Dhoni: CSK కెప్టెన్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఒకవేళ మేం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోతే..

ABN , First Publish Date - 2022-05-09T20:08:10+05:30 IST

ఈ IPL సీజన్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి ఓటములతో ఉసూరుమనిపించిన Chennai Super Kings గత మ్యాచ్‌లో మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో..

Dhoni: CSK కెప్టెన్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఒకవేళ మేం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోతే..

ఈ IPL సీజన్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి ఓటములతో ఉసూరుమనిపించిన Chennai Super Kings గత మ్యాచ్‌లో మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో ఆకట్టుకుంది. కెప్టెన్సీ చేతులు మారిన మహత్యమో ఏమో తెలియదు గానీ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చెన్నై టీం మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చి ఢిల్లీని చిత్తుగా ఓడించింది. 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే చెన్నై టీం విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే.. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న CSK జట్టుకు ప్లే-ఆఫ్ ఆశలు దాదాపుగా లేనట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.



ఢిల్లీ టీంపై మ్యాచ్‌ గెలిచిన అనంతరం విన్నింగ్ కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. తాము ప్లే-ఆఫ్స్‌కు చేరుకుంటే మంచిదేనని, ఒకవేళ తాము ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయినా ప్రపంచం ఏం అంతమైపోదని చెప్పాడు. తర్వాత జరిగే మ్యాచ్‌లో ఎలా గెలవాలన్నదే తమ ఆలోచన అని తెలిపాడు. తాను అంత గొప్పగా లెక్కలు వేసే మనిషిని కాదని, స్కూల్లో కూడా తాను లెక్కల్లో వీక్ అని ధోనీ వ్యాఖ్యానించాడు. నెట్‌ రన్ రేట్ గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఐపీఎల్‌ను ఎంజాయ్ చేయండని CSK కెప్టెన్ సూచించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో గెలిచినంత గొప్పగా ముందటి మ్యాచ్‌ల్లో గెలిచి ఉంటే బాగుండేదని ధోనీ అభిప్రాయపడ్డాడు.



ఇదిలా ఉంటే.. CSK ప్లే ఆఫ్ అవకాశాలను ఒక్కసారి పరిశీలిస్తే.. CSK ఈ సీజన్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. 8 పాయింట్లతో.. +0.028 రన్‌రేట్‌తో ఉన్న CSK జట్టు ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించడం దాదాపు కష్టమనే చెప్పక తప్పదు. చెన్నైకి మరో మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లతో చెన్నై తలపడనుంది. 91 పరుగుల తేడాతో చెన్నై జట్టు గెలవడంతో నెట్‌ రన్ రేట్ మెరుగుపడినప్పటికీ RCBతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం చెన్నై జట్టు ప్లే-ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. చెన్నై ప్లే-ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడే నెట్ రన్ రేట్ లెక్కల్లో చెన్నై ముందుండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. ప్లే-ఆఫ్ కోసం పోటీ పడుతున్న జట్ల గెలుపోటములపై కూడా చెన్నై జట్టు ప్లే-ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

Read more