వజ్రోత్సవ సందడి

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

ఆజాదికా అమృత్‌ మహోత్సవం పురస్కరించుకుని 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలను ఈ వజ్రోత్సవాల్లో భాగస్వాములను చేస్తూ 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణను రూపొందించారు.

వజ్రోత్సవ సందడి
వెయ్యి అడుగుల జెండాతో నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

- హర్‌ఘర్‌ తిరంగ్‌ పేరుతో జిల్లా వ్యాప్తంగా వేడుకలు

- ఊరూరా పండుగ వాతావరణం

- ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ

- ఇంటిపై జెండాలు ఎగుర వేసేందుకు సిద్ధం

- జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటిన అన్ని వర్గాల ప్రజలు

- జాతీయ జెండాలతో ప్రదర్శనలు

- అచ్చంపేటలో 1000 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ

- వజ్రోత్సవాల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు


కామారెడ్డి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఆజాదికా అమృత్‌ మహోత్సవం పురస్కరించుకుని 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలను ఈ వజ్రోత్సవాల్లో భాగస్వాములను చేస్తూ 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే ప్రారంభమైన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలతో జిల్లాలో సందడిగా మారింది. జాతీయ జెండాను ఇంటింటా ఎగురవేయాలనే నినాదంతో జెండాల పంపిణీ కొనసాగుతుంది. ఊరువాడ జాతీయ జెండాలతో ఊరేగింపులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

హర్‌ఘర్‌ తిరంగ్‌ పేరుతో జెండాల పంపిణీ

హర్‌ఘర్‌ తిరంగ్‌ పేరుతో జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వాడవాడన, గ్రామగ్రామాన జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 70 వేలకు పైగా జాతీయ జెండాలు రాగా ఇంటింటా పంపిణీ చేపడుతున్నారు. 13,14,15 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఇంటిపై నిబంధనలను పాటిస్తూ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 21 వరకు అన్ని వర్గాల ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచేలా హర్‌ఘర్‌ తిరంగ్‌ పేరుతో ప్రత్యేక వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వజ్రోత్సవాల్లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాలల విద్యార్థులకు థియేటర్‌లలో ఉచితంగా గాంధి సినిమాతో పాటు పలు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను చూపిస్తున్నారు.

రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోనూ కార్యక్రమాలు

75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు సైతం వజ్రోత్సవాల్లో పాల్గొంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ఇతర పార్టీల నేతలు నాయకులు కార్యకర్తలు సైతం 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా పంపిణితో పాటు అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు అవుతున్నారు. కాంగ్రెస్‌ ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రను ఈనెల 14 నుంచి చేపట్టనుంది. జిల్లాలో 75 కి.మీ వరకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో 3000ల అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీని నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీలే కాకుండా పలు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఊరూరా పండుగ వాతావరణం

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు సుమారు 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు ప్రారంభం కావడంతో గల్లీ, గల్లీనా, వాడవాడన, గ్రామగ్రామానా జాతీయ జెండాల ప్రదర్శన కొనసాగుతుంది. బుధవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో జాతీయ జెండాల ఊరేగింపు నిర్వహించారు. దీంతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొంటుంది. నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట గ్రామంలో ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల జాతీయ పతాకం ర్యాలీ నిర్వహించారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరై జాతీయ జెండాలను పంపిణీ చేశారు. భిక్కనూరు మండలంలో వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మొక్కలను నాటారు. ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యే సురేందర్‌, స్థానిక నాయకులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు మొక్కలను నాటారు. జిల్లా పోలీసుభవన్‌ ఆవరణలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరు అధికారులు మొక్కలను నాటారు.

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST