాదనకు బీజేపీ మద్దతుగా నిలవగా, బీజేపీ ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ టీఎంసీ మండిపడింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఇందుకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటని బీజేపీ నేత సువేందు అధికారి నిలదీశారు. మమత నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, గవర్నర్ ధనకర్ దృష్టి సారించాలని, ఈ అంశాన్ని రాష్ట్రపతి భవన్‌కు రాజ్‌భవన్ తీసుకు వెళ్లాలని ఆయన కోరారు. కాగా, గవర్నర్ లేఖపై తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునల్ ఘోష్ మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధిగా వ్యవహరించడం గవర్నర్ మానుకోవాలని అన్నారు. సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగం గురించి మాట్లేడే గవర్నర్, పశ్చిమబెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను వేరుచేయాలని బీజేపీ ఎమ్మెల్యే చేస్తున్న డిమాండ్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సరిహద్దు గ్రామ ప్రజలపై బీఎస్ఎఫ్ అకృత్యాలు, పోలీసులను అప్రమత్తం చేసే విషయంలో తనకున్న హక్కులేమిటో ముఖ్యమంత్రికి బాగా తెలుసునని రాజ్యసభలో టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు. గవర్నర్ ఎందుకు యునైటెడ్ నేషన్స్‌కు వెళ్లకూడదని చమత్కరించారు.

Updated Date - 2021-12-10T23:44:12+05:30 IST