భక్తి.. ప్రపత్తి

ABN , First Publish Date - 2020-02-15T08:29:50+05:30 IST

భక్తిప్రపత్తులు.. ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్కువగా వినిపించే పదబంధం ఇది. భక్తి.. ప్రపత్తి.. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. అయితే, ఈ రెండూ భగవదనుగ్రహాన్ని పొందడానికి, మోక్షసాధనకు గల భిన్నమైన మార్గాలు. ‘భక్తి’ గురించి మనందరికీ తెలిసిందే. దైవాన్ని ఆరాధించడం, ప్రేమించడం, పూజించడం, ప్రార్థించడం,

భక్తి.. ప్రపత్తి

భక్తిప్రపత్తులు.. ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్కువగా వినిపించే పదబంధం ఇది. భక్తి.. ప్రపత్తి.. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. అయితే, ఈ రెండూ భగవదనుగ్రహాన్ని పొందడానికి, మోక్షసాధనకు గల భిన్నమైన మార్గాలు. ‘భక్తి’ గురించి మనందరికీ తెలిసిందే. దైవాన్ని ఆరాధించడం, ప్రేమించడం, పూజించడం, ప్రార్థించడం, వేడుకోవడం, భగవన్నామస్మరణ చేయడం.. ఇలా ఎన్నో రకాలుగా మన భక్తిని చాటుకుంటాం. జనసామాన్యమంతటికీ అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక సాధన ఇదే. కానీ భక్తి చాలామందికి తాత్కాలిక అంశం మాత్రమే. భక్తి నేతి ధారవలె నిరంతరం కొనసాగుతుండాలని భగవాన్‌ రమణులు చెప్పారు. ఆపత్కాల భక్తి వల్ల అంత ప్రయోజనం ఉండదు. అలాగని సాధారణ ప్రజకు నిరంతరం భగవన్నామ స్మరణలో మునిగి ఉండడమూ సాధ్యం కాదు. పైగా భక్తిమార్గం నుంచి మనను పక్కకు తప్పించడానికి ‘మాయ’కు ప్రతిరూప మైన మనస్సు ఉండనే ఉంది. మనం సరైన దారిలో నడవకుండా చేయడమే దాని పని. అది సదా ఈ శరీరమే ‘నేను’ అనుకోవడం, దేహపోషణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడమనే దేహాభిమానాన్ని పెంచిపోషిస్తుంటుంది. వాస్తవానికి ‘నేను’ అంటే కనిపించే ఈ ‘దేహం’ కాదు. ‘ఇది నా కాలు.. ఇది నా చెయ్యి.. ఇది నా కడుపు.. నా గుండె.. నా తల’ అంటుంటాం. అలా మనం అనుకొనే ఆ ‘ఇది’ అంటే ఏమిటి? అని ఆలోచిస్తే అర్థం అవుతుంది. ‘నేను’అంటే ఆత్మ. మనందరం ఆత్మస్వరూపులమే. ఈ శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతున్న చలనశక్తే అసలైన మనం. అదే ఆత్మచైతన్యం. ఆ విషయాన్ని అర్థం చేసుకుని గట్టిగా పట్టుకోవాలి. ఇది భక్తుడి బాధ్యతే. భగవంతుడి పనికాదు. అందుకే ఈ విధానాన్ని ‘మర్కట కిశోర న్యాయం’ అంటారు. భక్తిమార్గంలో సాధకుడు కూడా ఇలాగే ఎన్ని కష్టాలెదురైనా భగవంతుణ్ని పట్టుకునే ఉండాలి. ప్రహ్లాదుడు ఇందుకు ఉదాహరణ.


ఇక ప్రపత్తి.. భక్తి కంటే ఉన్నతమైనది. భారమంతా భగవంతునిపై వేసి సంపూర్ణ శరణాగతి వేడే విధానాన్నే ప్రపత్తి అంటారు. అది ‘మర్కట కిశోర న్యాయం’ వలె కాక.. ‘మార్జాల కిశోర న్యాయం’ వలె ఉంటుంది. మార్జాలం అంటే పిల్లి. అది ఒక ఇంట్లో మరుగు చూసుకుని పిల్లలను కంటుంది. కానీ, ఆ కూనలను పెద్దయ్యేవరకూ ఒకేచోట ఉంచదు. చాలాచోట్లకు తిప్పుతుంటుంది. వాటిని జాగ్రత్తగా తన నోట కరుచుకుని తీసుకెళ్తుంది. పిల్లికూనలు కోతిపిల్లల్లాగా కాక.. పూర్తిగా తల్లిపైనే ఆధారపడి ఉంటాయి. ప్రపత్తి మార్గం ఈ కోవలోనిదే. ‘నీట ముంచినా.. పాల ముంచినా నీవే స్వామి.. మంచిజరిగినా, చెడు జరిగినా నీవే దిక్కు’ అంటూ సాగిలపడే పద్ధతి ఇది. ఈ పద్ధతిలో పరమాత్మను కొలిచేవారు తమ గురించి తాము పట్టించుకోరు. తమ అవసరాల గురించి పట్టించుకోరు. దీంతో దేవుడే వారి భారం వహిస్తాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. అరుణాచలేశ్వరుణ్ని నమ్మి ఇల్లు వీడిన భగవాన్‌ రమణుల వంటివారు ఇందుకు ఉదాహరణ.

-మాదిరాజు రామచంద్రరావు, 9393324940

Updated Date - 2020-02-15T08:29:50+05:30 IST