Reservation: ‘దీపావళి’ ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-22T13:16:26+05:30 IST

దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ రవాణా సంస్థ నడిపే బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌(Reservation) బుధవారం ప్రారంభమైంది. ప్రయాణికుల

Reservation: ‘దీపావళి’ ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభం

- గత యేడాది కంటే అదనపు బస్సులు

- రవాణా శాఖ అధికారుల వెల్లడి 


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 21: దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ రవాణా సంస్థ నడిపే బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌(Reservation) బుధవారం ప్రారంభమైంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ యేడాది అదనపు బస్సులను నడిపేలా చర్యలు తీసుకోనున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రతి యేటా దీపావళి(Diwali) పండుగ కోసం అనేకమంది తమతమ సొంతూళ్లకు వెళుతుంటారు. ఆ సమయంలో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రవాణా శాఖ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. రోజువారీ సర్వీసులతో పాటు, ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటును కల్పించారు. సాధారణంగా ప్రతి యేటా దీపావళి పండుగ సమయంలో ఏర్పడే రద్దీని నివారించేందుకు ఏకంగా రెండు వేలకు పైగా ప్రత్యేక బస్సులను రవాణా శాఖ నడుపుతుంది. గత యేడాది దాదాపు 16,500 పైచిలుకు బస్సులను నడిపింది. దక్షిణ రైల్వే కూడా అనేక ప్రత్యేక రైళ్ళను పలు మార్గాల్లో నడిపింది. ఈ నేపథ్యంలో ఈ యేడాది దీపావళి పండుగ అక్టోబరు 24వ తేదీన జరుగనుంది. పైగా ఈ పండుగకు ముందు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అనేక మంది శుక్రవారమే అంటే 21వ తేదీనే తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్ళే అవకాశం ఉంది. ఈ పండుగ వేళలో రద్దీని నివారించేందుకు దక్షిణ రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్ళలో ముందస్తు రిజర్వేషన్‌ టెక్కెట్ల విక్రయం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే హాట్‌ కేకుల్లా అమ్ముడైన విషయం తెలిసిందే. ఈ రైళ్ళలో టిక్కెట్లు లభించని దూర ప్రాంత వాసులు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులపై ఆధారపడాల్సి ఉంది. ఈ దఫా దీపావళి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేందుకు నెల రోజుల ముందుగానే రవాణా శాఖ టిక్కెట్లు రిజర్వు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ రిజర్వేషన్‌ బుధవారం నుంచి ప్రారంభించింది. అదేవిధంగా దీపావళి సమయంలో ఎన్ని ప్రత్యేక బస్సులు నడపాలి, రద్దీగా ఉండే రూట్ల గుర్తింపు తదితర అంశాలపై రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులతో రవాణా మంత్రి చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, గత యేడాది కంటే ఈ దఫా అధిక సంఖ్యలో బస్సులు నడిపే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-09-22T13:16:26+05:30 IST