ఒమైక్రాన్‌ గురించి భయం వద్దు

ABN , First Publish Date - 2021-11-29T08:50:57+05:30 IST

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇంకా ప్రవేశించలేదని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని ప్రజారోగ్య

ఒమైక్రాన్‌ గురించి భయం వద్దు

  • తెలంగాణలో దాని జాడ లేదు
  • కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం
  • విలేకరుల సమావేశంలో గడల శ్రీనివాసరావు


హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇంకా  ప్రవేశించలేదని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆ శాఖ ఉన్నతాధికారులతో కొత్తవేరియంట్‌ ప్రభావం-తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం డీఎం రమేశ్‌రెడ్డితో కలిసి.. డీహెచ్‌ గడల శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ‘‘శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇప్పటికే సర్వైలెన్స్‌ బృందాలున్నాయి. వాటిని మరింత బలోపేతం చేశాం. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ప్రభుత్వం వాటిని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌, పలు ఐరోపా దేశాల్లో ఈ వేరియంట్‌ బయటపడింది. ఆయా దేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని ఆయన వివరించారు.


తెలంగాణలో కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల లేదన్నారు. ‘‘రోజూ 30వేల నుంచి 32 వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. 160 నుంచి 170 పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. గడిచిన ఐదు నెలలుగా కేసుల సంఖ్య 200 లోపే ఉంటోంది. థర్డ్‌వేవ్‌ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. థర్డ్‌వేవ్‌ను, కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దు’’ అని గడల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడా ఔట్‌బ్రేక్స్‌ వస్తున్నాయని.. ప్రభుత్వం వీటిపైనా దృష్టిపెట్టిందని వివరించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువగా ఉండడంతో.. ప్రజల్లో టీకాపై అలసత్వం కనిపిస్తోందని, ఇలాటి నిర్లక్ష్యంతో మరో ముప్పు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో టీకాకు అర్హులుగా 2.77 కోట్ల మందిని గుర్తించాం. వారిలో 90ు మంది మొదటి డోసు టీకాను తీసుకున్నారు. 45ు మంది మాత్రమే రెండో డోసు కూడా తీసుకున్నారు.


మొదటి డోసు తీసుకున్నాక.. రెండో డోసుకు గడువు దాటినా.. టీకా తీసుకోని వారు 25 లక్షల మంది ఉన్నారు. దీనికి తోడు.. కొవిడ్‌ ప్రొటోకాల్‌, నిబంధనలను పాటించడంలో కొంతమంది నిర్లక్ష్యం చూపుతున్నారు. వేరియంట్‌ ఏదైనా.. ఎదుర్కోవమనేది మనచేతుల్లోనే ఉందనే విషయాన్ని అంతా గుర్తెరగాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కచ్చితంగా రెండు డోసుల టీకాలు తీసుకోవాలని.. ఆ తర్వాత ఆర్నెల్లకు బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని చెప్పారు. బూస్టర్‌ డోస్‌పై కేంద్రం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేస్తుందని చెప్పారు.

Updated Date - 2021-11-29T08:50:57+05:30 IST