Abn logo
Jun 12 2021 @ 17:40PM

మీరు వాడే షాంపూ ఎక్కడ పుట్టిందో తెలుసా..? దేశాలు దాటి ఇంటింటికీ చేరి..

మనం తరచుగా ఉపయోగించే సౌందర్య సాధనాలలో ముఖ్యమైనది షాంపూ. మన జుట్టును శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే షాంపూలను వివిధ కంపెనీలు రకరకాల పేర్లతో అమ్ముతున్నాయి. అందులోనూ విదేశీ కంపెనీలకు చెందిన బ్రాండ్లే మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. దీంతో షాంపూ అనేది పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌కు వచ్చిందేమో అనుకుంటాం. కాదు.. షాంపూ పూర్తిగా భారతీయ ఉత్పత్తి. అవును.. షాంపూ పుట్టింది భారత్‌లోనే. మన దేశంలోనే పుట్టి విదేశాలకు పాకింది. 

మూలాలు మనదేశంలోనే..

అసలు షాంపూకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? `చంపు` అనే హిందీ పదం నుంచి వచ్చిందే షాంపూ. సంస్కృత పదం `చప్యాతి` నుంచి ఇది పుట్టింది. దీనికి `మసాజ్` అని అర్థం. క్రీస్తు శకం 1500 నాటికే భారతీయులు ఉడకబెట్టిన కుంకుడుకాయలు, ఉసిరి, మందారం, శికాకాయ్ తదితర మూలకాలతో తయారు చేసిన పేస్టుతో తలంటుకునేవారు. జట్టును శుభ్రపరచుకునేందుకే కాదు.. కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు, మాడు నొప్పి నుంచి ఉపశమనానికి కూడా ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడేది. అప్పటికి ప్రపంచానికి అదేంటో కూడా తెలియదు. 

పాట్నా నుంచి ఇంగ్లండ్ వెళ్లింది..

షేక్ డీన్ మహ్మద్ అనే పాట్నా క్షురకుడి కారణంగా షాంపూ ఇంగ్లండ్ వెళ్లింది. 1759లో బీహార్‌లోని క్షురకుల కుటుంబంలో పుట్టిన మహ్మద్ తమ పెద్దల ద్వారా హెర్బల్ షాంపూల తయారీని నేర్చుకున్నాడు. తమ సెలూన్‌కు వచ్చినవాళ్లకు వాటితో మసాజ్ చేసేవాడు. అనంతరం షాంపూతో కుదుళ్లకు స్నానం చేయించేవాడు. 1800 సంవత్సరంలో పొట్టకూటి కోసం కుటుంబంతో సహా ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ `మహ్మద్ బాత్స్` పేరుతో స్పా తెరిచి హెడ్ మసాజ్‌లు, షాంపూయింగ్ చేయడం మొదలు పెట్టాడు. అతడి స్పాకు మంచి ఆదరణ లభించింది. అతడి పార్లర్ ముందు ఆంగ్లేయులు బారులు తీరేవారు. దీంతో అతడిని కింగ్ జార్జ్-4 తన వ్యక్తిగత షాంపూ సర్జన్‌గా నియమించుకున్నాడు. అనంతరం కింగ్ విలియం-4 వద్ద కూడా మహ్మద్ పనిచేశాడు. ఇతడి పనితనం గురించి అక్కడి పత్రికల్లో కథనాలు వచ్చేవి. 


అనంతరం అక్కడి వారికి తన షాంపూ తయారీ పద్ధతులను నేర్పాడు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో బాగా పాపులర్ అయిన సన్ బాత్ (నూనెతో మసాజ్ చేసుకుని ఎండలో పడుక్కోవడం)ను పరిచయం చేసింది కూడా మహ్మదే. అంతేకాదు `షాంపూయింగ్, ఆర్ బెనిఫిట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ఇండియన్ మెడికేటెడ్ వేపర్ బాత్` పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. 

అలా మెల్లిమెల్లిగా షాంపూ గురించి ప్రపంచానికి తెలియడం ప్రారంభమైంది. 1900ల్లో షాంపూ వాడకం పెరిగింది. ఆరంభంలో ధనికులు, రాజవంశీకులు మాత్రమే వాడే షాంపూ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ దర్శనమిస్తోంది. షాంపూను చిన్న చిన్న పాకెట్లలో తక్కువ ధరకు భారత్‌లో అమ్మిన తొలి కంపెనీ `చిక్`. ఆ ప్రయోగం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. దీంతో చాలా కంపెనీలు అదే బాటలో పయనించాయి. ఇప్పుడో ఎన్నో రకాల మిశ్రమాలతో కొత్త కొత్త పేర్లతో షాంపూలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అయితే మూలికలతో చేసినవి కాకుండా రసాయనాలతో చేసిన షాంపూలే ఇప్పుడు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. `సోడియం లౌరిల్ సల్ఫేట్` అనే రసాయనాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నందు వల్ల దుష్ర్పభావాలు తలెత్తుతున్నాయి.
 

ప్రత్యేకంమరిన్ని...