Abn logo
Aug 4 2021 @ 00:38AM

ధమ్‌ బిర్యానీ దగా

బిర్యానీలో వచ్చిన పురుగు

కుళ్లిపోయిన చికెన్‌, మటన్‌తో వంటకాలు 

పలు ప్రధాన హోటళ్ల ఘుమఘుమల మోసం 

బిర్యానీ పాయింట్‌ల పేరిట కల్తీభోజనం 

ప్రజల ప్రాణాలతో చెలగాటం 

మున్సిపల్‌ అధికారుల ఆకస్మిక దాడులతో వెలుగుచూసిన అక్రమాలు 

ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది 

నిర్మల్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రెస్టారెంట్‌లు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముఖ్యంగా తమ ప్రత్యేకతలుగా చెప్పుకునే ధమ్‌ బిర్యా నీ, మటన్‌ బిర్యానీల పేరిట ఈ హోటళ్లు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. హోటళ్లలోని కిచెన్‌లను పరిశీలిస్తే అవిన్నీ మురికికాలువలను తలపించే రీతిలో దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయంటున్నారు. దీంతో పాటు నాలుగైదు రోజుల కింద కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో భద్రపర్చిన చికెన్‌, మటన్‌ ముక్కలతో బిర్యానీలు చేస్తూ  వినియోగదారులకు ఆకర్షణీయంగా అంటగడుతున్నారు. ఈ ఫ్రిజ్‌లలో మటన్‌, చికెన్‌ ముక్కలు కుళ్లిపోయినప్పటికీ వాటిని పారేయకుండా తిరిగి బిర్యానీ వంటకాల్లోనే వినియోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని బిర్యానీ పాయింట్‌లలో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతు న్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. చాలారోజుల నుంచి ఇలా చికెన్‌, మట న్‌ బిర్యానీల్లో కుళ్లిన మాసాన్ని వాడుతున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏనాడు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం మం చిర్యాల రోడ్డుకు ఆనుకొని ఉన్న లక్ష్మీ గ్రాండ్‌హోటల్‌లో మున్సిపల్‌ అధికారులు బిర్యానీ తినేందుకు వచ్చి అక్కడి మోసా న్ని చూసి నివ్వెరపోవాల్సి వచ్చింది. తాము తిం టున్న భోజనంలో పురుగులు రావడంతో వెంటనే వా రు హోటల్‌లోని కిచెన్‌కు వెళ్లి తనిఖీ చేశారు. ఈ  సందర్భంగా హోటల్‌లో చూసిన దృశ్యాలతో మున్సిపల్‌ అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది. ఏకంగా మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ సైతం ఈ హోటల్‌ను చూసి ఖంగుతిన్నారు. పైనపటారం లోనలోటారం అన్న రీతిలో ఈ హోటల్‌ యాజమాన్యం జనాలకు విక్రయించే మటన్‌, చికెన్‌ బిర్యానీలను కల్తీ చేసి అమ్ముతున్నట్లు ఆయన గుర్తించారు. హోటల్‌లోని కిచెన్‌ను, అక్కడి ఫ్రిజ్‌లను తనిఖీ చేసి అక్కడ భద్రపర్చిన కుళ్లిన మటన్‌, చికెన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే హోటల్‌లోని కిచెన్‌ను సీజ్‌ చేయడమే కాకుండా ఆ హోటల్‌కు రూ.50వేల జరిమానాను విధించారు. ఈ హోటల్‌తో పాటు మరికొన్ని ప్రధానహోటళ్లలో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతోందన్న ఫిర్యాదులున్నాయి. దీంతో పాటు ఇటీవల నిర్మల్‌తో పాటు ఖానాపూర్‌, భైంసా పట్టణాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న టిఫిన్‌ సెంటర్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు, బిర్యానీ పాయింట్‌లు కర్రీ పాయింట్‌లలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. అధికారులు ఎప్పుడో ఓసారి తనిఖీలు చేస్తున్న కారణంగా హోటల్‌ యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి జనానికి కల్తీ వంటకాలను అంటగడుతున్నారంటున్నారు. పేరుకు పెద్దవిగా చెప్పుకునే ఈ హోటళ్లలో అడుగడుగునా కల్తీ రాజ్యమేలుతోందంటున్నారు. అధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడం అలాగే హోటల్‌ యాజమాన్యాలు తమకున్న పలుకుబడి, పరపతితో అందరిని మేనేజ్‌ చేస్తున్న కారణంగా ఈ కల్తీ దందాకు అడ్డుఅదుపు లేకుండా పోతోందంటున్నారు. 

అధికారుల తనిఖీతో గుట్టురట్టు

గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్మల్‌ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న కల్తీ ఆహారం గుట్టు మున్సిపల్‌ అధికారుల తనిఖీతో బట్టబయలైదంటున్నారు. మంగళవారం మున్సిపల్‌ అధికారులు మంచిర్యాల రోడ్డు కు ఆనుకొని ఉన్న ఓ ప్రధాన హోటల్‌పై దాడి చేయడంతో కల్తీచికెన్‌, మటన్‌ బిర్యానీలతో పాటు ఇతర స్నాక్స్‌ వ్యవహారం గుట్టురట్టయ్యింది. వాస్తవానికి అధికారులు ఈ హోటల్‌లోకి భోజనం చేసేందుకు వచ్చి నట్లు సమాచారం. ఆ అధికారులు భోజనం చేస్తున్న క్రమంలోనే అందు లో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా వెలుగు చూ సిన వాస్తవాలతో మున్సిపల్‌ యంత్రాంగం నివ్వెరపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. హోటల్‌లోని ఫ్రిజ్‌లలో పెద్దమొత్తంలో కుళ్లిపోయిన చికెన్‌, మటన్‌ ముక్కలు అలాగే ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనిక రంగులు, మసాల దినుసులు బయట పడ్డాయి. కల్తీనూనెలు కూడా ప ట్టుబడ్డాయి. అలాగే ఈ హోటల్‌లోని కిచెన్‌ పూర్తిగా దుర్గంధమయంతో కనిపించింది. ఇక్కడి వాతావరణం పూర్తిగా జనం అసహ్యించుకునే విధంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. యాదృశ్చికంగా అధికారులు చేపట్టిన తనిఖీలతో మొత్తం హోటళ్లకల్తీ వ్యవహారం వెలుగు చూ సిందంటున్నారు. ఇకనైనా అధికారులు బిర్యానీ పాయింట్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ ఆహారానికి అడ్డుకట్ట వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.