Abn logo
Oct 20 2021 @ 01:31AM

డయేరియా కలకలం

ఎనికేపాడు కేవీఆర్‌ కాలనీలో మహిళ మృతి.. 30 మందికి అస్వస్థత

కాలనీ వాసుల్లో కలవరం

కదిలిన వైద్య ఆరోగ్యశాఖాధికారులు 

కాలనీలో సర్వే.. వైద్య శిబిరం ఏర్పాటు 

పరీక్షకు తాగునీటి నమూనాలు


విజయవాడ రూరల్‌ మండలంలోని ఎనికేపాడును  డయేరియా వణికిస్తోంది. గ్రామంలోని కేవీఆర్‌ కాలనీలో ఇప్పటికే డయేరియా కారణంగా ఒక మహిళ మృతి చెందగా, 30 మంది అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని మంగళవారం ఉదయం కాలనీని సందర్శించి, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి, ప్రజలకు పలు సూచనలను చేశారు.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ/గుణదల) : విజయవాడ నగర శివారులోని ఎనికేపాడు గ్రామంలోని కేవీఆర్‌ కాలనీ వాసులు 15 రోజులుగా జ్వరాలతో బాధపడుతుండగా, తాజాగా ఆ కాలనీలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా 30 మందికి పైగా కాలనీవాసులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఇవే లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కె.లీల (59) అనే మహిళ మరణించడంతో ప్రస్తుతం ఆ కాలనీవాసులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని మంగళవారం ఉదయం కాలనీని సందర్శించి, వైద్య బృందాలను రంగంలోకి దించారు. ఇంటింటి సర్వే చేయించారు. దాదాపు ప్రతి ఇంట్లోనూ బాధితులు ఉండటంతో కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితులకు అవసరమైన వైద్యసహాయాన్ని ఉచితంగానే అందజేస్తున్నారు. బాధితులందరికీ ఒకే రకమైన వ్యాధి లక్షణాలు ఉండటంతో అంటు వ్యాధుల నిపుణులను కూడా రప్పించి, కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారు. కాలనీవాసులు తాగుతున్న మంచినీటి నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపించారు. కలుషిత నీరు, లేదా ఆహారం వల్లనే కాలనీవాసులు అనారోగ్యానికి గురయినట్టు భావిస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసిని తెలిపారు. ఇప్పటికే తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపించామని, వాటి రిపోర్టులు రావాల్సి ఉందని ఆమె చెప్పారు. 


పారిశుధ్యం అధ్వానం

కేవీఆర్‌ కాలనీలో దాదాపు 80 ఇళ్లు ఉన్నాయి. వీటిలో  కొన్ని అపార్టుమెంట్లు ఉన్నాయి. నివాసాల మధ్య కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. వీధుల్లో చెత్తాచెదారాలు పేరుకుపోయాయి. ఇటీవల అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రెయిన్లలోని మురుగునీరు పొంగి పొర్లుతోంది. అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నవారు పడేస్తున్న వ్యర్థాలతో ఖాళీ స్థలాలు డంపింగ్‌ యార్డుల్లా తయారవుతున్నాయి. ఫలితంగా దోమల బెడద పెరిగిపోయింది. కాలనీలో ఇంటింటికీ తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసినా, పైపులు మధ్యలో పగిలిపోవడంతో తాగునీరు కలుషితమవుతోందని, ఆ నీటిని తాగుతున్నందునే డయేరియా వ్యాపిస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 


సురక్షిత నీటినే తీసుకోవాలి

వాతావరణ మార్పుల వల్ల సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సురక్షితమైన నీటిని తాగడం, పరిశుభ్రత పాటించడం ద్వారానే ఇటువంటి అంటు వ్యాధులను నివారించవచ్చునని చెబుతున్నారు. అతిసార బారినపడిన బాధితులు మల, మూత్ర విసర్జనల తర్వాత.. అన్నం తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, అతిసారతో బాగా నీరసించినవారు లవణాలతో కూడిన నీటిని (ఓఆర్‌ఎస్‌) తరచూ తాగుతుండాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి రోగిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచిస్తున్నారు.


అదుపులోనే అతిసార

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసిని 

గుణదల : కాలనీలో అతిసార అదుపులోనే ఉన్నదని, బాధితులు కోలుకున్నారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసిని తెలిపారు. మంగళవారం కాలనీలో పర్యటించిన డీఎంహెచ్‌వో మీడియాతో మాట్లాడుతూ, తాగునీటి నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామన్నారు. కాలనీవాసులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వేడి ఆహారాన్నే భుజించాలని చెప్పారు. తొలుత ఇంటింటికీ వెళ్లి, స్థానికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. డీఎంహెచ్‌వో వెంట జిల్లా అంటు వ్యాధుల నియంత్రణాధికారిణి పి.సుకుమారి, రామకృష్ణ, అద్దంకి శ్రీనివాసరావు, ఉప్పులూరు పీహెచ్‌సీ అధికారి డాక్టర్‌ సుందర్‌కుమార్‌, డాక్టర్‌ పావని, సర్పంచ్‌ పూర్ణచంద్రరావు, కార్యదర్శి కృపాకుమార్‌ ఉన్నారు.

వైద్య శిబిరంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసిని