తిరుమలలో ముగిసిన ధనుర్మాస పూజ

ABN , First Publish Date - 2021-01-16T05:15:42+05:30 IST

తిరుమలలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. ధనుర్మాసం సందర్భంగా నాదనీరాజనం వేదికపై డిసెంబరు 15వ తేది నుంచి మార్గశిర విష్ణువైభవ ప్రవచనం గురువారం వరకు జరిగింది.

తిరుమలలో ముగిసిన ధనుర్మాస పూజ
బిల్వపత్రాలతో పూజ చేస్తున్న అర్చకులు

తిరుమల, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. ధనుర్మాసం సందర్భంగా నాదనీరాజనం వేదికపై డిసెంబరు 15వ తేది నుంచి మార్గశిర విష్ణువైభవ ప్రవచనం గురువారం వరకు జరిగింది. భాగవతం, విష్ణుపురాణం వినటం ద్వారా ముక్తి లభిస్తుందన్న విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 10 నుంచి వసంత మండపంలో శ్రీవిష్ణు బిల్వాపత్రార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించాయి. ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు, నమూనా అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని వసంతమండంలోకి వేంచేపు చేసి బిల్వపత్రాలతో పూజించారు. సాధారణంగా శివుడికి బిల్వాపత్రలతో పూజ చేస్తారు. ధనుర్మాసంలో మాత్రమే శ్రీమహావిష్ణువును పూజిస్తారు. 


శ్రీవారి ఆలయంలో ‘కాకబలి’ 


శ్రీవారి ఆలయంలో ఏటా కనుమ రోజున ఉదయాత్పూరం నిర్వహించే ‘కాకబలి’ కార్యక్రమం శుక్రవారం వైదికోక్తంగా జరిగింది. వేకువజామున 3 గంటలకు తోమాల, కొలువు మధ్యలో అర్చకస్వాములు కాకబలి నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనందనిలయం విమాన వేంకటేశ్వరస్వామికి నివేదించారు. 

Updated Date - 2021-01-16T05:15:42+05:30 IST