విశ్వనాథ చుట్టలు కాల్చారా?

ABN , First Publish Date - 2020-09-08T09:28:55+05:30 IST

ఏల్చూరి సుబ్రహ్మణ్యం శతజయంతి సందర్భంగా ‘మాశర్మ’ ఆగస్టు 26న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘నయాగరా నవ్యజలపాతం ఏల్చూరి’ అనే శీర్షికన మంచి వ్యాసం రాశారు...

విశ్వనాథ చుట్టలు కాల్చారా?

ఏల్చూరి సుబ్రహ్మణ్యం శతజయంతి సందర్భంగా ‘మాశర్మ’ ఆగస్టు 26న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘నయాగరా నవ్యజలపాతం ఏల్చూరి’ అనే శీర్షికన మంచి వ్యాసం రాశారు. అందులో ఏల్చూరి సుబ్రహ్మణ్యం గురించి తెలియని విషయాలెన్నో చెప్పారు. ముఖ్యంగా ఆయన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంట్లోనే ఉండి బి.ఏ పూర్తి చేశారనే విషయమొకటి. మా నాన్నగారు గంధం నాగేశ్వరరావు కూడా విశ్వనాథ వారి ఇంట్లోనే ఉండి వారికి అంతేవాసిత్వం నెరిపారు. ఆ మహద్భాగ్యం ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారిని కూడా వరించిందని తెలిసి సంతోషించాను. ఆ సందర్భంగా, ‘‘ఏల్చూరి సుబ్రహ్మణ్యం నా దగ్గర మూడేళ్ళు చదువుకుని, అతను ఏమి నేర్చుకున్నాడో నాకు తెలియదు కాని, నేను అతని దగ్గర నుండి చుట్ట తాగడం నేర్చుకున్నానని విశ్వనాథ చమత్కరించారు’’ అని మాశర్మ రాశారు. విశ్వనాథ వారి పరిచయ భాగ్యం నాకు కూడా లభించింది. ఎన్నో గంటలు ఆయనతో గడిపిన రోజులున్నాయి. కాని ఆయన చుట్టలు కాల్చడం నేనెప్పుడూ చూడలేదు. నశ్యం పీల్చే అలవాటు మాత్రం ఉండేది. విశ్వనాథ వారికి చుట్టలు కాల్చే అలవాటు లేదని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. మరి, చుట్టలు కాల్చే అలవాటును విశ్వనాథ వారు తన శిష్యుడైన, అదీ తమ ఇంట్లో ఉండి చదువుకున్న సుబ్రహ్మణ్యం గారి నుంచి నేర్చుకున్నారని మాశర్మ రాయడానికి ఏదైనా ప్రమాణముందా? ఒకవేళ ఆయన చుట్టలు కాల్చినా, ఆ అలవాటును ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పి, పుత్రసమానంగా చూసుకున్న ఏల్చూరి సుబ్రహ్మణ్యం నుంచి నేర్చుకుంటారా? 

ఆ మహనీయుడి వ్యక్తిత్వం తెలిసినవారెవరూ ఇది నిజమని నమ్మరు. 

విశ్వనాథపై ఇటువంటి వార్తలు చదివినప్పుడు ఆయనను భక్తి, గౌరవాలతో అభిమానించే వారి మనసులకు కష్టం కలుగుతుంది. తమకు ఈ విషయం 

ఏ విధంగా తెలిసిందో, దానికి గల ప్రామాణికత ఏమిటో మాశర్మ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.

డా. గంధం సుబ్బారావు

విశ్రాంత డిప్యూటీ రిజిస్ట్రార్ 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

Updated Date - 2020-09-08T09:28:55+05:30 IST