కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయి: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2022-04-18T20:11:57+05:30 IST

కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అరాచక పర్వానికి తెర తీశారని ధూళిపాళ్ల ఆరోపించారు.

కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయి: ధూళిపాళ్ల

గుంటూరు: కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అరాచక పర్వానికి తెర తీశారని టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయని, రాజకీయ ప్రత్యర్థి అయిన సోమిరెడ్డి ప్రతిష్ట దిగజార్చాలని కాకాణి ఆరోపణలు చేశారని, వాటి కోసం అక్రమ ఆధారాలు సృష్టించారని విమర్శించారు. అక్రమ ఆధారాలపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ కేసులో కాకాణి ఏ1గా ఉన్నారన్నారు. కల్పిత ఆధారాలు సృష్టించిన కేసులో ఆధారాలన్నీ కోర్టులో ఉన్నాయని, కాకాణిపై ఉన్న కేసులు విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వగా.. కోర్టు ఆ జీవోను నిరాకరించిందన్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోర్టులో చోరి ఉదంతం చోటు చేసుకుందన్నారు. 


ఈ చోరీపై చాలా అనుమానాలున్నాయని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సెలవు రోజు కోర్టు ఉద్యోగి కోర్టుకు ఎందుకు వెళ్ళాడని ప్రశ్నించారు. కాలువలో సంచి ఉన్నట్లు ఎలా చెప్పాడన్నారు. ఎస్పీ కల్పిత కధ అల్లారని, వేల కేసుల ఫైల్స్ ఉంటే కేవలం కాకాణి కేసుకు చెందిన ఆధారాలున్నా బీరువా మాత్రమే కనిపించిందా? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న కాకాణికి శిక్ష పడటం ఖాయమన్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే చోరీ చేశారన్నారు. న్యాయ వ్యవస్థకే మాయని మచ్చని, న్యాయ వ్యవస్థ ప్రతిష్ట కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా చోరీ జరగలేదని ధూళిపాళ్ల నరేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-18T20:11:57+05:30 IST