షుగరు వ్యాధికి గొప్ప మందు తిప్పతీగ ఆకుల కూర

ABN , First Publish Date - 2021-11-20T04:46:22+05:30 IST

తిప్ప (దిబ్బ)ల మీద మొలిచే తీగ కాబట్టి ఇది తిప్పతీగగా ప్రసిద్ధి పొందింది. టీనోస్పోరా కార్డిఫోలియా అనేది దీని వృక్షనామం. గుడూచి, అమృత, అమృతవల్లి, మధుపర్ణి, చిన్నోభవ అనే పేర్లతో పాటు....

షుగరు వ్యాధికి గొప్ప మందు తిప్పతీగ ఆకుల కూర

తిప్ప (దిబ్బ)ల మీద మొలిచే తీగ కాబట్టి ఇది తిప్పతీగగా ప్రసిద్ధి పొందింది. టీనోస్పోరా కార్డిఫోలియా అనేది దీని వృక్షనామం. గుడూచి, అమృత, అమృతవల్లి, మధుపర్ణి, చిన్నోభవ అనే పేర్లతో పాటు, తాంత్రిక, కుండలిని, చక్రలక్షణిక లాంటి తాంత్రిక విద్యకు సంబంధించిన పేర్లు కూడా దీనికున్నాయి. దీని ఆకులు, పూలూ, కాండం, వేళ్లని దంచి తొట్టెలో నీళ్లతో కడుగుతారు. దీని లోపల ఉండే తెల్లని గుజ్జులాంటి పదార్థం ఆ నీటిలోకి దిగుతుంది. నీటిని వేరుచేసి, ఆ గుజ్జును ఎండిస్తారు. అదే తిప్పసత్తు లేదా గుడూచీ సత్వం పేరుతో ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. సాధారణంగా అన్ని ఆయుర్వేద ఔషధాలలోనూ ఇది కలుస్తుంది.


రాజనిఘంటువులో ‘‘ఙ్ఞేయా గుడూచి గురురుష్ణవీర్యం తిక్తా కషాయా జ్వరనాశినీ చ దాహార్తి తృష్ణా వమి రక్తవాత ప్రమేహ పాండు భ్రమహారిణీచ ’’ అంటూ తిప్పతీగకు గల మధుమేహనాశక గుణాన్ని పేర్కొంది. ఇతర మూత్రవ్యాధుల మీద కూడా ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. శరీరంలో మంటలుగా ఉండటాన్ని తగ్గిస్తుంది. దప్పికని పోగొడుతుంది. కీళ్లలో వచ్చే గౌట్‌ అనే నొప్పుల వ్యాధినీ, రక్తహీనతను, తలతిరుగుడు వ్యాధినీ, దగ్గు ఆయాసాల్ని తగ్గిస్తుందనీ పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుందనీ, హృదయానికి శక్తినిస్తుందనీ, జీర్ణాశయ వ్యవస్థను బలసంపన్నం చేస్తుందనీ ఆయుర్వేదం చెప్తోంది.


కరోనా సమయంలో ఆయుష్‌ శాఖవారు దీనితో చేసిన సంశమనీ మాత్రలు జ్వరాన్ని తగ్గించేందుకు వాడవచ్చని ప్రకటించిన తరువాత ఈ మొక్క గురించి ఆలోచించటం ప్రారంభించారంతా! ఇది రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ పెరుగుతూ కనిపిస్తుంది. ఎంత ఎత్తు స్తంభం దొరికితే అంత ఎత్తున పాకుతూ పోతుంది. తిప్పతీగని పెరట్లో కుండీలలో పెంచుకోవటానికి ఇప్పుడు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ఆకుల్ని దంచి కషాయం కాచుకుని టీలాగా తాగుతున్నారు. ఇది మంచి ఉపాయమే! 


గుడం అంటే తీపి పదార్ధం. ఉచ్చర్‌ అంటే శరీరంలోంచి ఖాళీ చేయటం. గుడూచి అనే పదానికి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేదనే అర్థాన్ని ఇలా అన్వయించవచ్చు. 


దీని ఆకుల్ని కూరగా చేసుకోవటం గురించి నలుడు పాకదర్పణంలో ఇలా సూచించాడు:

తిప్పతీగ చక్కని లేత ఆకుల్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడవండి. ఇతర ఆకుకూరల మాదిరే ఈ ఆకుల్ని కూడా చిన్న ముక్కలుగా తరగండి. తరిగిన ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరొకసారి కడగండి. ఓ నీళ్ల పాత్రలో తగినంత ఉప్పు, పసుపువేసి ఈ ఆకుల్ని ఉడకబెట్టి నీటిని వార్చేయండి. ఆకుల్లో ఉండే చేదు పోవటానికి ఇదొక ఉపాయం. శంఖచూర్ణంతో గానీ, వక్కలతోగానీ, మర్రిపాలతోగానీ, మర్రి ఆకులతోగానీ, బియ్యపుకడుగు నీళ్లతోగానీ ఉడికించినా తిప్పతీగలోని చేదు పోతుందన్నాడు నలుడు. ఇది ఒకరకమైన శుద్ధిప్రక్రియ. 


ఒక భాండీలో వెన్న లేదా నెయ్యి వేసి, మినప్పిండి, మిరియాలపొడి, జీలకర్ర పొడి, జాజికాయ పొడి, సైంధవ లవణం వీటిని తగినంత చేర్చి దోరగా వేయించి, ఉడికి శుద్ధి అయిన తిప్పతీగ ఆకులు కలిపి మూతపెట్టి బాగా మగ్గనివ్వండి. మీకు ఇష్టమైన సుగంధ ద్రవ్యాలను చేర్చి ఈ కూరను మరింత పరిమళభరితంగా, రుచిగా చేసుకోండి. నేతితో వండితే ‘అమృత భర్జితం’ అమృతం పోసి వండినంత రుచిగా ఉంటుందన్నాడు నలుడు. ‘రుచ్యం బల్యం త్రిదోషఘ్నం దీపనం ధాతువర్ధనం’ రుచికరమైనది, బలకరమైనది, మూడు దోషాలనూ హరిస్తుంది, సమస్త శరీర ధాతువుల్ని వృద్ధి చేస్తుందని ఈ తిప్పతీగ ఆకులతో వండిన కూర గుణాలను వివరించాడు. 


ఇంద్రుడి కారణంగా తిప్పతీగ ఈ భూమ్మీద అవతరించిందని మనవాళ్ల నమ్మకం. జఠరాగ్నిని పెంపు చేసి జీర్ణాశయవ్యవస్థను బలసంపన్నం చేయటం దీని గుణం. జీర్ణం కావటం అంటే ఆకలి వేయటం మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ, తీసుకున్న ఆహారం శక్తిగా, ధాతువులుగా మారేవరకూ జీర్ణప్రక్రియ కొనసాగుతుంది. ఆహారంలోని పిండిపదార్థాలు శక్తిగా మారకుండా జీర్ణప్రక్రియ మధ్యలోనే ఆగిపోవటం వలన మధుమేహవ్యాధి కలుగుతుంది. తిప్పతీగ ఈజీర్ణప్రక్రియను కొనసాగించటం ద్వారా శక్తి ఉత్పత్తికి తోడ్పడుతుంది. అందుకు అవరోధం కల్పించే వాత, పిత్త, కఫ దోషాలను ఇది సమస్థితిలో ఉంచి శరీర ధర్మాలు సక్రమంగా జరిగేలా సహకరిస్తుంది. 


వగరుగా, చేదుగా ఉండే ఆహార ద్రవ్యాలకు ఈ గుణాలు సహజంగా ఉంటాయి. అందుకనే ఆహారంలో ప్రతీరోజూ తప్పనిసరిగా వగరునీ, చేదునీ కొద్దిగానైనా తీసుకుంటూ ఉండాలని, ఆరు రుచుల సిద్ధాంతాన్ని ఆయుర్వేదం ప్రకటించింది. కాకర, తిప్పతీగె, వేప, కలబంద ఇలాంటివి ఇందుకు దోహదపడే ఆహార ఔషధాలు. చేదుగా ఉండే ద్రవ్యాలతో కూరలు చేసుకునే విధానాలను నలుడు ప్రత్యేకంగా వివరించాడు. వాటిని మనం అర్థం చేసుకుని ఆహార ప్రణాళికను రచించుకోవటం అవసరం. కాకర మాదిరిగానే దీనినీ కూరగా, పచ్చడిగా, పులుసుగా కూడా వండుకోవచ్చు. శుద్ధిప్రక్రియలు యథావిధిగా పాటించటం మంచిది.


గంగరాజు అరుణాదేవి 

Updated Date - 2021-11-20T04:46:22+05:30 IST