మహీ.. మొదలెట్టాడు

ABN , First Publish Date - 2020-08-08T09:22:21+05:30 IST

సంవత్సరానికిపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథ్యం వహించనున్న మహీ.. రాంచీలోని జార్ఖండ్‌...

మహీ.. మొదలెట్టాడు

రాంచీలో ప్రాక్టీస్‌ షురూ

ప్రయాణానికి సిద్ధమవుతున్న చెన్నై ఆటగాళ్లు


రాంచీ: సంవత్సరానికిపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథ్యం వహించనున్న మహీ.. రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం (జేఎ్‌ససీఏ) స్టేడియంలో ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. గత జూలైలో వన్డే వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనలే ధోనీ ఆడిన చివరి మ్యాచ్‌. అప్పటినుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న అతడు ఐపీఎల్‌ నేపథ్యంలో మళ్లీ కదన రంగంలోకి దిగనున్నాడు. ‘ఇక్కడి అంతర్జాతీయ స్టేడియం కాంప్లెక్స్‌ను ధోనీ సందర్శించాడు. రెండురోజుల పాటు నెట్స్‌లో సాధన చేశాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా బౌలర్లు అందుబాటులో లేనందున బౌలింగ్‌ మెషీన్‌ను ఎదుర్కొంటూ ప్రాక్టీస్‌ చేశాడు’ అని జేఎ్‌ససీఏ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్‌ కోసం గత మార్చిలో చెన్నై జట్టు ఆటగాళ్లతో కలిసి ధోనీ కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాడు. అయితే కరోనా వైర్‌సతో ఐపీఎల్‌ వాయిదాపడడంతో రాంచీ వెళ్లిపోయాడు. అప్పటినుంచి అడపాదడపా సామాజిక మాధ్యమాల్లో మాత్రమే మహీ కనిపించాడు. కాగా..మహీ అంతర్జాతీయ కెరీర్‌పై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఐపీఎల్‌లో ప్రదర్శననుబట్టి కెరీర్‌పై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. 

చెన్నై జట్టు.. కుటుంబాలు లేకుండానే..: ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టు ఐపీఎల్‌ సన్నాహకాలను వేగవంతం చేసింది. వచ్చే నెల 19న యూఏఈలో ప్రారంభయమ్యే టోర్నీకోసం ఆటగాళ్లు లగేజీ సర్దుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు లేకుండానే సీఎ్‌సకే జట్టు యూఏఈ వెళుతోంది. ఐపీఎల్‌ ప్రామాణిక నిర్వహణ విధానా (ఎస్‌ఓపీ)ల ప్రకారం ప్రాక్టీస్‌, మ్యాచ్‌ల సమయంలో కుటుంబ సభ్యులు క్రికెటర్ల సమీపంలోకి వెళ్లడం నిషిద్ధం. దాంతో కుటుంబాలను తీసుకు వెళ్లకూడదనే చెన్నై జట్టు నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. కనీసం టోర్నమెంట్‌ తొలి దశ వరకైనా కుటుంబాలను తీసుకువెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు జట్టు వర్గాలు వెల్లడించాయి. 

బుర్జ్‌ ఖలీఫా సమీపంలో.. : ముంబై, హైదరాబాద్‌, కోల్‌కోతా జట్ల మాదిరి అబుదాబిలో కాకుండా చెన్నై జట్టు దుబాయ్‌లో బస చేయనుంది. అక్కడి బుర్జ్‌ఖలీఫా సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోని 2,3 అంతస్థులను ఆ జట్టు రిజర్వ్‌ చేసుకోనున్నట్టు సమాచారం. చెన్నై జట్టుతోపాటు సహాయ సిబ్బంది ఈనెల 19న చెన్నైలో సమావేశం కానుంది. విమాన సర్వీసులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఈనెల 22న చార్టర్డ్‌ విమానంలో జట్టు దుబాయ్‌ వెళ్లనుంది. అక్కడి ఐసీసీ అకాడమీలో చెన్నై ప్రాక్టీస్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. 


‘టైటిల్‌’ బేరసారాలు?

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షి్‌పనుంచి వివో వైదొలగడంతో.. ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, లెర్నింగ్‌ యాప్‌ బైజూస్‌ ఈసారికి ఆ హక్కులు దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటితోపాటు డ్రీమ్‌ లెవెన్‌ కూడా రేసులో ఉంది. టైటిల్‌ హక్కుల ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది వివో రూ. 440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. అయితే.. వివో స్థానంలో కొత్తగా వచ్చే సంస్థలు అంత మొత్తం చెల్లించలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్ల అవి బేరసారాలకు దిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ‘వాస్తవ టైటిల్‌ విలువలో 1/3 వంతు మొత్తం లభించినా అది బీసీసీఐకి పెద్ద విజయమే అవుతుంది’ అని ఆ వర్గాలు తెలిపాయి.


సర్కారు సూత్రప్రాయ అంగీకారం..

ఈఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ‘ఐపీఎల్‌ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలు ఒకటి, రెండు రోజుల్లో అందనున్నాయి’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

Updated Date - 2020-08-08T09:22:21+05:30 IST