Hima Das: కామన్వెల్త్ గేమ్స్‌లో హిమదాస్ స్వర్ణం గెలిచిందా? హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!

ABN , First Publish Date - 2022-07-31T01:57:30+05:30 IST

కామన్వెల్త్ క్రీడల అప్‌డేట్ చూస్తున్న వారికి హిమదాస్ (Hima Das) స్వర్ణం గెలిచిందన్న వార్త సోషల్ మీడియాలో

Hima Das: కామన్వెల్త్ గేమ్స్‌లో హిమదాస్ స్వర్ణం గెలిచిందా? హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల అప్‌డేట్ చూస్తున్న వారికి హిమదాస్ (Hima Das) స్వర్ణం గెలిచిందన్న వార్త సోషల్ మీడియాలో కనిపించింది. అంతే.. ఆ తర్వాత అది ఎంతగా వైరల్ అయిందంటే.. తామెక్కడ వెనకబడిపోతామోనన్న భావనతో కొన్ని మీడియా చానళ్లు కూడా వెనకాముందు ఆలోచించకుండా బ్రేకింగ్స్ ఇచ్చేశాయి. ఇంకేముంది?.. సగటు భారత అభిమాని ఒళ్లు పులకించి పోయింది. హిమదాస్‌కు అభినందనలు చెప్పేందుకు సోషల్ మీడియా పోటీపడింది. అందులో మన టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా ఉన్నాడు. 


హిమదాస్ స్వర్ణం గెలిచిందంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నా జాతీయ మీడియాలోనూ, ప్రధాన స్పోర్ట్స్ సైట్లలోనూ ఆ వార్త కవర్ కాకపోవడంతో అభిమానులను ఏదో శంక పీడించింది. చివరికి ఆరా తీస్తే అసలు విషయం తెలిసి సెహ్వాగ్ సహా అందరూ తాము తప్పులో కాలేసినట్టు తెలుసుకున్నారు. మరి హిమదాస్ స్వర్ణం గెలిచిందన్న వార్త ఎలా బయటకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం.


కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో సంకేత్ సర్గర్ (Sanket Sargar) రజతం సాధించి పతకాల ఖాతా తెరిచాడన్న వార్తతోపాటే హమదాస్ స్వర్ణం గెలిచిందంటూ ఓ వీడియో కూడా సర్క్యూలేట్ అయింది. దీంతో అభిమానులు సంబరాలు మొదలెట్టేశారు. హిమదాస్ స్వర్ణం గెలిచిన ఆ వీడియో నిజమే అయినా.. అది ఇప్పటిది కాదు. 2018 జూనియర్ చాంపియన్‌షిప్‌కు సంబంధించినది. అసలు విషయం తెలిశాక అందరూ నిట్టూర్చారు. అప్పటి వరకు బ్రేకింగ్ వేసిన న్యూస్ చానళ్లు నాలుక్కరుచుకుని ఆ వార్తను ఉపసంహరించుకున్నాయి.


ఇంటర్నేషనల్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన ఇండియన్‌గా హిమదాస్ పేరిట రికార్డు ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఆమె పాల్గొంటోంది. ఆగస్టు 3న ఆమె 4X100 మీటర్ల రిలేలో ఆమె పాల్గొనాల్సి ఉంది. కాబట్టి కామన్వెల్త్‌లో హిమదాస్ ఇప్పటి వరకు ఎలాంటి పతకం గెలవలేదన్నది నిజం.



Updated Date - 2022-07-31T01:57:30+05:30 IST