గడువులోగా ధరణి ఇంటింటి సర్వే పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-10-17T06:45:56+05:30 IST

నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు, ఇతర వివరాలను ఇంటింటి సర్వే ద్వారా ధరణి పోర్టల్‌లో నమోదు చేసే ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని

గడువులోగా ధరణి ఇంటింటి సర్వే పూర్తిచేయాలి

మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 16: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు, ఇతర వివరాలను ఇంటింటి సర్వే ద్వారా ధరణి పోర్టల్‌లో నమోదు చేసే ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని గడువులోగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశమందిరంలో ధరణి ఇంటింటి సర్వేపై సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారీగా ఇప్పటి వరకు పూర్తయిన సర్వే వివరాలతోపాటు తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం నుంచి ఉదయం 7 గంటలకే సర్వే ప్రారంభం కావాలని, ధరణి పోర్టల్‌ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ట్యాబ్‌లో నమోదు చేసే సమయంలో వచ్చే సర్వర్‌ డౌన్‌ వంటి సాంకేతిక సమస్యలతోపాటు ఇతర సమస్యలను సూపర్‌వైజింగ్‌ అధికారులు స్వయంగా పరిశీలించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కమర్షియల్‌ ప్రాపర్టీకి సంబంధించి వాటిపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి వివరాలను సరిగా నమోదు చేయాలని అన్నారు.


వీటిలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అందుకు సంబంధిత అధికారులు, ఉద్యోగులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమర్షియల్‌ కమ్‌ రెసిడెన్షియల్‌ ఉన్న వాటికి సంబంధించిన రెండు వివరాలను నమోదు చేయాలని అన్నారు. బిల్‌ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వారి పరిధిలోని ప్రాంతాలను సర్వే సిబ్బందికి తె లుపుతూ సహకరించాలని అన్నారు. ప్రతి రోజు వందశాతం ధరణి పోర్టల్‌ సర్వే ఖచ్చితంగా చేసి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఇళ్ళకు తాళాలు వేసి ఉంటే పక్కన ఇంటి వారి నుంచి వారి ఫోన్‌ నెంబర్‌ తీసుకొని వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ధరణి సూపర్‌వైజింగ్‌ అధికారులు అదనపు కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ త్రయంభకేశ్వర్‌, ఈఈ రామన్‌, ఏఈలు, ఆర్‌ఐ, సానిటరీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-17T06:45:56+05:30 IST