90 మంది స్పైస్‌జెట్ పైలెట్లపై డీజీసీఏ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-04-13T21:24:05+05:30 IST

న్యూఢిల్లీ : సరైన శిక్షణపొందని 90 మంది స్పైస్‌జెట్ పైలెట్లు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడపడానికి వీళ్లేదంటూ భారతీయ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆంక్షలు విధించింది.

90 మంది స్పైస్‌జెట్ పైలెట్లపై డీజీసీఏ ఆంక్షలు

న్యూఢిల్లీ : సరైన శిక్షణపొందని 90 మంది స్పైస్‌జెట్ పైలెట్లు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడపడానికి వీళ్లేదంటూ భారతీయ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆంక్షలు విధించింది. పైలెట్లకు సరైన తర్ఫీదు లేదని గుర్తించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ప్రకటించారు. ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మ్యాక్స్ విమానాలను నడిపేందుకు ఈ పైలెట్లకు మరోసారి సరైన విధానంలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.   ప్రస్తుతానికైతే మ్యాక్స్ విమానాలను నడపకుండా మాత్రమే చర్యలు తీసుకున్నామని, ఇతర విమానాలు నడిపేందుకు వారిని తీసుకోవచ్చునని అరుణ్ కుమార్ తెలిపారు.

గతేడాదే మ్యాక్స్ విమానాలపై నిషేధం ఎత్తివేత

వాస్తవానికి మార్చి 13, 2019 నుంచి గతేడాది ఆగస్టు వరకు భారత్‌‌లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. 2019లో అడీస్ అబాబాకు సమీపంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ 737 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత భారత్‌లో ఈ విమానాలపై నిషేదం విధిస్తూ డీజీసీఏ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే గతేడాది ఆగస్టులో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బోయింగ్ కంపెనీ డీజీసీఏకి సంతృప్తికరమైన వివరణ ఇచ్చిన అనంతరం నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-13T21:24:05+05:30 IST