UAE: భిక్షాటన చేయించినా, చేసినా.. రూ.20లక్షల జరిమానా.. 6నెలల జైలు!

ABN , First Publish Date - 2022-04-15T16:05:49+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) భిక్షాటన విషయమై తాజాగా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది.

UAE: భిక్షాటన చేయించినా, చేసినా.. రూ.20లక్షల జరిమానా.. 6నెలల జైలు!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) భిక్షాటన విషయమై తాజాగా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై దేశంలో ఎవరైనా బయటి దేశాల వారిని నియమించుకుని(ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని) భిక్షాటన చేయిస్తే 1లక్ష దిర్హమ్స్(రూ.20.70లక్షల) జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ గురువారం వెల్లడించింది. అలాగే భిక్షాటన చేసిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. ఫెడరల్ డిక్రీ-లా నం.31 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 477 ప్రకారం ఈ జరిమానా, జైలు శిక్షలను అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో దేశంలో భిక్షాటన చేసే వారిపై అక్కడి సర్కార్ ప్రతియేటా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల భారీ సంఖ్యలో బిచ్చగాళ్లను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.  

Updated Date - 2022-04-15T16:05:49+05:30 IST