దేశం దాటారా... వెనక్కి రావడం కష్టమే

ABN , First Publish Date - 2020-02-19T10:38:53+05:30 IST

‘‘రస్‌ అల్‌ ఖైమాను మోసగించిన కేసులో జగన్‌, విజయసాయి సహా మిగిలిన 12 మంది దేశం దాటివెడితే తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. అందుకే జగన్‌ సహా మిగతా నిందితులంతా

దేశం దాటారా... వెనక్కి రావడం కష్టమే

తెలిసే పెట్టుబడుల సదస్సులకు గైర్హాజరు

సెర్బియాలో అప్రూవర్‌గా మారిన నిమ్మగడ్డ!

జగన్‌, విజయసాయి మరో 12 మంది

మెడకు చుట్టుకోనున్న రస్‌ అల్‌ ఖైమా: బొండా 

మంగళగిరి, ఫిబ్రవరి 18: ‘‘రస్‌ అల్‌ ఖైమాను మోసగించిన కేసులో జగన్‌, విజయసాయి సహా మిగిలిన 12 మంది దేశం దాటివెడితే తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. అందుకే జగన్‌ సహా మిగతా నిందితులంతా దేశం దాటివెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. ఇటీవల సౌదీ, దుబాయ్‌, దావో్‌సలలో జరిగిన పెట్టుబడుల సదస్సులకు సైతం రాష్ట్రం నుంచి జగన్‌ బృందం హాజరు కాలేకపోవడం వెనుక ఉన్న చిదంబర రహస్యమిదే’’ అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటికే సెర్బియాలో నిర్బంధంలో వున్న సహ నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ అప్రూవర్‌గా మారినట్టు వార్తలు వస్తున్నాయన్నారు. అదే నిజమైతే త్వరలోనే జగన్‌ కూడా ఐరోపా బాట పట్టక తప్పదన్నారు.


వాన్‌పిక్‌ పోర్టు పేరుతో జగన్‌ బృందం రస్‌ అల్‌ ఖైమాను మోసగించి పెద్ద ఎత్తున సొమ్ములను కాజేసిందన్నారు. వాటిని జగన్‌కు చెందిన సూట్‌కేసు కంపెనీలలో పెట్టుబడులుగా పెట్టారన్నారు. ఈ వ్యవహారంపై సౌదీలో కేసులు పెట్టిన రస్‌ అల్‌ ఖైమా ప్రత్యేకించి ఏపీలో తమకు జరిగిన మోసంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిందన్నారు. తమను మోసగించిన వారిని తక్షణమే అప్పగించాలని సదరు సంస్థ ప్రధాని మోదీకి లేఖలు రాసిందన్నారు. తాను గండం నుంచి బయటపడాలంటే నిమ్మగడ్డను సెర్బియా నుంచి విడుదల చేయించాల్సిందేనని భావించిన జగన్‌ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.


విశాఖ భూములపై రాబందులు: నిమ్మల

‘‘అంతరించిపోయిన రాబందులు జగన్‌ బంధుగణం రూ పంలో మళ్లీ వచ్చి విశాఖలోని విలువైన భూములను కబ్జా చేస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పేరుతో జగన్‌, విజయసాయి విశాఖ భూములను కొల్లగొడుతున్నారు. ఇటీవల విశాఖలో మా పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించగా.. వైసీపీ నేతల కబ్జాలు, రౌడీయిజాలపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చా యి’’ అని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. బిల్ట్‌ ఏపీ పేరుతో విశాఖలోని 4000 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మేందుకు జగన్‌ సిద్ధమయ్యారన్నారు. గతం లో భూసమీకరణను వ్యతిరేకించిన జగన్‌ పూలింగ్‌ పేరుతో వేల ఎకరాలు పేదల నుంచి లాగేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.


పాదయాత్రలో తగరపువలస జ్యూట్‌మిల్లును తెరిపిస్తానన్న జగన్‌.. నేడు ఆ మిల్లు యాజమాన్యాన్ని బెదిరించి ఆ స్థలం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సిరిపురం జంక్షన్‌లో వేల కోట్ల విలువైన క్రైస్తవ మిషనరీ భూములు కొట్టేసి స్టార్‌ హోటల్‌ కట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆనందపురంలో రాజుల భూమి 50 ఎకరాలు, వాల్తేరు, దసపల్లా భూములు కొట్టేశారని విమర్శించారు. స్వామీ పూర్ణానంద సరస్వతి ఆశ్రమానికి చెందిన రూ.450 కోట్ల విలువైన భూమికి కూడా వైసీపీ నేతలు టెండరు పెట్టారన్నారు. 

Updated Date - 2020-02-19T10:38:53+05:30 IST