విభజన అశాస్త్రీయంగా జరిగితే.. అభివృద్ధి అంతా శూన్యమైపోతుంది

ABN , First Publish Date - 2020-07-09T13:19:12+05:30 IST

విభజన అశాస్త్రీయంగా జరిగితే ఇప్పటివరకు..

విభజన అశాస్త్రీయంగా జరిగితే.. అభివృద్ధి అంతా శూన్యమైపోతుంది

అశాస్త్రీయంగా విభజించొద్దు

ఎచ్చెర్ల, పాలకొండ, రాజాంలను విజయనగరం జిల్లాలో కలపొద్దు

కలిపితే శ్రీకాకుళం జిల్లా 80 ఏళ్లు వెనక్కి

పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా వద్దు: ధర్మాన

ఇది ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన వాగ్దానం

ప్రజాభిప్రాయం తెలుసుకున్నాకే: విజయసాయి


శ్రీకాకుళం(ఆంధ్రజ్యోతి): జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగితే ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి అంతా శూన్యమైపోతుందని మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా బుధవారం శ్రీకాకుళంలోని కొత్తరోడ్డు జంక్షన్‌ వద్ద వైఎస్‌ విగ్రహాన్ని ధర్మాన ఆవిష్కరించారు. ఆమదాలవలసలో విజయసాయిరెడ్డి పాల్గొన్న వైఎస్‌ కాంస్య విగ్రహావిష్కరణలోనూ ఆయన పాల్గొన్నారు. ‘దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. జిల్లాలో అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం ప్రాంతాలు.. కొత్త జిల్లాల విభజనలో భాగంగా విజయనగరం జిల్లాలో కలసిపోతాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అదే జరిగితే జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దు.


ప్రజలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలి. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేయొద్దు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలందరితో కలసి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం’ అని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు. దీనిపై విజయసాయి అక్కడికక్కడే స్పందించారు. జిల్లాల పునర్విభజన అనేది ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన వాగ్దానమని గుర్తుచేశారు. ‘ప్రజల మనోభావాలు సున్నితమైనవి. అవి దెబ్బ తినకుండా ప్రజల అభిప్రాయాల మేరకే జిల్లాల పునర్విభజన జరుగుతుంది’ అని పేర్కొన్నారు.


Updated Date - 2020-07-09T13:19:12+05:30 IST