ఈ పాపం ధరణిదే

ABN , First Publish Date - 2022-03-02T08:03:09+05:30 IST

హైదరాబాద్‌ నగర శివార్లలోని కర్నంగూడలో మంగళవారం ఉదయం జరిగిన రియల్టర్ల జంట హత్యలకు..

ఈ పాపం ధరణిదే

గతంలో అమ్మిన భూములకు పాత యజమానులకే 

కొత్త పాస్‌బుక్‌లు.. శివార్లలో వేలాది ప్లాట్లపై వివాదాలు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ నగర శివార్లలోని కర్నంగూడలో మంగళవారం ఉదయం జరిగిన రియల్టర్ల జంట హత్యలకు భూవివాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ భూ వివాదానికి ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘ధరణి’ కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక భూవివాదాలకు ‘ధరణి’ నిబంధనలు ఆజ్యం పోస్తున్నాయని అంటున్నారు. భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘ధరణి’ అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నప్పటికీ.. కొన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఽధరణిని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం పట్టా భూములకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేస్తోంది. అయితే గతంలో భూములు కొన్నవారు ఎవరైనా మ్యుటేషన్‌ చేయించుకోకుంటే ఽధరణి ద్వారా వారికి హక్కులు కల్పించడం లేదు. భూములు అమ్మిన పాత వారి పేరు మీదే కొత్త పాస్‌బుక్‌లు జారీ చేస్తున్నారు. ఈ భూములన్నీ కొన్నేళ్ల కిందటే ప్లాట్లు అయినప్పటికీ మ్యుటేషన్‌ జరగకుంటే పాత యజమానులకే పాస్‌బుక్‌లు జారీచేసి రైతుబంధు సాయాన్ని కూడా వారి ఖాతాలోనే జమ చేస్తున్నారు. దురాశపరులైన కొందరు కొత్త పాస్‌బుక్‌ల ఆధారంగా వీటిని తిరిగి మరో వ్యక్తులకు అమ్మేస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఇలాంటి వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలా కొత్తగా భూములను కొన్నవారికి, అంతకుముందే భూమి కొన్నవారికి లేదా ప్లాట్లు కొనేవారికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 


అంగబలం, అర్ధబలం ఉన్నవారిదే పైచేయి.. 

ఈ విధమైన పోకడల వల్ల దాదాపు రెండు, మూడు దశాబ్దాల కిందట ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాత యజమానులు వచ్చి ప్లాట్ల యజమానులను బెదిరిస్తున్నారు. దీంతో ఎంతోకొంత వారికి చెల్లించి వివాదాన్ని పరిష్కరించుకుంటున్నారు. మరికొందరైతే ఖాళీ స్థలాన్ని చదును చేసి ప్లాట్ల యజమానులను తరిమేస్తున్నారు. అంగబలం, అర్ధబలం ఉన్న వారిదే ఈ వివాదాల్లో పైచేయి అవుతోంది. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే.. ఎప్పుడో ఓసారి వచ్చి తమ స్థలాలను చూసుకొని వెళ్తుంటారు. దీన్ని అదునుగా వాడుకొని దురాశపరులు ఆ ప్లాట్లపై కన్నేసి.. మ్యుటేషన్‌ జరిగిందో లేదో చూసి మళ్లీ పాస్‌బుక్‌లకు దరఖాస్తు చేసుకొని హక్కులు పొందుతున్నారు. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు స్థానబలం, అంగబలంతో వీటిని కొని కొత్త పాస్‌బుక్‌లు పొందుతున్నారు. గతంలో ఈ స్థలాలను కొన్నవారిని బెదిరించి పంపేస్తున్నారు. మరికొందరైతే ప్లాట్ల యజమానులకు ఎంతో కొంత ఇచ్చి పంపించేస్తున్నారు. మహేశ్వరం, శంషాబాద్‌, షాద్‌నగర్‌, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, కీసర, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ తదితర మండలాల్లో ఇలాంటి భూవివాదాలు నెలకొన్నాయి. 

Updated Date - 2022-03-02T08:03:09+05:30 IST