కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దాదాపు పది కార్మికసంఘాల ఆధ్వర్యంలో రెండురోజుల సమ్మె ముగిసింది. సమ్మెలో 20కోట్లమందికి పైగా కార్మికులు పాల్గొన్నారని నాయకులు ప్రకటించారు. సమ్మె విజయవంతమని కొందరు, పాక్షికమని మరికొందరు అంటున్నారు. అన్ని రంగాలకు చెందిన కార్మికుల విస్తృతభాగస్వామ్యం ఈ మారు మరింత హెచ్చుగా ఉన్నదని కార్మిక నాయకులు ముచ్చటపడుతున్నారు. ఆయా రాష్ట్రప్రభుత్వాల రాజకీయ వైఖరుల ప్రభావం సమ్మెమీద ఉండటమూ సహజం. ఎస్మా ప్రయోగం, పోలీసు కాఠిన్యం, ప్రభుత్వాల ప్రత్యేక నిర్బంధాలు, న్యాయస్థానాల జోక్యాలు ఇత్యాదివి సమ్మెను ప్రభావితం చేశాయి. పార్లమెంటు ఉభయసభల్లోనూ సమ్మె గురించిన ప్రస్తావనలు జరిగాయి. కార్మికుల ఆవేదనలు పట్టించుకోవాలనీ, వారి డిమాండ్లు నెరవేర్చాలని కొందరు విపక్షనాయకులు సభాధ్యక్షులను కోరారు. రాజ్యసభలో కాస్తంత సంక్షిప్తంగానైనా ఈ అంశాన్ని ప్రస్తావించగలిగే అవకాశం విపక్షనాయకులకు దక్కింది.
ఈ తరహా సమ్మెలు కొత్తవీ కావు, డిమాండ్లూ కొత్తవీకావు. ప్రైవేటీకరణ ఏ రూపంలోనూ కూడదనీ, కార్మికచట్టాలను చట్టుబండలు చేయవద్దనీ, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపి) రద్దుచేయాలనీ, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతనాలు పెంచాలనీ, కాంట్రాక్టు పనివారిని రెగ్యులరైజ్ చేయాలనీ వారు కోరుతున్నారు. ప్రైవేటీకరణను కచ్చితంగా తిప్పికొడతామనీ, ప్రభుత్వరంగాన్ని కాపాడుకుంటామని సమ్మెలో పాల్గొన్నవారు నమ్మకంగా నినాదాలు చేశారు. బొగ్గునుంచి బ్యాంకింగ్ వరకూ అన్నిరంగాల్లోనూ పాలకుల ప్రైవేటీకరణ దూకుడు శృతిమించుతున్న నేపథ్యంలో కార్మికవర్గం మరింత పోరాటపటిమను ప్రదర్శిస్తున్నది. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, బ్యాంకులు, బీమా తదితర రంగాలకు చెందిన కార్మికులు తమ సంస్థలను రక్షించుకోవడానికి కలసికట్టుగా కదిలారు. కేంద్రప్రభుత్వ విధానాలు దేశానికి ఎంత ప్రమాదకరమైనవో చెప్పడానికి కూడా ఈ సమ్మె ఉపకరించిందని కార్మిక నాయకులు నమ్ముతున్నారు. ఎన్నో త్యాగాలతో, దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న హక్కుల్ని హరించి, ప్రజల ఆస్తిపాస్తులను బడాపారిశ్రామికవేత్తలకు చవుకగా కట్టబెడుతున్న విధ్వంసకరమైన విధానాలవల్ల దేశంలో విస్తృత ప్రజానీకం సంతోషంగా లేదనీ, ఎవరి బతుకులకూ ఇప్పుడు భద్రతలేకపోయిందనీ కార్మిక నేతలు అంటున్నారు.
సమ్మె సందర్భంగా ఆయా రంగాలకు చెందిన కార్మికుల నినాదాలు పాలకుల చెవికి ఎక్కకపోయినా, ‘ప్రజల్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం’ అన్న నినాదంతో వారు చేసిన ఈ ప్రయత్నం కచ్చితంగా విశేషమైనది. కార్మికులను కనీసం మనుషులుగా గుర్తించని వాతావరణం క్రమంగా పెరిగిపోతోంది. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు నీరుగారిపోతున్నాయి. సులభతరవాణిజ్యం పేరిట కార్మికులను వెట్టిబానిసలుగా మార్చివేసే ప్రయత్నం జరుగుతోంది. చివరకు రక్షణరంగానికి కూడా భద్రతలేకుండాపోయింది. ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను కార్పొరేషన్లుగా మార్చేశారు, కీలకమైన రక్షణపరిశోధనాసంస్థలను కూడా వేలంలో అమ్మేస్తున్నారు. సామాన్యుడికి జీవితకాలపు ధీమా ఇచ్చిన జీవితబీమా కూడా అంతర్జాతీయమార్కెట్లో వేలానికి నిల్చుంది. దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మనివ్వను అని దేశమాతపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ ఏలుబడిలో లక్షలకోట్ల ప్రభుత్వాస్తులు ప్రైవేటుపరం అయ్యాయి. ఆత్మనిర్భరత అన్నది మాటవరుసకే తప్ప, స్వావలంబన యత్నాలు ఏ కోశానా కనిపించడం లేదు. మూడంకెల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల సంఖ్యను రెండంకెల్లోకి తెస్తామని పార్లమెంటులోనే ప్రకటించిన ఘనత ఈ ప్రభుత్వానిది. విలీనాలు సంలీనాలతో బ్యాంకుల సంఖ్య సగానికి తగ్గింది తప్ప, అప్పులు ఎగ్గొట్టిన కుబేరులనుంచి రాబట్టగలిగింది మాత్రం లేకపోయింది. ఓ నాలుగు కీలకమైన రంగాల్లో ప్రభుత్వం నామమాత్రపు వాటాను ఉంచుకొని మిగతాదంతా అస్మదీయులకు అమ్మేసేందుకు ఏవేవో కొత్తపేర్లు తెరమీదకు వస్తున్నాయి. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారిని ఇంకా నిరుపేదలుగా మార్చి, ఒకశాతం కుబేరులను మరింత పెంచిపోషించే విధానాలు అమలుజరుగుతున్నాయి. ఒకపక్కన ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు తెగనమ్ముతూ మరోపక్కన దేశభక్తులమని చెప్పుకుంటున్నవారిని నిలదీసేందుకూ, దూకుడును నిరోధించేందుకూ తాము చేపట్టిన ఈ సమ్మె ఉపకరిస్తుందని కార్మిక నేతల విశ్వాసం.