బియ్యం బుక్కేశారు?

ABN , First Publish Date - 2022-08-12T09:18:59+05:30 IST

పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు అడ్డదారుల్లో అడ్డంగా బియ్యం బుక్కుతున్నారు. అవసరం లేకపోయినా..

బియ్యం బుక్కేశారు?

  • పౌరసరఫరాల సంస్థ మేనేజర్ల నిర్వాకం
  • లక్ష్యానికి మించి మిల్లర్ల నుంచి సేకరణ
  • 75 వేల మెట్రిక్‌ టన్నులకు రూ.240 కోట్ల చెల్లింపులు
  • కమిషనర్‌ విచారణలో బయటపడుతున్న బాగోతం
  • ముగ్గురు డీఎంలపై వేటు.. మిగతావారి గుండెల్లో రైళ్లు
  • ఒక్కో డీఎంకు రూ.3 కోట్ల నుంచి 4 కోట్ల లంచం?


హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు అడ్డదారుల్లో అడ్డంగా బియ్యం బుక్కుతున్నారు. అవసరం లేకపోయినా.. మిల్లర్ల నుంచి లక్ష్యాన్ని మించి బియ్యం సేకరిస్తూ.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వానికి నష్టాన్ని కలుగజేస్తున్నారు. ఇలా మూడు జిల్లాల్లో 75 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కొనుగోలుచేసి, రాష్ట్రప్రభుత్వంపై రూ.240 కోట్ల మేర అదనపు భారం వేశారు. ఇది కేవలం మూడు జిల్లాల లెక్క మాత్రమే..! భారీ ఎత్తున గోల్‌మాల్‌ ఉండడం.. ఒక్కో డీఎంకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల దాకా ముట్టడంతో.. అధికారులు మిగతా జిల్లాల్లో తీరుపైనా విచారణ చేపట్టారు. దీంతో.. పౌరసరఫరాల సంస్థ జిల్లాల మేనేజర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత కార్డులు 53.90 లక్షలు, రాష్ట్రం పరిధిలోనివి 36.44 లక్షలు ఉన్నాయి. ఈ కార్డులున్న కుటుంబాల్లో ఒక్కొక్కరికి కేంద్రం 5 కిలోల బియ్యం అందజేస్తుండగా.. రాష్ట్రప్రభుత్వం దానికి ఒక కిలోను కలిపి.. ఆరుకిలోలు ఇస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా బియ్యాన్ని సేకరిస్తుంది. దీనికి జిల్లాల వారీగా టార్గెట్లుంటాయి. 


అయితే.. మన అధికారులు మాత్రం అవసరానికి మించి, బియ్యాన్ని సేకరించారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) అవసరాలకు నెలకు 1.81 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. ఇందులో 1.08 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం, 73 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నాయి. స్టేట్‌ పూల్‌ రైస్‌ సేకరించే క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు, రైస్‌మిల్లర్లు కుమ్మక్కయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌కు మించి బియ్యాన్ని సేకరించారు. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు రావటంతో.. ఆయన విచారణ జరిపించారు. దీంతో.. వరంగల్‌లో 30 వేల టన్నులు, పెద్దపల్లిలో మరో 30 వేల టన్నులు, మెదక్‌లో 15 వేల టన్నులు.. మొత్తం కలిపి 75 వేల టన్నుల మేర అదనంగా ప్రొక్యూర్‌మెంట్‌ జరిగినట్లు తేలింది. ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ వద్ద ఏడాదిన్నర పీడీఎస్‌ అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలున్నా.. ఈ మూడు జిల్లాల్లో మాత్రం ఉన్నతాధికారులకు చెప్పాపెట్టకుండా అదనపు సేకరణ చేసేశారు. ఒక్కో టన్నుకు రూ. 32 వేల చొప్పున.. 75 వేల టన్నుల అదనపు సేకరణతో సర్కారుపై మొత్తం రూ. 240 కోట్ల మేర అదనపు భారం పడింది. 


దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు-- వరంగల్‌ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ ఇర్ఫాన్‌, పెద్దపల్లి మేనేజర్‌ ప్రవీణ్‌ను సస్పెండ్‌ చేశారు. మెదక్‌జిల్లాలో స్థానిక ఆర్డీవో సాయిరాం డీఎంగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మోసంతో అతనికి ప్రమేయం లేదనే ఆధారాలుండడంతో..అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై చర్యలకు సిద్ధమయ్యారు. సాయిరాంను పౌరసరఫరాల సంస్థ నుంచి తప్పించి, రెవెన్యూ శాఖకు పరిమితం చేశారు. సూర్యాపేట జిల్లాలో కూడా ఇదే తరహాలో టార్గెట్‌కు మించి బియ్యం తీసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. మూడు జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ మేనేజర్లపై కమిషనర్‌ కొరడా ఝులిపించటంతో.. మిగిలిన జిల్లాల మేనేజర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 15 నుంచి 20 జిల్లాల్లో ఈ తరహా దందా జరిగినట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల లెక్కలు తీస్తే మరికొందరు డీఎంల బండారం బయటపడే అవకాశాలున్నాయి.


ఒక్కో డీఎంకు రూ. 4 కోట్ల దాకా..

బియ్యం సేకరణను ఏసీకే పద్ధతిలో చేస్తారు. అంటే.. ఒక్కో ఏసీకేలో 290 క్వింటాళ్ల బియ్యం ఉండాలి. మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించేప్పుడు ప్రతి ఏసీకేకు  రూ. 15 వేల దాకా లంచం తీసుకుంటారనే ఆరోపణలున్నాయి. ఈ లెక్కన ఒక్కో డీఎంకు రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు అంది ఉంటాయని తెలుస్తోంది. ఈ దందాను కేవలం జిల్లా మేనేజర్లే నడిపించారా? లేక.. రాష్ట్రస్థాయిలో పౌరసరఫరాల భవన్‌ కేంద్రం గా పనిచేస్తున్న స్టేట్‌మేనేజర్ల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-08-12T09:18:59+05:30 IST