సీఎంగారూ... ఇచ్చిన హామీ మరిచారా...?

ABN , First Publish Date - 2021-10-29T05:43:28+05:30 IST

‘‘సీఎం గారూ.. ప్రతిపక్ష హోదాలో మాకు ఇచ్చిన హామీని మరిచారా?’’ అని ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

సీఎంగారూ... ఇచ్చిన హామీ మరిచారా...?
పశువైద్య కళాశాల గేటు వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు

ఆందోళన బాటలో పశువైద్య విద్యార్థులు

‘వెటర్నరీ బ్లాక్‌డే’తో నిరసన

ప్రొద్దుటూరు రూరల్‌, అక్టోబరు 28: ‘‘సీఎం గారూ.. ప్రతిపక్ష హోదాలో మాకు ఇచ్చిన హామీని మరిచారా?’’ అని ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  పశువైద్య ప్రమాణాలు ఉల్లంఘనలకు నిరసనగా గురువారం మండలంలోని గోపవరం సమీంలోగల పశువైద్య కళాశాల గేటు ముందు ‘వెటర్నరీ బ్లాక్‌డే’ నిర్వహించి ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వెటర్నరీ స్టూడెంట్స్‌, గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ 2018లో గన్నవరంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు తాను ముఖ్యమంత్రి అయితే రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్స్‌ (ఆర్‌ఎన్‌యూ), వెటర్నరీ డిస్పెన్సరీ (వీడీ)లను అప్‌గ్రేడ్‌చేసి పశువైద్య పోస్టులను విడుదల చేస్తామని ప్రస్తుత వైఎస్‌ జగన హామీ ఇచ్చారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయి మూడేళ్లు అవుతున్నా ఆ హామీని మరిచారన్నారు. ఎన్‌సీఏ నిబంధనల ప్రకారం ప్రతి అయిదు వేల లైవ్‌స్టాక్‌ యూనిట్లకుగాను ఒక పశువైద్యుని నియామకం జరిపించాల్సి ఉండగా ఇది ఎక్కడా కూడా అమలుకావడం లేదన్నారు. రాష్ట్రంలో 3,839 మంది పశువైద్యులకు గాను ప్రస్తుతం కేవలం 1588 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఇంకా 2,251 మంది పశువైద్యుల కొరత ఉన్నా కూడా అందుకు అనుకూలంగా నియామకాలు చేపట్టడం లేదన్నారు. ఎటువంటి పశువైద్యం తెలియని వెటర్నరీ అసిస్టెంట్లను నియమించి మూగజీవాలకు వైద్యం అందించడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్‌ఎల్‌యూలను, వీడీలను అప్‌గ్రేడ్‌ చేసి కొత్తవారితో నియామకాలు జరపాలన్నారు. అనంతరం వారు కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ వై.వైకుంఠరావును కలిసి తమ డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Updated Date - 2021-10-29T05:43:28+05:30 IST