తిరుపతిలో తట్ట మట్టి వేశారా?

ABN , First Publish Date - 2021-04-13T05:56:53+05:30 IST

‘వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. తిరుపతిలో తట్ట మట్టి వేశారా? టీడీపీ చేసిన అభివృద్ధి పనులను కూడా అడ్డుకుంటూ వస్తున్నారు ’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఽఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతిలో తట్ట మట్టి వేశారా?
తిరుపతి రెల్వేస్టేషన్‌ రోడ్డులో చంద్రబాబు పాదయాత్ర

టీడీపీ అభివృద్ధి పనులనూ అడ్డుకుంటున్నారు

భయపడకుండా బయటకు రండి

తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు


తిరుపతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):‘వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. తిరుపతిలో తట్ట మట్టి వేశారా? టీడీపీ చేసిన అభివృద్ధి పనులను కూడా అడ్డుకుంటూ  వస్తున్నారు ’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఽఆగ్రహం వ్యక్తం చేశారు.తిరుపతి ఉప ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం రాత్రి తిరుపతి నగరం కృష్ణాపురం ఠాణా కూడలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు రైల్వేస్టేషన్‌ నుంచి పాదయాత్రగా సభాస్థలికి చేరుకున్నారు. విపరీతంగా తరలివచ్చిన జనసమూహంలో ఆయన కృష్ణాపురం ఠాణా వద్దకు చేరుకునేసరికి గంట సమయం పట్టింది.సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘ ఇక్కడ ఏడుకొండలస్వామి ఉన్నాడు కాబట్టే యూనివర్సిటీలు, ఆస్పత్రులు, కాలేజీలు వచ్చాయి. ఎన్టీఆర్‌ పద్మావతి వర్సిటీ, స్విమ్స్‌, బర్డ్‌ స్థాపించారు. నేనొచ్చాక ఆస్పత్రులను క్లస్టర్‌గా ఏర్పాటుచేసి ప్రాణదాన పథకం తీసుకొచ్చాం.ఐఐటీ, ఐజర్‌, ఐఐడీఈ, కల్నరీ వర్సిటీ తీసుకొచ్చాం.  అవుటర్‌ రింగ్‌ రోడ్డు, తెలుగుగంగ నీళ్లు, గరుడ ఫ్లైఓవర్‌ అన్నీ మనమే చేశాం. అరవింద్‌ ఐ ఆస్పత్రి, టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి కూడా టీడీపీ హయాంలో వచ్చినవే. పరిశుభ్రమైన సిటీగా తయారు చేశాం. అవార్డులు తీసుకొచ్చాం. పేదలకు ఆరు వేల పట్టాలిచ్చాం. శాశ్వత ఇళ్లు ఇవ్వాలని ముందుకుపోయాం. అవిలాల చెరువును పర్యావరణ పార్కుగా తీసుకొచ్చేందుకు ముందుకొస్తే దాన్నీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు.తిరుపతిని మహానగరంగా తయారు చేయాలని ప్రణాళికలు వేశా.ఎన్నో పెద్ద కంపెనీలు తీసుకొచ్చా. విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాం. విద్య, ఉపాధికి పెద్దపీట వేశాం. టీటీడీ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చా. ఉద్యోగ విరమణ వయస్సు పెంచా. 11వేల మంది టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. టీటీడీ ఉద్యోగులకు అండగా ఉంటా’ అంటూ భరోసా ఇచ్చారు. ‘నా అనుభవం ఎంత? వీళ్ల జీవితంఎంత? ఎయిర్‌పోర్టులో నన్ను 9 గంటలు కూర్చోబెడతారా? నేను అధికారంలో ఉన్నప్పుడు అలా అనుకోని చేస్తే మీరు బయటకు వచ్చేవారా? పొక్లెయిన్‌తో టీడీపీ నాయకుల షాపులను కూల్చేస్తారా? నేను అధికారంలో ఉన్నప్పుడు నంగినంగిగా తిరిగారు. ఇప్పుడు రెచ్చిపోతున్నారు. బందిపోట్ల కన్నా విచ్చలవిడిగా తయారవుతున్నారు’ అంటూ విమర్శించారు. ‘ఉప ఎన్నిక తర్వాత తిరుపతిలో ఇంటి పన్ను పది, ఇరవై రెట్లు పెంచేందుకు జగన్‌ సిద్ధమవుతున్నాడు.ఖాళీ స్థలాలు, ఫుట్‌పాత్‌పై కూర్చున్నా పన్నులే. బాత్రూమ్‌ పోవాలన్నా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి.కొండపై తలనీలాలు స్మగ్లింగ్‌, ఎర్రచందనం డబ్బులే ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారు. ఒకప్పుడు వైఎస్‌ ఏడుకొండలను ఐదు కొండలే అంటే మిగిలిన రెండు కొండలు ఎవరికిస్తావని తిరుమలకు పాదయాత్ర చేశా.రమణదీక్షితులు మా ఇంట్లో పింక్‌ డైమండ్‌ ఉందని చెబితే, పరువునష్టం దావా వేశా. ఇప్పుడు ఆ డైమండ్‌ లేదంటారు. అబద్దం చెప్పినవారు శిక్షార్హులు. జగన్‌ మహావిష్ణువు అని రమణ దీక్షితులు పోల్చడం ఏమిటి.ఓటుకు లడ్డూలు పంచుతారు. అన్ని లడ్డూలు వారికి ఎలా వస్తాయి.టీటీడీ అధికారులు ఏమి చేస్తున్నారు?ఇప్పుడు మీరు భయపడితే శాశ్వతంగా భయపడాల్సిందే. రేపు మీ సత్తా ఏంటో చూపించండి. వైసీపీకి బుద్ధి చెప్పకపోతే పన్నులు పెరుగుతాయి. అవినీతి పెరుగుతుంది.వలంటీర్ల బెదిరింపులు ఎక్కువవుతాయి.తిరుపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనుకుంటే తిరుపతిలో ఎవరుంటారని  జగన్‌ మాట్లాడతారా? దానిని వైరల్‌ చేస్తే సీఐడీ కేసులు పెడతారా? నిజాయితీగా బతికేవాళ్ల జోలికొస్తే నిప్పును పట్టుకున్నట్టే జాగ్రత్త’ అని హెచ్చరించారు.

Updated Date - 2021-04-13T05:56:53+05:30 IST