వక్కేరులో వజ్రాల వేట

ABN , First Publish Date - 2022-08-08T04:41:32+05:30 IST

నల్లమలలోని మహానంది మండలం సర్వ నరసింహుని ఆలయం సమీపంలోని వక్కిలేరు వాగు వర్షాలకు ప్రవహిస్తోంది.

వక్కేరులో వజ్రాల వేట
వక్కిలేరు వాగులో వజ్రాల కోసం అన్వేసిస్తున్న జనాలు

నిండుగా ప్రవహిస్తున్న వాగు
తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న జనాలు


మహానంది, ఆగస్టు7: నల్లమలలోని మహానంది మండలం సర్వ నరసింహుని ఆలయం సమీపంలోని వక్కిలేరు వాగు వర్షాలకు ప్రవహిస్తోంది. ఈ వాగులో వజ్రాలు కొట్టుకొని వస్తాయని ప్రచారం. అందుకే ఇటీవలి వర్షాలకు వక్కిలేరు ఉప్పొంగిన విషయం తెలియగానే తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది వాహనాల్లో అక్కడికి చేరుకుంటున్నారు. వాగు వెంట వజ్రాల వేట సాగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. పిల్లాపాపలతో సూర్యోదయం నుంచి పొద్దుగుంకే దాకా వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఒక వజ్రమైనా దొరక్కపోదా అని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచేగాక గుంటూరు, వైజాగ్‌, ప్రకాశం, కృష్ణా, కడప, అనంతపురం జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొందరు రాత్రిళ్లు సర్వనరసింహస్వామి ఆలయం పరిసరాల్లోని మంటపాల్లో తలదాచుకుంటున్నారు. కొందరు గాజులపల్లి గ్రామంలో అద్దెకు ఇళ్లు తీసుకొని మరీ వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.

రెండు నెలలుగా వెతుకుతున్నా

నేను రెండునెలల క్రితం మండలంలోని వక్కిలేరు వాగు చేరుకున్నాను. ఇంతవరకు ఒక వజ్రం కూడా లభించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతుకుతూనే ఉన్నాను. గాజులపల్లిలో భిక్షాటన చేసుకొని కడుపు నింపుకొని వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నాను.

-రవి, అనకాపల్లి, (వైజాగ్‌)

 ప్రతి ఏడాదీ వస్తుంటాను

వజ్రాల కోసం నేను ప్రతి ఏడాది వక్కిలేరు వాగు వద్దకు వస్తాను. రాత్రిళ్లు సర్వనరసింహస్వామి ఆలయంలో తలదాచుకొని పగలంతా ఇక్కడ వజ్రాల కోసం వెతుకుతున్నాను.

-వెంకటరెడ్డి, కారంపూడి, గుంటూరు జిల్లా

Updated Date - 2022-08-08T04:41:32+05:30 IST