ధరల పిడుగు

ABN , First Publish Date - 2022-08-18T05:10:53+05:30 IST

పంటల సాగుపై ధరల పిడుగు పడింది. అమాంతం పెరిగిన రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలతో పంటల సాగుకు అన్నదాతలు ఆలోచిస్తున్నారు.

ధరల పిడుగు

భారీగా పెరిగిన ఎరువులు, 

పురుగు మందుల ధరలు

పంట పెట్టుబడులపై తీవ్ర ప్రభావం

భారమైన వ్యవసాయం

ఆందోళనలో అన్నదాతలు

సాగుకు వెనుకంజ


ధర్మవరం రూరల్‌


పంటల సాగుపై ధరల పిడుగు పడింది. అమాంతం పెరిగిన రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలతో పంటల సాగుకు అన్నదాతలు ఆలోచిస్తున్నారు. దీంతో సాగు సంకటంలో పడింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలేదు. సాగుకు అవసరమయ్యే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. గత రబీతో పోల్చుకుంటే ప్రస్తుత ఖరీ్‌ఫకి ఎరువులు, మందుల కంపెనీలు ధరలు పెంచేసి, రైతులపై పెనుభారం మోపాయి. దీంతో రానురాను వ్యవసాయం భారంగా మారుతోంది. ఉన్న భూములను బీడు పెట్టుకోలేక ఎంతోకొంత సాగుచేద్దామన్నా పెట్టుబడుల భారం రెట్టింపవుతుండడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. పంట పెట్టాలంటే ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన నడుస్తోంది. ఇప్పటికే పలువురు రైతులు వేరుశనగ సాగుచేయగా.. వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. వర్షం కురవడంతో వరినారు సిద్ధం చేసుకున్న రైతులు నాట్లు వేయడానికి దుక్కి దున్నుకునే పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఒక్కసారిగా ఎరువులు, రసాయనిక మందుల ధరలు ఏకంగా 10 నుంచి 20 శాతం పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వరి పంటకు ఎరువులతోపాటు రసాయనిక మందులను పలుమార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాగుచేసిన వేరుశనగకు తెగుళ్లు సోకడంతో వాటిని అదుపు చేసుకోవాలంటే తప్పనిసరిగా క్రిమిసంహారక మందులను పిచికారీ చేయా లి. కూరగాయలు, ఉద్యానవన పంటలకు తెగుళ్లను బట్టి రోజుమార్చి రోజు రసాయనిక మందులు పిచికారీ చేస్తూ, ఎరువులు వే సుకోవాల్సి ఉంటుంది. వీటి ధరలు విపరీతంగా పెరగడంతో పెట్టుబడుల భారం భరించలేక రైతులు మరింత కుంగిపోతున్నారు. రూ.వేలకువేలు వెచ్చించి, పెట్టుబడులు పెట్టినా పంట చేతికొస్తుందో.. లేదోనన్న భయాందోళనలు వారిని వెంటాడుతున్నాయి.


అమాంతం పెరిగిన ధరలు

రసాయనిక మందులు, ఎరువుల ధరలు ఆమాంతం పెరిగాయి. గత రబీ, ప్రస్తుత ఖరీ్‌ఫకి 10 శాతానికిపైగా ధరలు పెరిగాయి. క్రిమిసంహారక మందులైతే ఏకంగా లీటరు మందుకు రూ.వందల్లో ధరలు పెరిగాయి. దీంతో పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.


ధరల నియంత్రణపై దృష్టి ఏదీ..?

సీజన్ల వారీగా ఎరువులు, రసాయనిక మందుల ధరలను ఆయా కంపెనీలు పెంచుకుంటూ పోతున్నా.. ప్రభుత్వం మాత్రం వాటిని అదుపుచేయలేక పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు శ్రేయస్సు, అభివృద్ధే ధ్యేయం అని ఊదరగొడుతున్న ప్రభుత్వాలు ధరల నియంత్రణపై ఎందుకు దృష్టి పెట్టడంలేదో అర్థం కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా కంపెనీల ధరలు పెంచుకుంటూ పోతుంటే ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొన్ని ఎరువుల ధరలు పెరిగినపుడు కేంద్రం రాయితీ పెంచి, రైతులపై ధరల భారం పడకుండా కొంతమేర ఊరట కలిగించేది. ప్రస్తుతం అలాంటి రాయితీలు కొరవడడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు భారీగా వస్తున్నాయి.


ఉద్యాన పంటల సాగు మరింత భారం

ఎరువులు, మందుల ధరలు పెరగడంతో ఉద్యానవన రైతులకు పెట్టుబడులు అధికమౌతున్నాయి. బొప్పాయి, చీనీ, దానిమ్మ, పంటలతోపాటు కాయగూర పంటలు బెండ, టమోటా, మిరప పంటలకు అధికంగా చీడపీడలు, తెగుళ్లు వ్యాపిస్తుంటాయి. బెండ పంటకు రోజుమార్చి రోజు మందులను పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఈ పంటలకు తెగుళ్లు అధికంగా సోకే అవకాశం ఉంది. ఆ మేరకు మందులు కూడా పిచికారీ చేయాల్సి ఉంటుంది. పెరిగిన ఎరువులు, మందుల ధరలతో పెట్టుబడి తడిసి మోపడవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


వరి సాగు చేయాలంటే భయంగా ఉంది..

రసాయనిక మందులు, ఎరువుల ధరలు పెరగడంతో ఖరీ్‌ఫలో వరి సాగు చేయాలంటే భయపడాల్సి వస్తోంది. రూ.వేలకువేలు వెచ్చించి, ఎరువులు వేసినా పంట చేతికొచ్చేవరకు భయంగా ఉంటుంది. ఇప్పటికే వేరుశనగ సాగు చేశా. కాంప్లెక్స్‌ ఎరువులు వేయాల్సి ఉంది. ధరలు పెరగడంతో వేయలేకపోతున్నా. ఎరువులు, మందుల ధరలు తగ్గించి, ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో అందించి రైతాంగాన్ని ఆదుకోవాలి.  

చెలిమి ఆంజనేయులు, వేరుశనగ రైతు, గరుడంపల్లి


పెట్టుబడి భారం

రెండెకరాల్లో చీనీ సాగు చేశా. పంటకు సోకే తెగుళ్ల నివారణకు ఎప్పటికప్పుడు రసాయనిక మందులను పిచికారీ చేయాల్సి ఉంటుంది. దిగుబడి బాగా వచ్చేందుకు ఎరువులు వాడాల్సి ఉంటుంది. ఆరునెలలకోసారి ఎరువులు, రసాయనిక మందుల ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో పెట్టుబడి భారం అధికమౌతోంది. ప్రభుత్వం స్పందించి, ఎరువులు, రసాయనిక మందులను సబ్సిడీతో పంపిణీ చేయాలి.

పతకమూరి నాగరాజు, చీనీరైతు, చింతలపల్లి


వ్యవసాయంపై ఆసక్తి సన్నగిల్లింది..

గతంలో వ్యవసాయం చేయాలంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు సన్నగిల్లింది. పంటలకు ఏవేవో తెగుళ్లు సోకుతున్నాయి. వాటికి ఎన్ని మందులు కొట్టినా ప్రయోజనం లేదు. ఎంత ఖర్చుపెట్టినా పెరిగిన ధరలతో కనీసం పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. పండిన పంటకు మార్కెట్‌లో ధరలు లేవు. అందుకే పంటల సాగుపై ఆసక్తి సన్నగిల్లింది.

నాగభూషణం, రైతు, గరుడంపల్లి 


Updated Date - 2022-08-18T05:10:53+05:30 IST