Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 00:23:00 IST

సమాజానికి ఏది అవసరమో అదే ధర్మం

twitter-iconwatsapp-iconfb-icon
సమాజానికి ఏది అవసరమో అదే ధర్మం

అధ్యాపకుడు, అవధాని, కవి, మల్లయోధుడు, యోగసాధకుడు, మంత్రోపాసకుడు... ఇవి... తమిళనాడులోని కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి పూర్వాశ్రమంలోని ప్రధాన దశల్లో కొన్ని. ఎటువంటి అంశాన్నైనా సాధికారి కంగా, సునిశితంగా విశ్లేషించి, సరళంగా వివరించే పాండిత్యం ఆయనది.ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలపై ‘నవ్య’తో ఆయన సంభాషించారు.


సమాజానికి ఆధ్యాత్మికత అవసరం ఏమిటి?

మానవుణ్ణి దైవీ గుణాలు కలిగిన వ్యక్తిగా మార్చడం ఆధ్యాత్మికత లక్ష్యం. దైవీ గుణాలు ఉంటే మనుషుల్లో మానవత్వం, దైవత్వం పెరుగుతాయి. సమాజంలో అక్రమాలు, దౌర్జన్యాలు తగ్గుతాయి. న్యాయస్థానాలు, పోలీసుల అవసరం తగ్గుతుంది. దైవీ గుణాలు పెంపొందించుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికత పెరిగితే మానవ వ్యవస్థ, సమాజాల స్వరూపమే మారిపోతుంది. 


యోగా, ప్రాణాయామాన్ని ఆధ్యాత్మికతతో మేళవించడం అనే ధోరణి ప్రబలుతోంది. ఇందులో నిజం ఎంత? 

యోగా, ప్రాణాయామాలకు ఆధ్యాత్మికతను ప్రచోదనం చేయగల శక్తి కొంతవరకూ ఉంది. ‘యోగ చిత్తవృత్తి నిరోధః’ అని శాస్త్రం చెబుతోంది. మనసులో ఉండే పలు రకాల ఆలోచనలను నిభాయించుకోగల శక్తినిచ్చేది యోగం. ‘యోగా’ అంటే ఆసనాలు వేయడం మాత్రమే కాదు. ప్రాణాయామం మనిషికి ప్రాణశక్తిని ఇస్తుంది. ప్రాణశక్తి అందడం వల్ల ఆలోచనా శక్తి కలుగుతుంది. చెడు ఆలోచనలు పోతాయి. బలం, ఆరోగ్యం లాంటి విషయాలను పక్కనపెడితే మనసుకు సంబంధించిన అంశాల మీద వీటి ప్రభావం ఉంటుంది.


యోగా, ప్రాణాయామం లాంటి సాధనాల ద్వారా మనో నిగ్రహం కలిగించి... సత్ప్రవర్తన, సద్గుణాల వైపు మళ్లించేది ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతలో కూడా దశలు ఉన్నాయి. ఒక చోట ఆగకుండా.. ఒక్కో దశను అధిగమిస్తూ పోవాలి. పైపైకి వెళ్లి... దైవశక్తిని పరిపూర్ణంగా పొందగల స్థితిని చేరాలి. అది సాధించిన వ్యక్తులు తమ ప్రభావం, ప్రవర్తన, మానసిక శక్తుల ద్వారా మానవ సమాజానికి ఎంతో మేలు చేయగలుగుతారు. 


మన సంస్కృతి మీద విదేశీ ప్రభావం పెరుగుతోందా? లేక ఇది కాలం వల్ల వచ్చిన మార్పా?

కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అనంతమైన కాలంలో... ఆచారాల్లో, వ్యవహారాల్లో వచ్చిన  మార్పులను మన సమాజం అంగీకరిస్తూనే ఉంది. ‘సంస్కృతి’ అంటే సంస్కారం. మతం, జాతి, దేశాన్ని బట్టి సంస్కృతి ఏర్పడుతుంది. సంస్కృతి స్థిరమైనది కాదు. దేశ, కాల, మాన, జాతి పరిస్థితులను బట్టి మారుతుంది. నేను కాలేజీలో బోధించేటప్పుడు ఓ విద్యార్థి నన్ను ఓ ప్రశ్న అడిగారు... ‘‘సీతమ్మ ఒక్కరి కోసం రాముడు అన్ని లక్షలమందిని చంపాడు. ఇంకో పెళ్లి చేసుకుంటే సరిపోదా? ఎవరూ పిల్లను     ఇవ్వరా?’’ అని. దీనివల్ల ఆలోచనల్లో భిన్నత్వం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఒక మహారాజు భార్యకే దేశంలో రక్షణ లేకపోతే ఎలా? ‘ఎవరైనా తీసుకెళ్లినా పరవాలేదు’ అనే ఆలోచన రావడం సమాజంలో ఒక పొరపాటైన దుష్ట పరిణామం. సంస్కృతి తాలూకు స్వరూపం, జాతి తాలూకు లక్షణం, గౌరవం, మర్యాద పద్ధతి... ఇవన్నీ తెలుసుకుంటే... ఆ జాతి మహాద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ‘ఒకరి భార్యను ఎవడైనా ఎత్తుకెళ్తే... అతను ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా’ అనే ఆలోచన వచ్చిందంటే, సాంస్కృతిక పతనం మొదలైనట్లే.


ధర్మం అంటే ఏమిటి?

సమాజానికి అసలు ఏది అవసరమో అది ధర్మం. ధర్మం అంటే ఏదో కొన్ని నిబంధనలను పాటించడం కాదు. ‘ధర్మం ధర్మో కారంతి ప్రజాః’... దేనివల్ల సమాజం శాంతితో, సుఖంతో ఉంటుందో అది ధర్మం. ఈ రోజు ఉన్న అవసరాల మేరకు ఆచారాల్లో కొన్ని మార్పులు రావచ్చు. కానీ ధర్మం అనేది చాలా విస్తృతమైన అర్థం ఉన్న పదం. ధర్మం శాశ్వతమైనది. నీతి అంటే నడిపేది.. అది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. ఎన్నో యుగాల నుంచి మారుతోంది. ఒక్కొక్క యుగంలో కొందరు మహర్షులు ధర్మస్మృతిని చెప్పారు. సుస్థిరమైన ధర్మాన్ని సూచిస్తూ, ఆ ధర్మం ప్రకారం ఆచరణలో ఏయే మార్పులు చేయాలనేది యుగాలకు అనుగుణంగా మారుస్తూ చెప్పారు.


మన ఆర్ష ధర్మం మార్పును అంగీకరిస్తుంది. సమాజంలోని పరిస్థితుల మేరకు ఆచరణలో మార్పులు ఉంటాయి. మనకు ఆశ్రమధర్మాలు...  బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఉన్నాయి. మానవులందరికీ ఒకటే ఆచారం కాదు. ఒకే ధర్మసూక్ష్మం కాదు. అది మారుతూ ఉంటుంది. సామాన్యులు... సన్యాసుల్లా ఉండాల్సిన అవసరం లేదు. ‘ధర్మ స్వరూపాన్ని అవగతం చేసుకోవాలి. ధర్మం, సంస్కృతి అర్థాలను జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్లాలి. మార్పులను మీరు గమనించాలి’ అని ధర్మ శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు. ‘శ్రుతిశ్చ భిన్నః’, ‘శ్రుతయశ్చ భిన్నః’ అని స్మృతులు చెబుతున్నాయి. మహామహులు కూడా కొందరు ఒక్కో యుగంలో ఒక్కోలా చెప్పారు. ‘ధర్మశ్చ తత్వం గుహాయం...’-  అంటే ధర్మం గుహలలో నిక్షిప్తమై ఉంది. ‘గుహ’ అంటే తపస్సు చేసిన చోటు. ‘ఏం చేయాలా?’ అని నీకు సందేహం వస్తే, మహాజనులు ఎలా ప్రవర్తించారో అలా చెయ్యమని చెప్పారు. ఉదాహరణకు ‘అహింసా పరమోధర్మః’ అన్నారనుకోండి. అది అందరూ అంగీకరించేదే.


అలాగని శత్రువు దోపిడీ, దౌర్జన్యాలు చేస్తూ ఉంటే పట్టనట్లు ఉండకూడదు. నౌఖాలీ దోపిడీలు జరిగినప్పుడు గాంధీజీ అక్కడ ఉన్న హిందువులను ‘‘ఇతరులు మీ పట్ల అంత దారుణంగా ప్రవర్తిస్తుంటే మీరేం చేస్తున్నారు?’’ అని అడిగారు. అప్పుడు వారు ‘‘మీరు చెప్పిన అహింసను ఆచరిస్తున్నాం. వాళ్లేం చేసిన ప్రతిఘటించకుండా ఊరుకున్నాం’’ అన్నారు. బదులుగా గాంధీ ‘‘మీరు వారితో పోట్లాడి చనిపోయినా నేను సంతోషంగా ఉండేవాణ్ణి’’ అన్నారు. అదే విషయాన్ని ఆయన తన డైరీలో ప్రస్తావిస్తూ ‘‘నేను చెప్పిన అహింసా సిద్ధాంతం నేను ప్రాణంతో ఉండగానే ఇంతలా అపార్థానికి గురవుతుందని అనుకోలేదు’’ అని రాసుకున్నారు.


ధర్మాచరణ క్లిష్టంగా మారడానికి కారణం?

సైనికుణ్ణి హింస చేయవద్దంటే... అతను తన ధర్మాన్ని నిర్వర్తించకుండా చేయడమే అవుతుంది. ‘సత్యాం నాస్తి పరో ధర్మః’... అంటే సత్యం కంటే మించిన ధర్మం లేదు. అయినా మహాధర్మంతో పోల్చితే సత్యాన్ని అప్పుడప్పుడు ఉల్లంఘించవలసివస్తుంది. ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అలా వచ్చిందే. గూఢచారికి తన జాతిని రక్షించడమే ధర్మం. దొరకగానే మొత్తం నిజాలు శత్రు దేశానికి చెప్పకూడదు కదా? జాతికి ప్రమాదం కలిగినప్పుడు రక్షించుకోవడానికి అంతకుముందు ధర్మంగా భావించే వాటిని కూడా అవసరమైతే త్యజించవచ్చు.


ఉదాహరణకు మహమ్మద్‌ ఘోరీ ఉన్నాడు. పథ్వీరాజ్‌ మీద యుద్ధానికి వచ్చాడు. ఎన్నోసార్లు ఓడిపోయాడు. ఓడిన ప్రతిసారి కాళ్ల మీద పడి శరణు కోరేవాడు. ‘శరణాగత రక్షణ క్షత్రియ ధర్మం’ కదా! అని ఆయన వదిలేసేవాడు. చివరకు ఘోరీ ఒక్కసారి గెలిచాడు. పృథ్వీరాజ్‌ను చంపాడు. చక్రవర్తి అయ్యాడు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే క్షత్రియ ధర్మం అనేది దేశ కాలమాన పరిస్థితులను అర్థం చేసుకోకుండా అపాత్రగ్రస్థమయింది. దాన్ని ‘ధర్మ వికృతి’ అంటారు. హిందూ సమాజం ధర్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. తనను తాను రక్షించుకోవాలి. 


ఇప్పుడు ధర్మ రక్షణ ఎవరి బాధ్యత?

ఎవరు చెబితే జనం వింటారో వారే ఆ బాధ్యత తీసుకోవాలి. మనం ఏవో నాలుగు మంచి మాటలు చెప్పినంత మాత్రాన అవతలివాడు వినడు. ఆ శక్తి కలిగినవాడు చేయాలి. ఇప్పుడు జనాన్ని అధికారం, ధనం ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వం, ధనవంతులు ఏదైనా చెబితే... జనం అప్పటికి విన్నట్లు నటిస్తారు తప్ప ఆచరించరు. తపస్సంపన్నుడు, యోగి, ధర్మాచరణపరుడు చెబితే సమాజం వింటుంది. కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన వారు... నీతిగా, న్యాయంగా ఉండాలని చెబితే జనం వినరు. అవకాశం ఉన్నా ధనం, అధికారం మీద ఆశలేనివాడు చెబితే వింటారు. వీటన్నిటికన్నా మానవులను ఎక్కువ ప్రభావితం చేయగేది తపశ్శక్తి. అది ఉంటే ఏదైనా సాధ్యమే. జప, మంత్ర, తంత్ర, యోగ మార్గాల ద్వారా మానవునికి ఇచ్ఛాశక్తి వస్తుంది. వీటితో పాటు యజ్ఞ యాగాదులు కూడా చేయాలి. పీఠాధిపతులు, ధర్మాచార్యులు వీటిని పెంపొందింపజేసే చర్యలు చేపట్టాలి. 


ఆధ్యాత్మికతను కొందరు వ్యాపారంగా మార్చడం మీద మీ స్పందన?

ఆధ్యాత్మిక వ్యాపారం జరుగుతున్నమాట నిజం. అందులో సందేహించాల్సిన అవసరం లేదు. గురువుల్లో మంచివారు, చెడ్డవాళ్లు... ఇద్దరూ ఉంటారు. అది గుర్తించాల్సిందే తప్ప వ్యాపారాన్ని ఆపడం సాధ్యం కాదు. ప్రభుత్వం, ప్రజల శక్తి కూడా పరిమితమైనవే. ఏదైనా తప్పు చేసి దొరికితే ప్రజలు శిక్షిస్తున్నారు. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి తర్వాత మళ్లీ కలియుగాంతంలో కల్కి అవతారం వస్తుంది. అంటే ఇంకా రెండున్నర లక్షల సంవత్సరాల తర్వాత ఆ అవతారం వస్తుంది. ఈ మధ్యలో వచ్చే వారెవ్వరూ అవతార పురుషులు కాదు. దైవ కృప వల్ల పరిమిత శక్తులు కలిగినవారుంటారు. వాళ్లని పూజించవచ్చు, కానీ భగవంతుడు అనడం  తప్పు. 


భక్తి, మతం, మంత్రం, తంత్రం, ఆధ్యాత్మికత విషయాల్లో పెద్ద గందరగోళం ఉంది? 

ఇవన్నీ అధ్యాత్మికతలో భాగమే. ‘భగవంతుడు ఒక్కడే నాకు కావాలి... ఇంకేం వద్దు’ అనుకొనేవాడు భక్తుడు. అతను తన భక్తి తరంగాల ప్రభావం వల్ల ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రభావితం చేయవచ్చు. మంత్రం వల్ల శక్తి జనిస్తుంది. ‘శబ్దం వినా, నైవకదాతి తేజతః’... ‘తేజోవినా తదాతి శబ్దహః’... అంటే ‘శబ్దంలో నుంచి తేజస్సు పుడుతుంది. ఈ పుట్టే తేజస్సు మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. నాదానికి ఉన్న శక్తి మనిషి మనసును మారుస్తుంది’ అని మంత్రశాస్త్రం చెబుతోంది. ఏకాగ్రత కుదరకపోయినా శబ్దాన్ని పలికితే శక్తి పుడుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ధ్వనికి మంచీ, చెడు రెండు శక్తులు ఉన్నాయి. సంగీతానికి పూలు పూస్తున్నాయనీ, పంటలు బాగా పండుతున్నాయనీ నిరూపిస్తున్నారు. మంత్రధ్వని వల్ల తరంగాలు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే దేవాలయాల్లో వేద పారాయణ చేయిస్తారు. వేద మంత్రాల్లోని ఉదాత్త, అనుదాత్త శబ్దాల వల్ల వాతావరణంలోని కాలుష్యం పోతుంది. అలాంటి మంచిని పంచే కేంద్రాలే దేవాలయాలు, ఆశ్రమాలు.మనకుచాలామంది గురువులు వచ్చారు.  నిజమైన వారు ఎవరు?

ప్రతి ఒక్కరూ తమ ఆర్తిని తీర్చగల గురువు కోసం వెతుకుతూ ఉంటారు. చివరకు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. కానీ సద్గురువు మాత్రం శిష్యులను గుర్తించగలుగుతాడు... రామకృష్ణులు తన దగ్గరకు వచ్చినవారిలో వివేకానందుడిని గుర్తించినట్లు. ఇలా గురు శిష్యులు ఒకరినొకరు అన్వేషిస్తూ ఉంటారు. 

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

రెడ్ అలర్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.