ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని నేనే అవుతా: ధోనీ

ABN , First Publish Date - 2021-05-06T18:07:12+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం నుంచి ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని తానే అవుతానని ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు.

ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని నేనే అవుతా: ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం నుంచి ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని తానే అవుతానని ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అర్ధంతరంగా రద్దు కావడంతో పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో ఇళ్లకు పంపిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఢిల్లీలో ఉంది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో జట్టు సభ్యులతో ధోనీ మాట్లాడాడు.


`ఐపీఎల్ భార‌త్‌లో జరుగుతోంది. కాబట్టి తొలుత విదేశీ ఆటగాళ్లు బయలుదేరాలి. ఆ తర్వాతి ప్రాధాన్యం భారతీయ ఆటగాళ్లది. శిబిరం నుంచి వెళ్లే చివరి వ్యక్తిని నేనేన`ని ధోనీ పేర్కొన్నట్టు చెన్నై టీమ్ సభ్యుడొకరు చెప్పాడు. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు బయల్దేరి వెళ్లిపోయారు. ఇక భారత ఆటగాళ్లను సొంత నగరాలకు చేర్చేందుకు సీఎస్‌కే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. పది మందికి సరిపోయే ఈ ఛార్టర్ ఫ్లైట్ ఈ రోజు (గురువారం) ఉదయం ముంబై, రాజ్‌కోట‌్‌కు చెందిన ఆటగాళ్లను తీసుకెళ్లింది. సాయంత్రం విమానంలో బెంగళూరు, చెన్నై క్రికెటర్లు వెళ్తారు. చివర్లో ధోనీ.. రాంఛీ చేరుకుంటాడు. మిగిలిన ఫ్రాంఛైజీలు కూడా ఇలాగే ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను తరలిస్తున్నాయి. 


Updated Date - 2021-05-06T18:07:12+05:30 IST