దసరాకు ధరణి

ABN , First Publish Date - 2020-09-27T08:30:30+05:30 IST

రానున్న దసరా పండుగ రోజున(అక్టోబరు 25న) సమీకృత భూరికార్డుల యాజమాన్య విధానాన్ని(ధరణి) ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

దసరాకు ధరణి

ఆ రోజే వెబ్‌సైట్‌ వినియోగంలోకి 

అప్పటిదాకా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఉండవు 

డీటీలు, తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు శిక్షణ

ప్రతి కార్యాలయంలో ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌

సర్వే నంబర్ల వారీ భూముల ధరలు ఖరారు: సీఎం


హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రానున్న దసరా పండుగ రోజున(అక్టోబరు 25న) సమీకృత భూరికార్డుల యాజమాన్య విధానాన్ని(ధరణి) ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆ రోజు సీఎం స్వయంగా ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారు. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, బ్యాండ్‌ విడ్త్‌... తదితర అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మారిన రిజిస్ట్రేషన్‌ విధానం, వెంటనే మ్యుటేషన్‌ చేయడం, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్‌ చేయడం తదితర అంశాలపై, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డెమో ట్రయల్స్‌ను కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతీ మండలంలో, ప్రతీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్‌ ఆపరేటర్లను వెంటనే నియమించాలన్నారు. 


ధరణికి ముందే ధరలు ఖరారు

ధరణి పోర్టల్‌ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా భూముల విలువలను ఖరారు చేయనున్నట్లు సీఎం చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. తహశీల్దారు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారికి డాక్యుమెంట్లను సిద్ధం చేయడానికి, తయారు చేయడానికి వీలుగా డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి, వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ధరణి పోర్టల్‌లో చేర్చాలని ఆదేశించారు. తర్వాత జరిగే మార్పులు, చేర్పులు వెనువెంటనే నమోదు చేయడం జరుగుతుందన్నారు. దసరా రోజున పోర్టల్‌ ప్రారంభిస్తునందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని సీఎం ప్రకటించారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని స్పష్టం చేశారు.


కీలక నిర్ణయాలన్నీ దసరా రోజునే

తెలంగాణలో కీలక నిర్ణయాలన్నీ దసరా రోజే అమల్లోకి వచ్చాయి. 2016 అక్టోబరు 11న దసరా రోజునే తెలంగాణలో 21 కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో అతిపెద్ద పాలన సంస్కరణగా ఆ రోజు చరిత్రలో నిలిచిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కి చేరింది. 


తహసీల్దార్‌ సెలవులో ఉంటే డీటీలు.. 

తహసీల్దార్‌ సెలవుల్లో ఉంటే... రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియలు ఆగకుండా డిప్యూటీ తహసీల్దార్‌(నాయబ్‌ తహసీల్దార్‌)కు రిజిస్ట్రేషన్‌ అధికారం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే డీటీలకు కూడా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. తహసీల్దార్‌లు కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్నపుడు ప్రొటోకాల్‌ విధులను డిప్యూటీ తహసీల్దార్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల జారీలో నివేదికలు వంటి బాధ్యతలు డిప్యూటీ తహసీల్దార్లు చూస్తున్నారు. తహసీల్దార్‌ ఏదేనీ కారణంతో సెలవులో వెళితే రిజిస్ట్రేషన్లు ఆగకుండా ఉండటానికే డిప్యూటీ తహసీల్దార్లకు కూడా శిక్షణ అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2020-09-27T08:30:30+05:30 IST