ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-06-28T05:25:03+05:30 IST

తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకాలి... అందుకు ఆ రైతు మార్కెట్‌ను గమనించుకోవాలి... ఇవన్నీ ఎందుకని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఎప్పుడైనా నగదు జమవుతుంది అనుకున్నారు.

ఎదురుచూపులు

ధాన్యం నగదు కోసం రైతులు

భారమవుతున్న వడ్డీలు... రుణదాతల ఒత్తిడి

మూడు నెలలవుతున్నా సమాధానమివ్వని అధికారులు

ఆత్మకూరు మినహా ఎక్కడా జరగని చెల్లింపులు

 

అల్లూరు, జూన్‌ 27 : తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకాలి... అందుకు ఆ రైతు మార్కెట్‌ను గమనించుకోవాలి... ఇవన్నీ ఎందుకని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఎప్పుడైనా నగదు జమవుతుంది అనుకున్నారు. కానీ ధాన్యం విక్రయించి, మూడు నెలలైనా నగదు జమ కాలేదు. ఎప్పుడు జమ అవుతుందో కూడా తెలియని  పరిస్థితి. లక్షల ఎకరాల్లో తొలికారు వరికోతలు జరిగి ఇప్పటికి నాలుగు నెలలు దాటుతున్నా, విక్రయించిన ధాన్యానికి  ఇంతవరకు నగదు జమకాలేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని ఆర్భాటం చేసింది. వీటి ద్వారా విక్రయిస్తే గిట్టుబాటు ధర లభిస్తుందని, సత్వరమే నగదు జమవుతుందని రైతులు ఆశపడ్డారు. జిల్లాలో అధికారులు కూడా అదేవిధంగా వ్యవహరించి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం సేకరించి మూడు నెలలు పూర్తవుతున్నా ఇప్పటివరకు  రైతులకు నయాపైసా కూడా జమకాలేదు. ప్రతీరోజూ తాము  ధాన్యం విక్రయించిన కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి తమకు నగదు జమయ్యిందో లేదో తెలుసుకొని వెనుతిరిగి రావడమే పరిపాటిగా మారింది.


పెరుగుతున్న వడ్డీలు

 సహజంగా రైతులు వరిసాగు చేపట్టాలంటే  తన వద్ద ఉండే నగదు కాక ఇతరుల వద్ద రుణం తీసుకుంటారు. అలాగే ఎరువులు, పురుగు మందుల దుకాణదారుల నుంచి అరువు తెచ్చుకొని వరిసాగు చేపడతారు. తొలికారు సాగులో ఇదే జరిగింది. బయట మార్కెట్లలో పుట్టి  ధాన్యం ధర రూ.14 వేలు అటుఇటుగా దళారులు, మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మరింత ఎక్కువ  గిట్టుబాటు ధర దొరుకుతుందని రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని అమ్మారు. అయినా రైతులకు ఇప్పటికీ నగదు జమ కాలేదు. దీంతో తమకు బకాయిలు చెల్లించాలని రుణదాతలు, ఎరువులు, పురుగు మందుల యజమానులు రైతులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. 


ప్రొక్యూర్‌మెంట్‌, ట్రక్‌ షీట్లు లేకున్నా కొనుగోళ్లు 

 ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లినప్పుడు ప్రొక్యూర్‌మెంట్‌ సైట్‌ పనిచేయలేదు.అయినా రైతులు ధాన్యం కల్లాల్లో ఉంచుకోలేక నమ్మకంపై మిల్లర్లకు ట్రక్‌ షీట్లు పొందకుండానే ధాన్యాన్ని తరలించారు. బ్యాంక్‌ గ్యారెంటీలు లేకపోయినా మిల్లర్లు ధాన్యాన్ని సేకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు నగదు జమచేసేందుకు ప్రొక్యూర్‌మెంట్‌ సైట్‌ అందుబాటులోకి రాలేదు. 


రూ. 315.01 కోట్ల బకాయిలు

 జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన రైతులు 16,963 మంది ఉన్నారు. వీరికి మొత్తం రూ599.04 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో 8,280 మంది రైతులకు మూడు నెలల నుంచి ఇప్పటివరకు సుమారు రూ.284.08 కోట్లు చెల్లించారు. ఇంకా 7,683 మందికిగాను సుమారు రూ315.01 కోట్లు చెల్లించాల్సి ఉంది. 


ఆత్మకూరులోనే చెల్లింపులు

ఒక్క ఆత్మకూరు నియోజకవర్గం మినహా జిల్లాలో ఎక్కడా ధాన్యం విక్రయించిన రైతులకు నగదు చెల్లింపులు జరగలేదు. ఉప ఎన్నికను పురస్కరించుకుని, అధికార పార్టీకి ఓట్లు పడాలనే ఉద్దేశంతో అక్కడి రైతులకు అప్పటికప్పుడే నగదు జమ చేశారు.  ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని  ధాన్యం తాలూకు నగదు జమ చేయాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు.   

Updated Date - 2022-06-28T05:25:03+05:30 IST