ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నాం.. ఆదుకోండి

ABN , First Publish Date - 2020-09-17T08:04:54+05:30 IST

‘‘ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం. కరోనా సమయంలో డయాలిసిస్‌ అందక ప్రాణాలు

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నాం.. ఆదుకోండి

డయాలసిస్‌ అందక ఇప్పటికే 20 మంది మృతి

మందుల ఖర్చులు భరించలేకపోతున్నాం

పెన్షన్‌ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి

రాష్ట్ర ప్రభుత్వానికి కిడ్నీ పేషెంట్ల వినతి

నిమ్స్‌ వద్ద డయాలిసిస్‌ పేషెంట్ల ధర్నా



బేగంపేట/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం. కరోనా సమయంలో డయాలిసిస్‌ అందక ప్రాణాలు పోతున్నాయి. మందుల ఖర్చుకు డబ్బుల్లేక తల్లడిల్లిపోతున్నాం. మమ్ములను ఆదుకోండి. పెన్షన్‌ ఇచ్చి కాపాడండి’’ ఇది ప్రభుత్వానికి డయాలిసిస్‌ బాధితులు చేసిన వేడుకోలు. తమ గోడు వినాలంటూ డయాలిసిస్‌ బాధితులు బుధవారం నిమ్స్‌ ఆస్పత్రి గేటు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కిడ్నీ పేషెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌ మాట్లాడారు. డయాలిసిస్‌ పేషెంట్లకు కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సరైన సేవలందక 20 మంది వరకు ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టాలకు ముందు నిమ్స్‌లో రోజూ 250కి డయాలసిస్‌ నిర్వహించే వారని, ఇప్పుడు 150 మందికే చేస్తున్నారని తెలిపారు. రోజు విడిచి రోజు చేయాల్సిన డయాలిసిస్‌ను ప్రస్తుతం ఐదారు రోజులకు చేస్తున్నారని వాపోయారు. నిమ్స్‌లో 55 మిషన్లు ఉన్నా.. 32 యంత్రాల ద్వారానే డయాలసిస్‌ చేస్తున్నారని వివరించారు. ఇతర ప్రాంతాల్లోని కేంద్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందన్నారు. ఏపీ సర్కారు డయాలిసిస్‌ పేషెంట్లకు రూ.10 వేలు ఇస్తోందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తీరుగా పెన్షన్‌ ఇచ్చి ఆదుకోవాలని అసోసియేషన్‌ నేత మోహన్‌ విజ్ఞప్తి చేశారు. ధర్నాలో 50 మందికి పైగా డయాలిసిస్‌ పేషెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-17T08:04:54+05:30 IST