జడ్పీలో ధూంధాం

ABN , First Publish Date - 2021-07-25T06:43:05+05:30 IST

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమం గా చేయలేదని, అధికారుల తీరుతో రైతులు నష్టపోయారని సభ్యులు ఆరోపించారు.

జడ్పీలో ధూంధాం
జడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిలదీత

ప్రోటోకాల్‌పై ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల మధ్య రగడ

ఛాంబర్‌ కేటాయింపుపై ఎంపీపీలు, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం

గెజిట్‌తో రాష్ట్రానికి అన్యాయం : ఎంపీ ఉత్తమ్‌

రాయలసీమకు అక్రమంగా నీటి తరలింపు : ఎంపీ కోమటిరెడ్డి

ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం : మంత్రి జగదీ్‌షరెడ్డి

వాడీవేడిగా కొనసాగిన సర్వసభ్య సమావేశం


నల్లగొండ, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమం గా చేయలేదని, అధికారుల తీరుతో రైతులు నష్టపోయారని సభ్యులు ఆరోపించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, రోడ్ల నిర్మాణాలపై ప్రధానంగా సుదీర్ఘ చర్చ సాగింది. పలువురు సభ్యులు మాట్లాడుతూ, ధాన్యం 7.86లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారని, కొనుగోళ్లలో జాప్యంతో రైతులు నష్టపోవడానికి కారకులయ్యారన్నారు. ప్రధానంగా రవాణా విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఒక్క కాంట్రాక్టర్‌కు మాత్రమే ట్రాన్స్‌పోర్ట్‌కు అవకాశం ఇచ్చి మూడు రోజులకు ఒకసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వాహనాలు రాకున్నా పట్టించుకోలేదన్నారు. జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని తేమ శాతం సక్రమంగా ఉన్నా ఎందుకు కట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం

జిల్లాలో రోడ్ల నిర్మాణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆరోపించారు. ఎనిమిదేళ్లయినా సూర్యాపేట, భీమవరం రోడ్డుతో పాటు తుంగపాడు, అడవిదేవులపల్లి మధ్య రోడ్లను పూర్తి చేయడంలేదని ఆరోపించారు. సమయం వస్తే అధికారులపై కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రోడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించగా అధికారులు 52 కిలోమీటర్లకు రూ.55కోట్లు వచ్చాయన్నారు. ఏమైన ప్రతిపాదనలు ఉంటే సీఆర్‌ఎఫ్‌ కింద తనకు అందజేయాలని దీనిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, కనగల్‌ నుంచి దేవరకొండ వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నాణ్యత లేకున్నా పట్టించుకోవడం లేదన్నారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు నిధులు తక్షణమే కేటాయించి పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీకి నిధులు కేటాయించాలన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ, అధికారులు కాంట్రాక్టర్లకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రోడ్లను పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌-విజయవాడ రైల్వేలైన్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌, చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు.


కోమటిరెడ్డి వర్సెస్‌ కంచర్ల

ప్రోటోకాల్‌ విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం కొనసాగింది. తొలుత ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేస్తోందని, అధికారులు కూడా పాటిస్తున్నారన్నారు. కేవలం పేపర్లలో ఫొటోల కోసం, పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి రాద్దాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఉత్తమ్‌ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే అడ్గగోలుగా మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై కంచర్ల, కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం కొనసాగింది. జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని సమస్యను సద్దుమణిగేలా చేశారు. ఇదిలా ఉండగా, పెద్దవూర జడ్పీటీసీకి కార్యాలయ గది కేటాయింపుపై ఎంపీపీ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎంపీపీలు, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం కొనసాగింది.


ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం : జగదీ్‌షరెడ్డి, మంత్రి

సీఎం కేసీఆర్‌ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎవ్వరూ చుక్క నీటిని అక్రమంగా తరలించుకపోలేరని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టారు తప్ప తెలంగాణకు మాత్రం ప్రయోజనం లేకుండా చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌కు శంకుస్థాపన చేసి అక్రమ నిర్మాణాలు చేస్తోందని, దీనిపై కోర్టు ధిక్కరణ కేసు కూడా వేశామన్నారు. పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించకుండా పోరాడేందుకు అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఆ ప్రాంత నాయకుడే కోర్టులో కేసు వేయడం బాధాకరం అన్నారు.



గెజిట్‌తో అన్యాయం 

కృష్ణాజలాల విషయంలో కేంద్రం గెజిట్‌ అన్యాయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తీసుకోవాలని ఎంపీ ఉత్తమ్‌ అన్నారు. కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, నక్కలగండి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు అనుమతి లేదనడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నందున క్యాబినెట్‌లో చర్చించి కోర్టును ఆశ్రయించాలన్నారు. రోడ్ల నిర్మాణాల కోసం నిధుల కేటాయింపునకు తనతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ వారంలో ప్రధాన మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందజేస్తామని తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని, దీనిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. హైదరాబాద్‌ విజయవాడ వరకు ప్రత్యేక రైల్వేలైన్‌ కోరతామన్నారు.


రాయలసీమకు అక్రమంగా నీటిని తరలిస్తున్నారు

కృష్ణానది నుంచి ఏపీ ప్రభుత్వం రాయలసీమకు అక్రమంగా నీటిని తరలిస్తోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. శ్రీశైలం సొరంగం మార్గాన్ని తక్షణమే పూర్తి చేయాలని, బ్రాహ్మణవెల్లంకు నిధులు కేటాయించాలన్నారు. మిషన్‌ భగీరథకే 100 టీఎంసీల నీరు కావాలని దీన్ని దృష్టి లో ఉంచుకొని తెలంగాణ వాటాను కోల్పోకుండా చూడాలన్నారు.                  

Updated Date - 2021-07-25T06:43:05+05:30 IST