ధరణి చిక్కులు

ABN , First Publish Date - 2022-04-24T05:30:00+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ర్టేషన్‌ కోసం ధరణి పోర్టల్‌ను ప్రవేశ పెట్టింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఈ ప్రక్రియ ద్వారానే జరుగుతున్నాయి.

ధరణి చిక్కులు


  • రైతుల పాలిట శాపంగా ధరణి పోర్టల్‌ ఫ భూమి లేనివారికి కూడా పట్టాదారు పాస్‌పుస్తకం
  • పట్టా భూములు లావునిగా నమోదు ఫ ప్రొహిబిటెడ్‌ భూములకు దక్కని మోక్షం
  • తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ర్టేషన్‌ కోసం ధరణి పోర్టల్‌ను ప్రవేశ పెట్టింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఈ ప్రక్రియ ద్వారానే జరుగుతున్నాయి. కానీ ధరణిలో వస్తున్న సమస్యల కారణంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధరణిలో తప్పుగా పడిన భూముల వివరాలను సరిచేసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. భూసమస్యల పరిష్కారం కోసం రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది.

షాద్‌నగర్‌రూరల్‌, ఏప్రిల్‌, 24: సమగ్ర భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌ రైతుల పాలిట శాపంగా మారింది. తప్పుగా పడిన తమ భూముల వివరాలను సరిచేసుకునే మార్గం దొరక్క రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ధరణిలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే అధికారం తహసీల్దార్లకు కాకుండా ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించడం, అందుకు మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో రైతులకు ఇబ్బందిగా మారింది. మీసేవలో ఒకసారి దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కాకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 

భూమి లేకున్నా పట్టాదారు పాస్‌పుస్తకం

మొగిలిగిద్ద రెవెన్యూ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన జవ్వాజి చెన్నయ్యకు సర్వే నెంబరు 303లో పట్టా భూమి ఉంది. కానీ సర్వే నెంబరు 304లో అతనికి 1ఎకరం 39 గుంటల భూమి ధరణిలో నమోదైంది. అతనికి పట్టాదారు పాసుపుస్తకం కూడ జారీ చేశారు. 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయమూ పొందుతున్నాడు. వాస్తవంగా సర్వే నెంబర్‌ 304లో 14 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం సదరు భూమిని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కొనుగోలు చేసి ఫెన్సింగ్‌ చేసుకున్నాడు. అయితే ఆ భూమిలోని 1.39 ఎకరాలకు సంబంధించి పాసుపుస్తకం చెన్నయ్యకు ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు మండలంలో చాలావరకు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన పోలెమోని చంద్రయ్యకు అనువంశికంగా సర్వేనెంబర్‌ 297లో 2ఎకరాల 31గుంటల భూమి ఉంది. ఆ సర్వే నెంబరు పట్టాదారు పాసుపుస్తకంలో అదర్స్‌ అని నమోదైంది. చాలావరకు పట్టా భూములను అసైన్డ్‌, ఎండోమెంట్‌, వక్ఫ్‌, లావుని భూములుగా నమోదు చేసి ప్రొహిబిటెడ్‌ లిస్ట్‌లో పెట్టారు. ఎల్లంపల్లికి చెందిన శ్రీశైలం కుటుంబ సభ్యులు 20 ఏళ్ల కింద అదే గ్రామానికి చెందిన రైతు నుంచి 9 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకంలో కొనుగోలు నమోదైనా ధరణిలో మాత్రం లావుని భూమిగా నమోదైనట్లు సదరు రైతు లబోదిబోమంటున్నారు. 

గుదిబండగా మారిన ప్రొహిబిటెడ్‌ సమస్య

ప్రొహిబిటెడ్‌గా నమోదైన భూముల సమస్య పరిష్కారం రైతులకు గుదిబండగా మారింది. ఒక సర్వే నెంబరులో ఉన్న అన్నదమ్ములు భాగం పరిష్కారం కోసం కోర్టుల్లో కేసులు వేసుకుంటే సదరు నెంబరు మొత్తాన్ని ప్రొహిబిటెడ్‌ పరిధిలో పెట్టారు. అదే సర్వేనెంబరులో ఉన్న మిగతా రైతులు తమ సమస్య పరిష్కారం కాక ఆందోళన చెందుతున్నారు. ఎలికట్ట శివారులో 228 సర్వేనెంబరులో ఉన్న భూమి పంపకాల కోసం కొందరు అన్నదమ్ములు కోర్టులో కేసులు వేసుకున్నారు. అయితే సదరు సర్వేనెంబరు మొత్తాన్ని నిషేధిత భూముల జాబితాలో పెట్టారు. దాంతో మిగతా రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తహసీల్దారు సూచన మేరకు మీసేవలో దరఖాస్తు చేసుకొని కలెక్టర్‌కు పంపినా సమస్య పరిష్కారం చేయకుండానే రిజెక్ట్‌ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా క్లియర్‌ కాలేదు

ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట శివారులో సర్వేనెంబర్‌ 228, 230లో మాకు భూమి ఉంది. ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. అధికారుల సూచన మేరకు మీ పేవలో దరఖాస్తు చేసుకున్నా రిజెక్ట్‌ చేశారు. మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నారు. అయినా పరిష్కారం అవుతుందో లేదోనని అనుమానంగా ఉంది. నిషేధిత జాబితాలో నుంచి తమ భూమిని తొలగించాలి.

- మహేష్‌ జవార్‌, హైదరాబాద్‌

మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే క్లియర్‌ చేస్తాం

నిషేధిత జాబితాలో ఉన్న భూములను క్లియర్‌ చేయడానికి అన్ని వివరాలతో మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే కలెక్టరుకు పంపించి 

క్లియర్‌ చేయిస్తాం.                                                              - గోపాల్‌, తహసీల్దారు, ఫరూఖ్‌నగర్‌

Updated Date - 2022-04-24T05:30:00+05:30 IST