అధిక ధరలతో సామాన్యులను భక్షిస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2021-02-27T06:14:43+05:30 IST

అధిక ధరలతో సామాన్యులను భక్షిస్తున్న కేంద్రం

అధిక ధరలతో సామాన్యులను భక్షిస్తున్న కేంద్రం
నిరసన తెలుపుతున్న వామపక్షాల నాయకులు

వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌ వద్ద ధర్నా

విజయవాడ సిటీ: బ్యాంక్‌లకు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తులను రక్షిస్తూ, అధిక భారాలతో కేంద్ర ప్రభుత్వం సామాన్యులను భక్షిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా చేశారు. గ్యాస్‌ పొయ్యి కింద కట్టెలతో మంటలు వేసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరెంద్రమోదీకి వ్యతిరేకంగా నినదించారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ. 100 కు చేరిందని, దీనిలో రూ.36 వాటా కేంద్రానికి వెళ్లగా, రూ. 32 మాత్రమే రాష్ట్రానికి వస్తోందని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2.3 లక్షల కోట్ల ఆస్తులున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను తక్కువ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని లేదంటే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. నాలుగు వ్యూహాత్మక రంగాలను మినహాయించి మిగిలిన రంగాలన్నింటినీ ప్రైవేటీకరిస్తామన్న ప్రధాని వాఖ్యలపై ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడలేని కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం రాస్తారోకో చేసేందుకు బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర నేతలు వి.ఉమామహేశ్వరరావు, సీహెచ్‌ బాబురావు, అండ్ర మాల్యాద్రి, సీపీఐ మహిళా నాయకురాలు అక్కినేని వనజ, పలు కార్మిక, ప్రజా, విద్యార్ధి  సంఘాల నేతలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Updated Date - 2021-02-27T06:14:43+05:30 IST