Abn logo
Oct 30 2020 @ 22:05PM

ఆమెను సీఎంని చేయడం తప్ప లాలూ చేసిందేమైనా ఉందా?: నితీశ్

Kaakateeya

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఇవాళ ప్రతిపక్ష ఆర్జేడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్జేడీ నేతలు చెప్పే ‘‘మాయమాటలు’’ నమ్మొద్దనీ.. వారి హయాంలో మహిళలు, వెనుకబడిన తరగతులకు చేసిందేమీ లేదంటూ ఆయన దుయ్యబట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పరబత్తాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు ఇవాళ బాగానే మాట్లాడుతున్నారు. కానీ ఇంతకు ముందు వారి పాలనలో మహిళల పరిస్థితి ఏమిటి? ఒక్కరు కూడా మహిళలను పట్టించుకున్న పాపాన పోలేదు...’’ అని సీఎం పేర్కొన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పైనా నితీశ్ పరోక్షంగా విమర్శలు సంధించారు. ‘‘ఆయన జైలుకు వెళ్లినప్పుడు సీఎం కుర్చీలో తన భార్య (రబ్రీదేవి)ని కూర్చోబెట్టారు. దీనికి మించి మహిళలకు ఆయన చేసిందేమీ లేదు..’’ అని పేర్కొన్నారు. 1990లో లాలూ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 1997లో దాణా కుంభకోణం కేసులో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తన పదవిని సతీమణి రబ్రీదేవికి అప్పగించి జైలుకు వెళ్లారు. 

Advertisement
Advertisement