Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధీశాలి టంగుటూరి

తెల్లవారి తుపాకీ గుండుకి వెరువని ధైర్యం

సంపాదించినదంతా ప్రజా సేవకు

ఖర్చు చేసిన త్యాగం

ఆయన పేరుతోనే జిల్లా ఏర్పాటు

నేడు ప్రకాశం పంతులు 150వ జయంతి


ఒంగోలు: తెల్లవాడి తుపాకీ తూటాలకు భయపడని ధీశాలి. నిలువెల్లా దేశభక్తి, త్యాగనిరతి నిండిన స్ఫూర్తినీయుడు. సంపాదించినదంతా దేశ, ప్రజా సేవకే ఖర్చు చేసిన దానశీలి. ఆయనే టంగుటూరు ప్రకాశం పంతులు. వరువలేని మహనీయునిగా, మేరునగధీరుడుగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆయన 150వ జయంతి సోమవారం జరగనుంది. అందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 


వల్లూరులో ప్రాథమిక విద్య

1872 ఆగస్టు 23న వినోదరాయునిపాలెంలో టంగుటూరి గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు ప్రకాశం పంతులు జన్మించారు. పదకొండేళ్ల చిరుప్రాయంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి సుబ్బమ్మ ఒంగోలులో భోజనశాల నడుపుతుండగా దానిపై వచ్చే ఆదాయం చాలక, పలువురు ధనికుల ఇళ్లలో ‘వారాలు’ చేసుకుంటూ గడిపారు. టంగుటూరి ప్రకాశం. ఒంగోలు సమీపంలోని వల్లూరులో ప్రాథమిక విద్యను సాగించిన  ప్రకాశం, మిషన్‌ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు అండతో అక్కడ ప్రీమెట్రిక్‌ వరకూ చదివారు. అనంతరం ఆయన రాజమండ్రికి మకాం మారుస్తూ ప్రకాశం పంతులును సైతం తన వెంట తీసుకెళ్లి అక్కడ ఎఫ్‌ఏ వరకు, మద్రాసు పంపించి న్యాయశాస్త్రం చదివించారు. 1890లో స్వయాన అక్కకూతురైన హనుమాయమ్మను వివాహం చేసుకున్న ప్రకాశం పంతులు కొద్దిరోజులు ఒంగోలులో న్యాయవాదిగా పని చేశారు. అనంతరం రాజమండ్రిలో ఆ వృత్తిని కొనసాగించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. 35 సంవత్సరాల వయస్సులో రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 


ఇంగ్లాండులో బారిస్టర్‌ పూర్తి

ఒక బారిస్టరు సలహాపై ఇంగ్లాండు వెళ్ళిన ప్రకాశం పంతులు అక్కడ బారిస్టరు పూర్తి చేశారు. ఆ సమయంలోనే జాతీయభావాలు, సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకున్నారు. 1907లో భారతదేశానికి తిరిగివచ్చారు.   మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టి అనతికాలంలోనే మంచి న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బిపిన్‌ చంద్రపాల్‌ ప్రసంగాలకు ఆకర్షితుడైన టంగుటూరి ప్రకాశం పంతులు లక్నో ఒడంబడిక తర్వాత కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచూ హాజరయ్యే వారు. ఈ క్రమంలో 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేయటం ద్వారా న్యాయవాద వృత్తిని వదిలి పూర్తిస్థాయిలో స్వాతంత్య్ర సమరంలో అడుగుపెట్టారు.


తుపాకీ గుండుకెదురుగా గుండె నిలిపి

తన పోరాటపటిమతో, వాగ్ధాటితో అనతికాలంలోనే 1921లో ఆయన ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1928 మార్చి 2న సైమన్‌ కమిషన్‌ బొంబాయి వచ్చినపుడు అందుకు వ్యతిరేకంగా సైమన్‌ గో బ్యాక్‌ అంటూ మద్రాసు నగరంలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆనాటి పోలీసు తుపాకీలకు తన రొమ్ము చూపించి ‘గుండుకెదురుగా గుండెనిలిపి’ ఆంధ్రకేసరిగా ప్రజలచేత జేజేలందుకున్నారు. 1937లో మద్రాసు ప్రెసిడెన్సీలో రాజాజీ ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా సేవలనందించారు. ఇక 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి 1945లో విడుదలై దక్షిణ భారతదేశమంతా పర్యటించి, 1946 ఏప్రిల్‌ 30న మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎన్నికై 11 నెలల కాలం ఆ పదవిలో కొనసాగారు. స్వాతంత్రానంతరం 1952లో ఆయన ప్రజాపార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేసినటప్పటికీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయారు


ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా..

1953 అక్టోబర్‌ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ర్టానికి టంగుటూరు ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు. రెండువేల మంది ఖైదీలకు క్షమాభిక్ష, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఏర్పాటు, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ కృష్ణా నదిపై బ్యారేజి నిర్మాణం వంటివి చేపట్టారు. 1955 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి, ఆంధ్రరాష్ట్రమంతటా పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఒంగోలులో వడదెబ్బకు గురైన ప్రకాశం హైదరాబాదులో చికిత్స పొందుతూ 1957 మే 20న కన్నుమూశారు. ఆరు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆయన జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1972లో మూడు జిల్లాల్లోని అనేక తాలూకాల కలయికతో ఏర్పడిన మన జిల్లాలకు ‘ప్రకాశం’ జిల్లాగా నామకరణం చేశారు.   


నేడు జయంతి వేడుకలు

టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ముందుగా స్థానిక ప్రకాశం భవన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు.  అనంతరం దేవరంపాడు విజయస్థూపం వద్ద జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఇక ఉదయం 11.15 గంటలకు ఆయన జన్మస్థలమైన వినోదరాయునిపాలెంలో జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
Advertisement