ఆధిపత్యాలపై ‘ధర్మ’ పోరాటం

ABN , First Publish Date - 2022-02-15T06:41:59+05:30 IST

అతడనేక యుద్ధాలలో ఆరితేరిన యోధుడు. జయాపజయాలకు వెరవని స్థితప్రజ్ఞుడు. ప్రజల పోరాటాలతో మమేకమైన సమరశీలి. శ్రమజీవుల పోరాటాలకు రథసారథి. నాలుగు తరాల ఉద్యమకారులకు వారధి....

ఆధిపత్యాలపై ‘ధర్మ’ పోరాటం

అతడనేక యుద్ధాలలో ఆరితేరిన యోధుడు. జయాపజయాలకు వెరవని స్థితప్రజ్ఞుడు. ప్రజల పోరాటాలతో మమేకమైన సమరశీలి. శ్రమజీవుల పోరాటాలకు రథసారథి. నాలుగు తరాల ఉద్యమకారులకు వారధి. ఉద్యమం అతని ఊపిరి. అధ్యయనం అతని వ్యసనం. వృత్తి సంఘాల నిర్మాణం అతని కార్యక్షేత్రం. గీత కార్మికుల హక్కుల రక్షణ అతని చిరునామా. పాత నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో 1922 ఫిబ్రవరి 15న గీత కార్మిక కుటుంబంలో గోపమ్మ, ముత్తి లింగయ్య దంపతులకు పుట్టిన బిడ్డ ధర్మభిక్షం. ముత్తి లింగయ్య గీతవృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ధర్మభిక్షం పుట్టేనాటికే జాతీయస్థాయిలో సహాయ నిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నది. ‘వందేమాతరం’ నినాదం ప్రతిధ్వనిస్తున్నది. హైదరాబాద్‌ సంస్థానంలో ఆంధ్రజనసంఘం, ఆర్యసమాజం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో ఆంధ్రజనసంఘం శాఖ ఏర్పడింది. వర్తకసంఘం నెలకొల్పబడింది. గ్రంథాలయం స్థాపన జరిగింది. ఖాన్గీ పంతులు సాతాని గోపయ్య ధర్మభిక్షంతో ఓనమాలు దిద్దించాడు. మిడిల్‌ స్కూల్‌లో చేరగానే భిక్షంలోని చురుకుదనాన్ని, సద్గుణాలను, నైపుణ్యాన్ని ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ సుబాని గుర్తించి, ప్రోత్సహించాడు. విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించాడు. హాకీ ఆటలో ప్రతిభను చాటి భిక్షం టీమ్‌ క్యాప్టెన్‌ అయ్యాడు. అంతర్‌ పాఠశాలల పోటీల్లో పాల్గొని, తమ జట్టుకు విజయాలను చేకూర్చాడు. సూర్యాపేట ఆర్యసమాజం నాయకులు ఈ బాలుడి ప్రతిభను గుర్తించి, చేరదీశారు. భిక్షం ఆర్యసమాజం గ్రంథాలను చదివి ప్రభావితుడయ్యాడు. కార్యకర్తగా మారాడు. విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయానికి ప్రతిరోజూ వెళ్ళేవాడు. ఉత్తమ గ్రంథాలను, జీవిత చరిత్రలను చదివేవాడు.


అబ్దుల్‌ సుబానీ మాస్టారు బదిలీపై వెళ్ళడంతో కరీముల్లాఖాన్‌ అనే నవాబు కుటుంబీకుడు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చాడు. ఆయనకు నిజాం అంటే అభిమానం. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్యార్థులకు ఉత్తర్వులు జారీచేశాడు. ఈ ఉత్సవాలకు ప్రధానమంత్రి వస్తున్నందున విద్యార్థులంతా యూనిఫాం ధరించి మాక్‌డ్రిల్‌ చేయాలని సూచించాడు. భిక్షం మనసులో అప్పుడప్పుడే నిజాం వ్యతిరేక భావాలు వేళ్ళూనుకుంటున్నాయి. ప్రధానోపాధ్యాయుడి ఆదేశాన్ని ఆయన ధిక్కరించాడు. విద్యార్థులందరినీ సమైక్యపరిచి, నిజాంరాజు జన్మదినాన్ని బహిష్కరించాలని పిలుపు ఇచ్చాడు. విద్యార్థులందరూ ఒక్కటయ్యారు. ఏ ఒక్క విద్యార్థీ పరేడ్‌కు హాజరుకాలేదు. హెడ్మాస్టర్‌ బెదిరించినా విద్యార్థులెవరూ భయపడలేదు. ఈ వార్త హైదరాబాద్‌ సంస్థానమంతా సంచలనమయ్యింది.


విద్యార్థి జీవితం తర్వాత భిక్షం ఆర్యసమాజ కార్యకర్తగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించాడు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌ మాదిరిగా సూర్యాపేటలో ఒక హాస్టల్‌ స్థాపించి, విద్యార్థులను ఉద్యమోన్ముఖులుగా తీర్చిదిద్దాలన్న తపనతో 1945లో కొందరు మిత్రులతో కలిసి హాస్టల్‌ను ప్రారంభించాడు. దాతల సహకారంతో నడిచే ఈ హాస్టల్‌కు ‘రెడ్డి హాస్టల్‌’ అని పేరుపెట్టాడు. విద్యార్థుల ఆర్థికస్తోమతను బట్టి ఫీజులు వసూలు చేసేవారు. పేద విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించేవారు. చదువుతోపాటు వ్యాయామం, యోగ, ఆటపాటలు, వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణాశిబిరాలు నిర్వహించేవారు. వట్టికోట ఆళ్వారుస్వామి, బూర్గుల నర్సింగరావు, సిహెచ్‌.హనుమంతరావు మొదలైనవారు భిక్షం కోరిక మేరకు ఈ శిబిరాల్లో వక్తలుగా పాల్గొని విద్యార్థులకు సమకాలీన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై అవగాహన కల్పించేవారు. తెలంగాణ ప్రాంతంలో రాజకీయ శిక్షణాశిబిరాలను నిర్వహించిన మొదటి వ్యక్తి ధర్మభిక్షమే.


1946లో హాస్టల్‌ వార్షికోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. కొత్వాల్‌ రాజాబహదూర్‌ వెంకటరామిరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కొత్వాల్‌ అప్పటికే సూర్యాపేట హాస్టల్‌ కార్యక్రమాలను గురించి విని ఉండడం వల్ల అక్కడికి రావడానికి అంగీకరించాడు. ఆయన రాకతో కేవలం హాస్టల్‌లోనే కాకుండా మొత్తం సూర్యాపేటలో పండుగ వాతావరణం నెలకొన్నది. పట్టణమంతా బ్యానర్లు, తోరణాలతో అలంకరించారు. హాస్టల్‌ విద్యార్థులతో పాటు పట్టణ ప్రముఖులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. హాస్టల్‌ను చూసి, హాస్టల్‌ నిర్వహణ తీరుతెన్నులను గురించి తెలుసుకుని వెంకటరామిరెడ్డి ఎంతో సంతోషించాడు. సభలో భిక్షంను ప్రశంసిస్తూ ‘ఏక్‌ హాత్‌ సే భిక్షామాంగ్‌కర్‌ దూస్రే హాత్‌ సే దాన్‌ కర్నేవాలా భిక్షం నహీ... ధర్మభిక్షం’ అన్నాడు. ఆనాటి నుండి భిక్షం, ధర్మభిక్షంగా పేరు గడించాడు. సేవాదృక్పథంతో ప్రజాసేవకు జీవితం అంకితం చేశాడు.


క్రమంగా సూర్యాపేట హాస్టల్‌ రాజకీయ కేంద్రంగా మారింది. భువనగిరిలో, హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రమహాసభలకు హాజరయిన సూర్యాపేట విద్యార్థులు ఖమ్మంలో జరిగిన 12వ మహాసభకు, పాదయాత్రతో బయల్దేరారు. గ్రామగ్రామాన పాటలు పాడుతూ, ఆంధ్రమహాసభ గురించి వివరిస్తూ 40 మైళ్ళు ప్రయాణం చేసి ఖమ్మం చేరారు. మహాసభ రాజకీయవేదికగా మారింది. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు ‘సంఘం’, లేదా ‘సంగం’గా పిలిచేవారు. ధర్మభిక్షం కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు.


సూర్యాపేట హాస్టల్‌ వారికి రహస్య స్థావరం, సమన్వయ కేంద్రమయింది. 1946 జూలై 4న కడివెండిలో ‘సంఘం’ కార్యకర్తలు శాంతియుతంగా ఊరేగింపు జరుపుతుండగా విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి గుండాలు కాల్పులు జరిపారు. సంఘం కార్యకర్త దొడ్ది కొమురయ్య నేలకొరిగాడు, అనేకమంది గాయపడ్డారు. దొడ్డి కొమురయ్యకు జోహార్లర్పిస్తూ, భూస్వాముల రాక్షసత్వాన్ని నిరసిస్తూ ధర్మభిక్షం నాయకత్వంలో విద్యార్థులు సమ్మె చేశారు.


సూర్యాపేట పట్టణ ఉద్యమనాయకులు ధర్మభిక్షం, దాయం రాజిరెడ్డి, దుర్గయ్య, తండ్రు లక్ష్మయ్యలను 1946 సెప్టెంబర్‌ 26 అర్ధరాత్రి అరెస్టు చేసి, సబ్‌జైలులో బంధించారు. పొద్దున్నే ఈ వార్త తెలిసి విద్యార్థులు, హమాలీలు, ప్రజలు సబ్‌జైలుపై దాడి చేశారు. పోలీసుల కళ్ళల్లో కారం చల్లి తమ నాయకులను విడిపించుకున్నారు. బయటపడిన ధర్మభిక్షం రహస్య స్థావరంలో ఉండగా పోలీసులు తిరిగి పట్టుకున్నారు. చిత్రహింసలు పెట్టారు. నల్లగొండ జైలుకు తరలించారు.


1948 సెప్టెంబర్‌ 13న నిజాం ప్రభుత్వంపై ఇండియన్‌ యూనియన్‌ సైనిక చర్యను ప్రారంభించింది. స్వల్ప ప్రతిఘటనలతో నిజాం నవాబు సెప్టెంబర్‌ 17న భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. రాజరిక వ్యవస్థ నుండి హైదరాబాద్‌ సంస్థానం విముక్తమయింది, ఇండియన్‌ యూనియన్‌లో విలీనమయింది. అయితే యూనియన్‌ సైన్యం వెనుతిరిగిపోలేదు. కమ్యూనిస్టులపై నిర్బంధం కొనసాగించింది. కమ్యూనిస్టు పార్టీ సాయుధపోరాటం తీవ్రం చేసింది. వేలాదిమంది కమ్యూనిస్టులను సానుభూతిపరులను సైన్యం కాల్చిచంపింది. అనేకమందిని జైళ్ళకు పంపింది. పార్టీ పిలుపుమేరకు ఖైదీల హక్కులకోసం ధర్మభిక్షం జైలులో పోరాటం కొనసాగించాడు.


1951 అక్టోబర్‌ 21న భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధపోరాట విరమణను ప్రకటించింది. దేశంలో నూతన రాజ్యాంగం ప్రకారం ప్రథమ సార్వత్రక ఎన్నికలు ప్రకటింపబడ్డాయి. దీర్ఘకాలం జైలులో ఉండి, తీవ్రమైన నేరారోపణలు లేకుండా ఉన్నవారు జామీనుపై విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది. ఐదున్నర సంవత్సరాల జైలు జీవితం గడిపిన ధర్మభిక్షం జైలు నుండి విడుదలయ్యాడు.


1952లో జరిగిన ఎన్నికల్లో ధర్మభిక్షం సూర్యాపేట నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 1957లో నకిరేకల్‌ నుంచి, 1962లో నల్లగొండ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాడు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో భాగం పంచుకున్నాడు. 1991లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. తిరిగి 1996లో రెండవసారి ఎంపిగా పోటీచేసినప్పుడు నల్లగొండ నియోజకవర్గం నుంచి 484 మంది అభ్యర్థులు బరిలో దిగారు. దేశంలోనే అతిపెద్ద బ్యాలెట్‌ పేపర్‌ను ఎన్నికల సంఘం ముద్రించింది. ఇంతమంది అభ్యర్థులు, ఇన్ని వందల ఎన్నికల గుర్తులున్నప్పటికీ ధర్మభిక్షం 76వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది, చరిత్ర సృష్టించాడు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ కల్లుగీతకార్మికుల సంక్షేమం కోసం నిరంతర పోరాటాలు కొనసాగించాడు. కల్లుదుకాణాల కేటాయింపులో హర్రాజు విధానాన్నీ, కాంట్రాక్టర్‌ వ్యవస్థను రద్దు చేయించి, సహకార సంఘాల ద్వారా కల్లు దుకాణాల నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టించాడు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి, చనిపోయిన గీతకార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోసం గీత పనివారల సంఘం ద్వారా ఉద్యమించాడు. రాష్ట్ర గీత పనివారల సంఘానికీ, జాతీయస్థాయి సమాఖ్యకూ నాయకత్వం వహించి హక్కుల సాధనకోసం పోరాడాడు.


పరిచయమైన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరిస్తూ, ఒక కుటుంబపెద్దలాగా కష్టసుఖాలు తెలుసుకునేవాడు. మానవ సంబంధాలకు విలువనిచ్చేవాడు. నిగర్వి, నిజాయితీకి నిలువెత్తు రూపం. తెల్లని శరీరఛాయకు తగినట్లు తెల్లని వస్త్రధారణం. సామాజిక న్యాయ సాధన అతని ఆశయం. సమసమాజ నిర్మాణం అతని అంతిమ లక్ష్యం. 89 సంవత్సరాల పరిపూర్ణమైన ఆదర్శ జీవితం గడిపిన ప్రజలమనిషి బొమ్మగాని ధర్మభిక్షం 2011 మార్చి 26వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు తుదిశ్వాస విడిచాడు. బంధుప్రీతికీ, ఆశ్రితజనపక్షపాతానికీ, అవినీతికీ, ఆస్తుల సంపాదనకు తాపత్రయపడని శ్రామిక ప్రజల నాయకుడు ధర్మభిక్షం జీవితం నేటితరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం.

ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

పూర్వ ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలయం

(నేడు ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు)

Updated Date - 2022-02-15T06:41:59+05:30 IST