Abn logo
Jun 13 2021 @ 23:20PM

పారిశ్రామికవాడలో రోడ్ల అభివృద్ధి పట్టదా?

 గుంతలమయంగా గడ్డపోతారం, కాజీపల్లి, బొల్లారం రోడ్లు

 వర్షాలకు రోడ్లపై నిలుస్తున్న నీరు

 ఏటా రూ.కోట్లలో పన్నులు చెల్లిస్తున్న పరిశ్రమలు


జిన్నారం, జూన్‌ 13: ఏటా ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు కోట్ల రూపాయల పన్నులు కడుతూ, వేల మందికి ఉపాధి కల్పిస్తున్న జిన్నారం మండలంలోని గడ్డపోతారం, కాజీపల్లి, బొల్లారం పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల రహదారులు అధ్వానంగా మారాయి. ఎక్కడ చూసినా రెండు అడుగుల మేర గోతులు, రోడ్లపైనే మోకాలి లోతు వరకు నీరు, గుంతల మయంగా మారిన రోడ్లతో కార్మికులు, పరిశ్రమల ప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. 


450  పరిశ్రమల నుంచి పన్ను


మూడు పారిశ్రామిక ప్రాంతాల్లో కలిపి 450 వరకు పరిశ్రమలు ఉన్నాయి. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో 300 పరిశ్రమలుండగా ఏటా రూ.10 కోట్ల వరకు, గడ్డపోతారంలో 60 పరిశ్రమలుండగా ఏటా రూ.4 కోట్ల వరకు, కాజీపల్లిలో 15 పరిశ్రమలకు గాను రూ.3 కోట్ల వరకు ఆయా స్థానిక సంస్థలకు పన్నుల రూపంలో ఆదాయం అందుతోంది. కానీ పారిశ్రామిక వాడల్లో రహదారుల అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న పరిశ్రమలకు తరచూ వస్తున్న విదేశీ ప్రతినిఽధులు రహదారులను చూసి నివ్వెరపోతున్నారు. తాము స్థానిక సంస్థలకు ఏటా కోట్లలో పన్నులు, అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా సీఎ్‌సఆర్‌ ద్వారా నిధులిస్తున్నా రోడ్ల అభివృద్ధికి ప్రయత్నించడం లేదని పరిశ్రమల ప్రతినిధులు వాపోతున్నారు.