బిల్లులు చెల్లించకపోతే పనులు ఆపేస్తాం

ABN , First Publish Date - 2021-03-02T06:44:15+05:30 IST

చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులు ఆపేస్తామని, ఐదు నెలలుగా తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

బిల్లులు చెల్లించకపోతే పనులు ఆపేస్తాం
బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ధర్నా 

హైదరాబాద్‌ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులు ఆపేస్తామని, ఐదు నెలలుగా తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు ఎస్‌.భాస్కర్‌రావు, సురేంద్రసింగ్‌, అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. 2020 అక్టోబర్‌ 10 వరకు బిల్లులు చెల్లించారని, తర్వాత చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా అధికారులు చెప్పడం లేదని, పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏడాది క్రితం చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వలేదని, అడిషనల్‌ కమిషనర్‌ ఫైనాన్స్‌ ఇదంతా చేస్తున్నారంటూ ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో నాలుగువేల మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిపై లక్షలమంది ఆధారపడి పనిచేస్తున్నారన్నారు. బిల్లుల విషయంలో తాత్సారం చేస్తే సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నామని, దాన్ని 12 శాతానికి తగ్గించాలన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు తెలియజేయాలన్నారు. ధర్నాలో కాంట్రాక్టర్లు రాజేష్‌, లోహిత్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T06:44:15+05:30 IST