బెంగాల్ ప్రజలను మోసగించారు : మోదీ ఫైర్

ABN , First Publish Date - 2021-03-07T20:47:42+05:30 IST

బెంగాల్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాంతితో పాటు ‘బంగారు బంగ్లా’, ప్రగతి పథంలో పయనించే

బెంగాల్ ప్రజలను మోసగించారు : మోదీ ఫైర్

కోల్‌కతా : బెంగాల్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాంతితో పాటు ‘బంగారు బంగ్లా’, ప్రగతి పథంలో పయనించే బెంగాల్‌ను ను కోరుకుంటున్నారని తెలిపారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎందరో మంది ముఖ్యులకు సాక్షిగా నిలిచిందని, అలాగే బెంగాల్ అభివృద్ధికి విఘాతకులకు కూడా సాక్షిగా నిలిచిందన్నారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధిపై ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. బెంగాల్ ప్రజల ఆశలను తాము నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్ సంస్కృతిని కాపాడడానికి, అభివృద్ధి చేస్తామన్న హామీని ఇవ్వడానికే బెంగాల్‌కు వచ్చినట్లు ఆయన వివరించారు. బెంగాల్‌ను అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతోనే మమతకు పట్టం కట్టారని, కానీ... ఆ నమ్మకాన్ని మమత వమ్ము చేశారని విమర్శించారు. 


ప్రజల నమ్మకాన్ని అధికార తృణమూల్ అవమానించిందని, గంగలో కలిపిందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో తృణమూల్, కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి ఓ వైపు, బెంగాల్ ప్రజలు ఒక్కరు ఒకవైపు ఉన్నారని మోదీ తెలిపారు. బెంగాల్ గడ్డ మీద ఎందరో మంది మహానుభావులు జన్మించారని, ఏక్‌ భారత్, శ్రేష్ఠ భారత్ అన్నదానిని నిలబెట్టారని ప్రశంసించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ కొత్త ఊపిరిలూదిందని, విజ్ఞాన ప్రపంచంలో కూడా బెంగాల్ దేశ గౌరవాన్ని పెంచిందని పేర్కొన్నారు. కానీ సీఎం మమత మాత్రం బెంగాల్ ప్రజలను మోసగించారని మండిపడ్డారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని అధికార తృణమూల్ ఎంతలా ధ్వంసం చేసిందో అందరికీ తెలుసని, తాము అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య వ్యవస్థను పరిపుష్టం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు తిరిగి నమ్మకం కలిగేలా వ్యవహరిస్తామని మోదీ తెలిపారు. రాబోయే 25 సంవత్సరాలు అభివృద్ధి పరంగా బెంగాల్‌కు చాలా కీలకమైన రోజులని తెలిపారు. 2047 లో 100 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంలో అప్పుడు మరోసారి బెంగాల్ దేశాన్ని నడిపించాలని మోదీ ఆకాంక్షించారు. 


Updated Date - 2021-03-07T20:47:42+05:30 IST