తునికాకు సేకరణ లక్ష్యం చేరేనా..?

ABN , First Publish Date - 2022-05-10T04:08:44+05:30 IST

జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. కష్టానికి తగ్గ ఫలితం లేని కారణంగా తునికాకు సేకరణకు అడవుల్లోకి వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. జన్నారం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అటవీ డివిజన్ల పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ జరపాలని అటవీ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా అక్కడక్కడ తునికాకు సేకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. తునికాకు సేకరణ కోసం గ్రామాల నుంచి ప్రజలు తెల్లవారుజామున అడవుల బాట పడుతున్నారు.

తునికాకు సేకరణ లక్ష్యం చేరేనా..?
సేకరించిన తునికాకును కట్టలు కడుతున్న దృశ్యం

అరకొర రేటుతో ఆసక్తి చూపని ప్రజలు

42వేల పైచిలుకు బ్యాగుల సేకరణ లక్ష్యం

శ్రమకు తగ్గ ఫలితం లేదంటున్న కూలీలు

పెండింగ్‌ బోనస్‌ చెల్లించాలని వేడుకోలు

మంచిర్యాల, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. కష్టానికి తగ్గ ఫలితం లేని కారణంగా తునికాకు సేకరణకు అడవుల్లోకి వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. జన్నారం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అటవీ డివిజన్ల పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ జరపాలని అటవీ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా అక్కడక్కడ తునికాకు సేకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. తునికాకు సేకరణ కోసం గ్రామాల నుంచి ప్రజలు తెల్లవారుజామున అడవుల బాట పడుతున్నారు. గతంలో గ్రామ సమీపంలోని అడవుల ప్రారంభంలోనే తునికాకు లభ్యం కాగా, ప్రస్తుతం లోనికి వెళ్లాల్సి వస్తోందని కూలీలు చెబుతున్నారు. దూర భారం పెరగడంతో ఎడ్లబండ్లు, కాలినడక అడవుల్లోకి వెళ్తున్నారు. గ్రామాల చుట్ట పక్కల ఉన్న భూములు ప్రస్తుతం సాగులోకి రావడంతో అడవుల్లోకి వెళితే తప్ప, తునికాకు లభ్యం కావడం లేదు. గతంలో తునికాకు సీజన్‌ ప్రారంభానికి ముందే అధికారులు, కాంట్రాక్టర్లు కొమ్మ కొట్టేవారు. దీంతో కొత్తగా పుట్టుకొచ్చిన ఆకు పుష్కలంగా దొరికేది. ప్రస్తుతం కొమ్మ కొట్టించకపోవడంతో అడవుల లోనికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

42వేల పై చిలుకు బ్యాగులు లక్ష్యం....

తునికాకు సేకరణకు సంబంధించి ఈ ఏడాది ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని విధించింది. జిల్లాలోని నాలుగు అటవీ డివిజన్ల పరిధిలో 42,100 స్టాండర్డ్‌ బ్యాగుల ఆకు సేకరించాలని లక్ష్యం విధించడంతో అటవీశాఖ అధికారులు తునికాకు సేకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో తునికాకు సేకరించే ప్రజలు, కూలీలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్‌లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ లోగానే లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది తునికాకు సేకరణకు సంబంధించి జన్నారం అటవీ డివిజన్‌లో ఉన్న ఒక యూనిట్‌ పరిధిలో 13 కల్లాలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల డివిజన్‌లో 10 యూనిట్లకు గాను 77 కల్లాలు, చెన్నూరు డివిజన్‌లో ఎనిమిది యూనిట్లకు 76, బెల్లంపల్లిలో ఎనిమిది యూనిట్లకుగాను 76 కల్లాలు ఏర్పాటు చేసి, తునికాకు కట్టలను ఆరబెడుతున్నారు. 

ఆసక్తి చూపని ప్రజలు...

తునికాకు సేకరణకు అటవీ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదు. తునికాకు సేకరణకు ప్రభుత్వం ప్రకటించిన ధరలు తక్కువగా ఉండడంతో ఆసక్తి చూపడం లేదు. తెల్లవారుజామున ఇంటిల్లిపాది అడవుల్లోకి వెళితే కట్టలు కట్టేసరికి దినమంతా పడుతుందని చెబుతున్నారు. కుటుంబం మొత్తం కష్టపడ్డా కూలీ కూడా పడటం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం 50 ఆకుల కట్టకు కేవలం రూ.2.50పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. పొద్దస్తమానం పని చేస్తే రూ. 150 నుంచి రూ. 200 మాత్రమే గిట్టుబాటు అవుతుందని, అదే బయట కూలీ పనులకు వెళితే రోజుకు కనీసం రూ.600 సంపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు. తునికాకు సేకరణకు వన్యమృగాల భయం కూడా వెంటాడుతోంది. అడవుల్లో వన్యమృగాల సంఖ్య పెరగడం, పులులు, చిరుతలు సంచరించిన దాఖలు ఉండటంతో అడవుల్లోకి వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. 

బకాయిలు చెల్లించని కాంట్రాక్టర్‌...

అష్టకష్టాలకోర్చి అడవుల్లోకి వెళ్లి తునికాకు సేకరిస్తే కాంట్రాక్టరు డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. తునికాకు సేకరణపై నాలుగు సంవత్సరాల బోనస్‌ రావలసి ఉన్నా, కాంట్రాక్టర్‌ చెల్లించడం లేదని, ఈ విషయమై అటవీశాఖ అధికారులు చొరవ చూపి   బకాయిలు చెల్లించడంతోపాటు ధరను పెంచేలా చర్యలు తీసుకోవాలని కూలీలు, ప్రజలు కోరుతున్నారు. 

కూలీ గిట్టుబాటు కావడం లేదు

తగరం బాలయ్య, భీమారం

పొద్దస్తమానం కుటుంబమంతా కలిసి తునికాకు సేకరణకు వెళితే దినసరి కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవుల్లోకి వెళ్తున్నాం. చెట్టు, పుట్ట అనకుండా తునికాకు సేకరించి, ఇంటికి వచ్చి కట్టలు కడుతున్నాం. సాయంత్రం కల్లాల్లోకి వెళ్లి వాటిని అప్పగించాలి. ఇలా దినమంతా ఒకటే పనిలో ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదు. అదే గ్రామంలో కూలీ పనికి వెళితే రూ.500 ఇస్తున్నారు. శ్రమకు సరిపడా ఫలితం దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

Read more