క్రీడాకారిణుల దుస్తులపైనా అదే చూపా?

ABN , First Publish Date - 2021-07-30T10:09:58+05:30 IST

మేటి క్రికెటర్ మిథాలీ రాజ్‌ను మీ అభిమాన పురుష క్రికెటర్ ఎవరని గతంలో ఒక జర్నలిస్ట్ ప్రశ్నించాడు. మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరని పురుష క్రికెటర్లను అడగగలరా...

క్రీడాకారిణుల దుస్తులపైనా అదే చూపా?

మేటి క్రికెటర్ మిథాలీ రాజ్‌ను మీ అభిమాన పురుష క్రికెటర్ ఎవరని గతంలో ఒక జర్నలిస్ట్ ప్రశ్నించాడు. మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరని పురుష క్రికెటర్లను అడగగలరా? అని రాజ్ సమాధానంగా మరో ప్రశ్న సంధించారు. క్రీడ ఏదైనా మగాళ్లకే మన్నన. మగువలను పట్టించుకోరు. నటీమణుల ప్రతిభతోనే ఎక్కువ సినిమాలు బాగా ఆడుతాయి. ఐనా పేరు హీరోదే, హీరోయిన్‌కు రాదు. అమెరికన్ నృత్యకారుడు, నటుడు ఫ్రెడ్ ఆస్టెయిర్ చేసిన భంగిమలన్నిటినీ అమెరికన్ నాట్యనటి జింజర్ రోజర్స్ ఎత్తు మడమల చెప్పులతో వెనక్కు వంగి కూడా చేశారు. పేరు ఫ్రెడ్‌కే వచ్చింది కానీ, జింజర్‌కు రాలేదు. నేటి ఒలింపిక్స్‌లో ప్రథమ శ్రేణి క్రీడాకారిణుల నైపుణ్యాలూ ఇలాంటివే. పురుష ఆటగాళ్లు ఆడిన ఆటలు, క్రీడలు కొన్నిటిని అంతకుమించే క్రీడాకారిణులూ ఆడారు. కానీ వారి క్రీడా దుస్తుల విషయంలో అనేక ఆంక్షలు, అభాండాలు కొనసాగుతూనే ఉన్నాయి.  


ఆడవాళ్ళ రెచ్చగొట్టే దుస్తులే అత్యాచారాలకు కారణమని కొందరు పురుషాహంకారుల అభాండం. గ్రేట్ బ్రిటన్ క్రీడాకారిణి ఒలీవియా బ్రీన్ బ్రీఫ్ (చిన్న నిక్కరు) చాలా పొట్టిదని, తగనిదని ఒక పురుష--–సంస్కారంగల మహిళ వ్యాఖ్యానించడం విడ్డూరం. ఆమె బ్రీఫ్‌ను పరుగుపందెం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. నార్వే మహిళా హ్యాండ్‌బాల్ టీం నిక్కర్లు చాలా పొడవుగా ఉన్నాయని మరో నింద. పొట్టిగా ఉన్నా పొడవుగా ఉన్నా తప్పే. 


ఈ ఏడాది ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జారీచేసింది. మాధ్యమాలేవీ మహిళలను లైంగికంగా చూపకూడదు, వారి సమగ్రతను కాపాడాలి, ఆడుతున్నప్పుడు అసందర్భ సమయాల్లో వారి శరీర భాగాలు కనిపిస్తున్న చిత్రాలను ప్రదర్శించకూడదు. అయినా మృగదృష్టిలో ఈ సూచనలు పనిచేయలేదు. ఇంటా, బయటా, పనిలో, ప్రయాణంలో, ఆటలలో అనుకూలమైన, సౌకర్యమైన నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ మహిళలకు ఉండాలి. మగాళ్లు ఆటలతో సహా ప్రతి ప్రక్రియలో మహిళల పనితనాన్ని మాత్రమే చూడాలి. బట్టల వెనుక దాగిన అంగాలను, అందాలను కాదు. రాజ్యాంగాలు ప్రసాదించిన మహిళా సమానతను అందరూ మన్నించాలి.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి

Updated Date - 2021-07-30T10:09:58+05:30 IST