ధర్మోధారయతి ప్రజాః

ABN , First Publish Date - 2020-08-20T06:43:56+05:30 IST

ధర్మాద్ధర్మం ప్రభవతే.. ధర్మాత్ప్రభవతే సుఖం

ధర్మోధారయతి ప్రజాః

ధర్మాద్ధర్మం ప్రభవతే.. ధర్మాత్ప్రభవతే సుఖం

ధర్మేణ లభతే సర్వం.. ధర్మసారమిదమ్‌ జగత్‌


అనగా ఈ ప్రపంచం ధర్మంపై ఆధారపడి ఉంది. ఈ ధర్మప్రవర్తనే మానవుని ఉత్తమలోకాలకుగానీ, మోక్షానికిగాని తీసుకెళ్తుంది. మన ఆచరణతో లోకంలో ధర్మాచరణ పెరిగితే మనకూ సుఖమే. లోకానికీ సుఖమే. అటువంటి ధర్మసారమే మహనీయుల ఆచరణ ద్వారా వెలువడుతున్నదని భావం.


ధర్మం కోసమే ధనాన్ని సంపాదించాలి. మోక్షం కోసమే కోరికను కలిగి ఉండాలి. సమస్త విషయ వాసనలనూ విడిచి ధర్మాన్ని ఆచరించడమే సరైన మార్గం. ముముక్షువు అయినవాడు.. ధర్మార్థకామ మోక్షాలనే చతుర్విధ పురషార్థాల్ని సాధించాలి. వీటిలోనూ.. పరమ పురుషార్థం స్వస్వరూపస్థితియే. అంటే కైవల్యం. మోక్షం. ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలూ మోక్షసాధనకు సోపానాలు. 


యువైవ ధర్మశీలః స్యాత్‌ అనిత్యం ఖలు జీవితం

కో హి జానాతి కసాద్య మృత్యుకాలో భవిష్యతి

అని జ్ఞాన వాశిష్ఠం లో చెప్పబడినిది. చిరు ప్రాయంలోనే మానవుడు ధర్మశీలుడు కావాలి. ఎందుకంటే జీవితం అస్థిరం. ఎవరికి ఎప్పుడు మృత్యువు వస్తుందో ఎవరు చెప్పగలరు? కాబట్టి, వయసును సాకుగా పెట్టుకోకుండా మానవుడు ధర్మశీలుడు కావాలని దీని అర్థం. మనిషి ధర్మానికి  కట్టుబడి, పరహితానికి తగిన ఉదారభావంతో ఉండడమే సమాజానికి క్షేమం. మానవుల అధర్మాచరణవల్లే జనోపధ్వంసకాలైన విచిత్ర వ్యాధులు ప్రబలుతాయని చరకుడు ఏనాడో చెప్పాడు. ధర్మాచరణ చెయ్యాలంటే భక్తి, శ్రద్ధ, ఉత్సాహం అవసరం. ధర్మం తప్పక నీతి నియమాలతో ప్రవర్తించేవానికి భయం ఉండదు. అటువంటి ధర్మాన్ని నిరాటంకంగా, నిశ్చలంగా సాధించడానికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరం.


అందుకే ‘‘శరీర మాద్యం ఖలు ధర్మ సాధనమ్‌’’ అన్నారు పెద్దలు. ‘‘ధారణాత్‌ ధర్మః’’ అనగా ధర్మంసకల జగత్తునూ ధరిస్తున్నది. ‘‘ధర్మోధారయతి ప్రజాః’’ ధర్మం వల్లనే సమస్త చరాచర ప్రాణికోటీ జీవిస్తోంది. ఎవరో అధర్మంగా నడిచి, లాభం పొందారని వారిని అనుసరించరాదు. సర్వజీవులనూ దయతో చూడడం, సత్యాన్ని పాటించడం, గురు సేవ, శమదమాది గుణాలతో ఉండడం బ్రహ్మచర్యాశ్రమ ధర్మం. అతిథుల్ని పూజిస్తూ సదాచారాలను అనుసరించడం గృహస్థ ధర్మం. నియమంగా ఆహారం తీసుకోవడం, ఇంద్రియాలను జయించడం, సజ్జన సాంగత్యం.. వానప్రస్థాశ్రమ ధర్మం. సర్వసంగాలూ వదలడం, ఒంటరిగా ఉండడం, ఒక చోట స్థిరంగా ఉండకపోవడమే సన్యాసాశ్రమ ధర్మం. 

ధర్మాత్ములైన వారు తాము చేసే ధర్మంలో లోపం చేయరు. ధర్మబద్ధమైన అర్థ, కామాలను అనుభవించి మోక్షంలో ఉండడమే పురుషార్థసాధన లక్ష్యం. అదే మానవ జన్మ పరమధర్మం.

- మేఘశ్యామ (ఈమని), 8332931376


Updated Date - 2020-08-20T06:43:56+05:30 IST