ధరలపై చంద్రబాబు పోరు

ABN , First Publish Date - 2022-05-05T06:30:54+05:30 IST

రాష్ట్రంలో చార్జీల పెంపు, ధరల పెరుగుదలపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోరుబాట పట్టారు.

ధరలపై చంద్రబాబు పోరు

నేడు తాళ్లవలసలో రచ్చబండ

విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపు, ధరల పెరుగుదలపై 

పార్టీ ముద్రించిన ‘బాదుడేబాదుడు’ కరపత్రంతో పాటు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఇంటింటికీ పంపిణీ

 అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద

ప్రజలతో ముఖాముఖి

మూడున్నర గంటలపాటు కార్యక్రమం


విశాఖపట్నం, భీమునిపట్నం రూరల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో చార్జీల పెంపు, ధరల పెరుగుదలపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోరుబాట పట్టారు. విద్యుత్‌, బస్సు చార్జీల పెంపు, నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ ధరలు పెరుగుదల కారణంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందిపడుతున్నారో స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ రూపొందించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాళ్లవలస గ్రామాన్ని ఆయన సందర్శించనున్నారు. పెరిగిన ధరల వల్ల ప్రజలపై ఎంత భారం పడిందో వివరిస్తూ పార్టీ ముద్రించిన కరపత్రంతో పాటు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టెలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. ధరలపై వారి స్పందన తెలుసుకుంటారు. ఆ తరువాత గ్రామంలో రచ్చబండ వద్ద ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేతివృత్తులు, కులవృత్తులు, ఇతర వర్గాలు, గ్రామానికి చెందిన మహిళలు, యువత, రైతులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. ఆ తరువాత చంద్రబాబునాయుడు మాట్లాడతారు. ముందుగా అనుకున్న మేరకు కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటలకల్లా ముగించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశామని భీమిలి మండల టీడీపీ అధ్యక్షుడు దంతులూరి అప్పలనరసింహరాజు తెలిపారు. నియోజకవర్గంలో మూడు మండలాలు, మధురవాడ ప్రాంతం నుంచి పార్టీ నాయకులు హాజరుకావాలని ఇప్పటికే సమాచారం అందించామన్నారు. 

బండారు ఇంటికి చంద్రబాబు

తాళ్లవలసలో కార్యక్రమం ముగిసిన తరువాత చంద్రబాబునాయుడు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం,  పరవాడ మీదుగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి వెళతారు. ఇటీవల వివాహమైన బండారు కుమారుడు అప్పలనాయుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అక్కడ నుంచి అచ్యుతాపురం, ఎలమంచిలి మీదుగా తుని వెళతారు. 


Read more