మన డయానా

ABN , First Publish Date - 2020-07-06T05:30:00+05:30 IST

కరుణ, దయ, సేవ, మానవత్వం... వీటికి మారుపేరు ప్రిన్సెస్‌ డయానా! ఆ లక్షణాలను ప్రపంచ యువతలో అలవరుస్తూ.. వారిని సానుకూల మార్పు వైపు నడిచేలా స్ఫూర్తి నింపుతోంది బ్రిటన్‌కు చెందిన ‘ది డయానా అవార్డు’...

మన డయానా

కరుణ, దయ, సేవ,  మానవత్వం... వీటికి మారుపేరు ప్రిన్సెస్‌ డయానా! ఆ లక్షణాలను ప్రపంచ యువతలో అలవరుస్తూ.. వారిని సానుకూల మార్పు వైపు నడిచేలా స్ఫూర్తి నింపుతోంది బ్రిటన్‌కు చెందిన ‘ది డయానా అవార్డు’.  డయానా జ్ఞాపకార్థం ఏటా ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ఈసారి మన తెలుగమ్మాయి... పదిహేనేళ్ల శ్రియా దోనేపూడికి కూడా దక్కింది. ఇంతకీ ఎవరీ శ్రియ? ఏమిటీ  ఆమె ఘనత? ఆ బాలిక మాటల్లోనే... 


‘‘పెళ్లిళ్లు, పేరంటాలు... ఏ శుభకార్యం జరిగినా పూలతో అలంకరణలు సాధారణం. కార్యక్రమం అయిపోగానే..! అప్పటి వరకూ పరిమళించిన పువ్వులు చెత్తబుట్టలోకి వెళ్లిపోతాయి. అలా కాకుండా వాటికి మళ్లీ గుబాళింపు తెస్తే! ఈ ఆలోచనే అద్భుతమనిపించింది. అలా పుట్టిందే ‘వాడిన’ పువ్వులకు పునరుజ్జీవం! అదే... రీసైక్లింగ్‌! తద్వారా పేద మహిళలకు ఉపాధి లభిస్తుంది. ఆ ప్రయత్నమే నాకు ‘డయానా అవార్డు’ తెచ్చిపెట్టింది. నిజానికి ఇది మా స్కూల్‌ ప్రాజెక్ట్‌. 




ఖాళీగా ఉండను... 

మాది హైదరాబాద్‌. నాన్న వేణు దోనేపూడి ‘కార్జ్‌’ సంస్థ ఎండీ. అమ్మ శ్వేత గృహిణి. చెల్లి శ్రీదా ఐదో తరగతి. నేను ‘ఓక్రిడ్జ్‌’ ఇంటర్నేషనల్‌ స్కూల్లో టెన్త్‌ పూర్తిచేసి, లెవెన్త్‌ స్టాండర్డ్‌లోకి వచ్చా. స్కూల్లో తరచూ రకరకాల ఈవెంట్స్‌ జరుగుతుంటాయి. అన్నింటిలో పాల్గొనేదాన్ని. అప్పుడప్పుడూ పెయింటింగ్స్‌ వేస్తా. అలా వేసిన పెయింటింగ్స్‌తో గత ఏడాది హైదరాబాద్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఎగ్జిబిషన్‌ కూడా పెట్టాను! ఎప్పుడూ ఖాళీగా ఉండను. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. స్కూల్‌ టాప్‌-5లోనే ఉంటాను. 


సింబల్‌ ఆఫ్‌ లైఫ్‌...  

స్కూల్లో ప్రాజెక్టును ఏదో మొక్కుబడిగా చేయకూడదనే పూల రీసైక్లింగ్‌తో ఉత్పత్తులు తయారు చేయాలనుకున్నా. కానీ వస్తువుల తయారీ ఎలా? ఇంటర్‌నెట్‌లో రకరకాల వీడియోలు, ప్రాజెక్ట్‌లు చూస్తూ, ముఖ్యమైన పాయింట్స్‌ రాసుకుంటూ, కావాల్సిన మెటీరియల్‌ సంపాదించాను. ప్రాజెక్ట్‌కు ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తుంటే...  ‘అంక్‌’ అని తట్టింది. ఈజిప్ట్‌ భాషలో ‘అంక్‌’ అంటే ‘సింబల్‌ ఆఫ్‌ లైఫ్‌’ అని అర్థం.


కాలుష్యరహితమే లక్ష్యం... 

పూలు సేకరించాను. ఇతర వస్తువులు సమకూర్చుకున్నాను. రీసైక్లింగ్‌ మొదలుపెట్టాను. ఆ వ్యర్థాలతో సబ్బులు, అగరబత్తులు, రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌, క్యాండిల్స్‌, పేపర్‌ వెయిట్స్‌ తయారు చేశాను. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలోని మహిళలకు వీటి తయారీ నేర్పించాను. వాటిని మార్కెట్‌ ధర కన్నా తక్కువకే అమ్మాను. సాధ్యమైనంత మందికి ఉపాధి కల్పించాలి. కాలుష్యరహిత వస్తువులు తయారు చేయాలి... ఇదే నా ఆశయం. దానికి ఈ అవార్డు చెప్పలేనంత ప్రోత్సాహాన్నిచ్చింది. 


స్కూల్‌వాళ్లే నన్ను ‘డయానా అవార్డ్‌’కు ప్రతిపాదించారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి యువతరానికే ఉంద’ని వేల్స్‌ రాణి డయానా విశ్వసించేవారట. ఆమె విశ్వాసాన్ని నిలబెట్టేలా... యువత జీవితాల్లో ‘సానుకూల మార్పు’ (పాజిటివ్‌ ఛేంజ్‌) తెచ్చేలా ప్రోత్సహించి, అభివృద్ధి పథం వైపు నడిపించడమే ఈ అవార్డు ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో నామినేషన్లు వస్తాయి. అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉన్నవారిని అవార్డుకు ఎంపిక చేస్తారు. 




మాటల్లో చెప్పలేను... 

‘ద డయానా అవార్డు’కు నేను ఎంపిక కావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఏటా జూలై 1 డయానా పుట్టినరోజు నాడు ఈ అవార్డును లండన్‌ రాయల్‌ ప్యాలె్‌సలో ప్రదానం చేస్తారు. కానీ కరోనా వల్ల కుదరలేదు. వర్చ్యువల్‌గా బుధవారం అవార్డు అందుకున్నా. ఇష్టపడి కష్టపడితే ఫలితం ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. నన్ను చూసి ఒక్కరు స్ఫూర్తి పొందినా... నా ప్రయత్నం ఫలించినట్టే!’’


గర్వంగా ఉంది!

‘‘శ్రియను చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. చిన్నప్పటి నుంచి తను అన్నింటిలో పోటీపడేది. అది చదువైనా... ఆటలైనా! కొంతకాలం కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది. చక్కగా పాడుతుంది. పిల్లల విషయంలో మేము ఎప్పుడూ 

గిరి గీయలేదు. వారికి ఏది నచ్చితే అందులోనే ప్రోత్సహిస్తూ వస్తున్నాం. ఓ పరిశ్రమ పెట్టి, విభిన్న ఉత్పత్తులు తయారు చేయాలనీ, దాని ద్వారా కొందరికైనా ఉపాధి కల్పించాలనీ శ్రియ కోరిక. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. శ్రియను చూసి మా చిన్నమ్మాయి కూడా ఏదో చేసేయాలని కలలు కంటోంది. శ్రియకు ‘డయానా అవార్డు’ రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది.’’ - వేణు దోనేపూడి, శ్రియ తండ్రి


మరో ఇద్దరికి కూడా..!

శ్రియతో పాటు నగరానికి చెందిన రిషి వర్మా వేగేశ్న, విషిత్‌ వైభవ్‌లకు కూడా ‘డయానా అవార్డు’ దక్కింది. విశేషమేమంటే... వీరిద్దరూ చదివేది ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లోనే! ప్రపంచవ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల మధ్యనున్న వందకు పైగా ‘ఛేంజ్‌ మేకర్స్‌’ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత్‌ నుంచి దాదాపు 20 మంది ఉన్నారు. రిషి తాతగారి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలోని కాళ్లకూరు నాడు వరదలకు అతలాకుతలమైంది. ఇది కళ్లారా చూసిన రుషి ఆ ఊరి వాళ్లను ఆదుకోవడానికి ‘స్వయంకృషి’ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేశాడు. ఊళ్లోవాళ్లకు ఇంటి వంటలు తయారు చేసి, విక్రయించడం నేర్పించాడు. వారికి మంచి ఆదాయ మార్గం చూపాడు. అదే అతడికి ‘డయానా అవార్డు’ తెచ్చిపెట్టింది. అలాగే వైభవ్‌ చేసిన ఓ ప్రాజెక్ట్‌ అవార్డు కమిటీని ఆకర్షించింది.


-హనుమా

Updated Date - 2020-07-06T05:30:00+05:30 IST