ధర్మేతిహాసం రావిశాస్త్రి రచనాసర్వస్వం

ABN , First Publish Date - 2020-11-09T06:44:51+05:30 IST

ఒక ద్రష్టగా సమకాలిక సమాజంలోని అవినీతి, దౌష్ట్యం, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దగా, మోసాలు, నేర ప్రవృత్తిని ఎత్తి చూపడం...

ధర్మేతిహాసం రావిశాస్త్రి రచనాసర్వస్వం

పరిశీలనకి జీవితానుభవాన్ని జోడించి తాను తెలుసుకున్న జీవిత సత్యాలనే కథలు, నవలలు, నాటికలుగా రూపొం దించారు రావిశాస్త్రి. మంచికి ప్రతిఫలం లేకపోయినా చెడ్డకి మాత్రం శిక్ష అనుభవించే నిర్భాగ్యులు; కూడు గుడ్డ మందులకు, సంతోషానికి నోచుకోని పేదవారు; అన్యాయం, మోసం, దగాలకు బలైనవాళ్ళు రావిశాస్త్రి కథలలో దర్శనమిస్తారు. ఈ కథలలో రచనా శిల్పం ఉంది. జీవితం పట్ల నిశిత పరిశీలన ఉంది. ఆ పరిశీలన మీద దృశ్యాదృశ్యమైన రచయిత వ్యాఖ్యానం ఉంది. 


ఒక ద్రష్టగా సమకాలిక సమాజంలోని అవినీతి, దౌష్ట్యం, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దగా, మోసాలు, నేర ప్రవృత్తిని ఎత్తి చూపడం ద్వారా సమాజ శ్రేయస్సును ఆకాం క్షిస్తూ తన ధర్మం నిర్వర్తించిన రచయిత రావి శాస్త్రి రచనా సర్వస్వం మొత్తాన్ని ఒక ధర్మేతి హాసంగా అభివర్ణించవచ్చు. సమాజాన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టగలిగి, అలా తాను తెలుసుకు న్నది రచనలలో చూపగలవాడే అసలైన అభ్యు దయ రచయిత అని ఆయన ఆలోచనాత్మక రచనలు నిరూపిస్తాయి. 


పరిశీలనకి జీవితానుభవాన్ని జోడించి తాను తెలుసుకున్న జీవిత సత్యాలనే కథలు, నవలలు, నాటికలుగా రూపొం దించారు రావిశాస్త్రి. మంచికి ప్రతిఫలం లేకపోయినా చెడ్డకి మాత్రం శిక్ష అనుభవించే నిర్భాగ్యులు; కూడు గుడ్డ మందులకు, సంతోషానికి నోచుకోని పేదవారు; అన్యాయానికి, మోసానికి, దగాకి బలైనవాళ్ళు రావిశాస్త్రి ‘ఆరు సారా కథలు’, ‘ఆరు చిత్రాల కథలు’, ‘ఆరు సారో కథలు’, ‘మరో ఆరు చిత్రాల కథలు’ లాంటి కథలలో దర్శనమిస్తారు. ఈ కథలలో రచనా శిల్పం ఉంది. జీవితం పట్ల నిశిత పరిశీలన ఉంది. ఆ పరిశీలన మీద దృశ్యాదృశ్యమైన రచయిత వ్యాఖ్యానం ఉంది. ‘మాయ’ కథలో ముత్యాలమ్మ ప్రసంగం, ‘మోసం’ కథలో అప్పారావు ఉపదేశం, ‘మోక్షం’ కథలో మేజిస్ట్రేట్‌ ‘‘గవర్నమెంట్‌కి పాపం పిచ్చెక్కింది కదూ! ఎలా వుందో ఏమిటో? పదండి చూద్దాం,’’ అనడం ప్రధానంగా ఉల్లేఖనీయాలు. 


తన కథల్లో, నవలల్లో, నాటికలలో రావిశాస్త్రి సృష్టించడానికి ప్రయత్నించింది జీవిత లయ (rhythm of life) తప్ప నాటకీయత (dramatic element) కాదు. ఆయన దృష్టి ఎప్పుడూ చరిత్ర సృష్టించే మహత్తర సంఘటనల మీద కాక జీవితంలోని చిన్న చిన్న సుడిగుండాలపైనే ఉండేది. గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడిపించే ప్రయత్నమే రావిశాస్త్రి రచనాసర్వస్వం. మానవతావాద పునరుద్ఘాటనలు ఆయన సమస్త రచనలు. బాధాసర్పద్రష్టులందరితో పూర్తిగా తాదాత్మ్యం చెందడం వల్లనే ఆయన వారి మాండలిక భాషలో అలవోకగా అతిసహజంగా వారి కష్టసుఖాలను చిత్రించగలిగారు. మన సాహిత్యం కన్నా మన జీవితం ఎంతో గాఢమైనది, సజీవమైనది అని మనసారా విశ్వసించిన రచయిత రావిశాస్త్రి. వాస్తవ జీవితం ఎప్పుడూ సమాజంలోని అట్టడుగు వర్గం (lumpen proletariat)తో సంబంధం కలిగే ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన రచనలు చేశారు. 


పట్టణ జీవితపు అధోజగత్తుని విభిన్న కోణాలలో చిత్రిస్తూ సాగిన సారా కథలు పాఠకులకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేశాయి. మనం రోజూ చూస్తున్న వారి జీవితాలలో ఎంత విషాదం ఉందో, పేదరికం వారి మధ్య పరస్పర సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ కథలు చూపించాయి. సంఘంలో నాగరిక జీవనం కోసం ఏర్పరచుకున్న నీతి సూత్రాలన్నీ పేదరికం ముందు బలాదూరే అయిపోతాయి. రక్షించవలసిన పోలీసు వ్యవస్థ అవినీతి రుచి మరిగి భక్షించడం మొదలుపెడితే వారి అక్రమార్జన కోసం మొదట బలయ్యేది పేదలే, అసహాయులేనని రావిశాస్త్రి కథలు నిరూపించాయి. 


1938లో రావిశాస్త్రి పదహారేళ్ల వయస్సులో రాసిన తొలి కథ ‘దేవుడే చేశాడు’ పేరుతో ‘వినోదిని’ పత్రికలో అచ్చయింది. అందులోనూ ఆయన ధర్మాగ్రహం వ్యక్తమయ్యింది. అది ‘మూడు కథల బంగారం’ నవలలో విశ్వరూపం దాల్చింది. 1950-60 మధ్య కాలంలో రాసిన ఎన్నో కథలలో మధ్యతరగతి జీవనచిత్రణే కథావస్తువు. మధ్యతరగతి జీవితంలోని సమస్యలు, వాటికి కారణాలను వెతుకుతూ అందులోని జీవన వైఫల్యం, అంతర్లీనంగా ఉన్న విషాదం, మానవ సంబంధాలను ఆర్థిక కారణాలు ప్రభా వితం చేసే తీరును చూపిస్తూ సాగిన కథలు ‘అయ్యో అయ్యో కథలు’, ‘కార్నర్‌ సీట్‌’, ‘జరీఅంచు తెల్లచీర’, ‘మెరుపు మెరిసింది’... మొదలైనవి.


తెలుగు నవలా సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే నవలల్లో రావిశాస్త్రి మనోవైజ్ఞానిక నవల ‘అల్పజీవి’ ఒకటి. అది ఆయన మొదటి నవల కావడం విశేషం. దీనిలో కథానాయకుడు సుబ్బ య్యకు ఉన్న సమస్యలలో ఒకటి భయం, రెండోది ఆత్మన్యూనత. సుబ్బయ్య అంతరంగం ఒక సాలెగూడు. తాను స్వయంగా అల్లుకున్న ఆ గూట్లో అతడు చిక్కుకుపోయాడు. ఆ గూటి లక్షణం ఆత్మన్యూనతా భావం. సుబ్బయ్య అంతర్మథనంలో భవిష్యద్వర్తమానాలు కలిసిపోయుం టాయి. ‘‘పిరికివాడు మంచివాడు కాలేడు. మంచిగా ఉండాలంటే ధైర్యం కావాలి,’’ అన్నారు రావిశాస్త్రి. 


అనారోగ్యంతో బాధపడుతూ అవసాన దశలో రావిశాస్త్రి తన ఆఖరు నవల ‘ఇల్లు’కి రాసిన ముందుమాటలో ‘‘ఇల్లు వుండటానికి గూడు కొందరికైతే ఇల్లు కొందరికి సంపాదించవలసిన ఆస్తి,’’ అని చెబుతూ, దాన్ని సంపాదించే క్రమంలో చోటు చేసుకునే కుట్రలు, కుతంత్రాలు, మోసాలు సూచించారు. ‘రత్తాలు-రాంబాబు’లో నరకకూపమైన వేశ్యా వృత్తిని, ‘మూడు కథల బంగారం’లో దొంగనోట్ల మోసపూరిత జీవితా లను, ‘సొమ్మలు పోనాయండి’లో ఒక బక్క చిక్కిన ప్రాణికి కోర్టు న్యాయం చేయలేకపోయిన ఉదంతాన్ని... ఇలా ఆయన రచనలు సామాజిక వాస్తవికతకు నిలువుటద్దం పట్టాయి.

మంగు శివరామప్రసాద్‌

91107 88060

(నవంబర్‌ 10 రావిశాస్త్రి వర్ధంతి)


Updated Date - 2020-11-09T06:44:51+05:30 IST