యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2022-05-23T06:28:37+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం యాత్రాజనుల హరిహరనామ స్మరణతో ఆధాత్మిక సందడి నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి, ఇష్టదైవాన్ని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు.

యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం
ఆలయ ఆవరణలో భక్తులు

ధర్మదర్శనాలకు 4గంటలు, ప్రత్యేక దర్శనాలకు 2గంటల సమయం

కిటకిటలాడిన దర్శన క్యూలైన్లు, సేవా మండపాలు


యాదగిరిగుట్ట, మే22: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం యాత్రాజనుల హరిహరనామ స్మరణతో ఆధాత్మిక సందడి నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి, ఇష్టదైవాన్ని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు. వేకువజాము నుంచే కొండకింద స్వామివారి కల్యాణకట్ట వద్ద మొక్కుతలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆర్జీసీ బస్సులు, సొంత వాహనాల్లో కొండపైకి చేరు కున్న భక్తులు, స్వామివారి దర్శనం, ఆర్జిత సేవల నిర్వహణ కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచివున్నారు. ధర్మదర్శనాలకు 4గంటలు, ప్రత్యేక దర్శనాలకు 2గంట ల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టభుజి ప్రాకార మం డపంలో హోమం, నిత్య కల్యాణోత్సవం, కొండకింద పాత గోశాలలో సత్యనారాయణస్వామి వ్రతపూజలలో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. కాగా, భక్తు లు పెద్ద సంఖ్యలో వాహనాల్లో రావడంతో ఆలయ ఘాట్‌రోడ్‌, పట్టణంలో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరా యం ఏర్పడింది. కొండపైన సుమారు 650 వాహనాల పార్కింగ్‌తో రూ.3.25లక్షలు, స్వామివారి ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.15.40లక్షలు, ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన కైంకర్యాల ద్వారా రూ.1.72లక్షల ఆదాయం వచ్చింది. స్వామికి వివిధ విభాగాల ద్వారా రూ.33,81,486 ఆదాయం ఆలయ ఖజానాకు వచ్చింది.


భక్తుల పాట్లు

యాదగిరిక్షేత్రానికి విచ్చేసిన భక్తులు ఇష్టదైవాలను దర్శించుకునేందుకు నానా పాట్లు పడాల్సివచ్చింది. కొం డపైకి వచ్చిన భక్తులు దేవదేవుడి దర్శనాల కోసం ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులకు గురయ్యారు. బస్‌టర్మినల్‌ వద్ద నుంచి ఎటు వైపు వెళ్లాలో తెలియ డం లేదని పలువురు భక్తులు తెలిపారు. రూ.150 టిక్కెట్‌ కొనుగోలు చేసిన భక్తులను ప్రత్యేక దర్శనాల క్యూలైన్లలో కాకుండా కొండపైన నాలుగు అంతస్థుల్లో ని దర్శన క్యూకాంప్లెక్స్‌ గుండానే ధర్మదర్శనాల భక్తుల తో పాటు పంపుతుండడంపై అసహనం వ్యక్తం చేశా రు. ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్లు వేర్వేరుగా లేకపోవడంతో పాటు వీవీఐపీ దర్శనాలకు వెళ్లే ప్రాంతాల్లో సూచిక బోర్డులు లేకపోవడంతో కొందరు భక్తులు ధర్మదర్శనాల క్యూలైన్ల నుంచే వెళ్లారు. కొండపైన ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, గర్భిణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శన క్యూకాంప్లెక్స్‌లోని ఎస్కలేటర్‌ ఏర్పాటుచేసినా, వినియోగంలోకి తేవకపోవడంపై దేవస్థాన అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొండపైన సౌఖర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.


25న హనుమజ్జయంతి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి జయంతి ఈ నెల 25న బుధవారం సంప్రదాయరీతిలో నిర్వహించనున్నట్టు దేవస్థాన ఈవో గీతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొండపైన ప్రధానాలయం, అనుబంధ పాతగుట్ట ఆలయంలోని గుండం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు అష్టోత్తర శత మన్యుసూక్త పారాయణాలతో పంచామృతాభిషేకం, లక్ష తమలపాకులతో నాగవల్లీ దళార్చనలు కొనసాగుతాయని తెలిపారు.


వైభవంగా నిత్య పూజలు

యాదగిరివాసుడికి ఆదివారం నిత్య పూజలు వైభవంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వయంభువులను మేల్కొలిపిన ఆచార్యులు బిందెతీర్థం, బాలభోగం కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం స్వయంభువులను, కవచమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో సహస్రనామార్చన చేశారు. అనంతరం హోమం, నిత్య తిరుకల్యాణోత్స వ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన రామలింగేశ్వరస్వామికి, స్పటిక లింగేశ్వరుడికి నిత్య పూజలు,కొండకింద పాతగోశాలలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి.

Updated Date - 2022-05-23T06:28:37+05:30 IST