తిరుమలలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2022-03-01T00:58:33+05:30 IST

దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమలలో భక్తుల సందడి కన్పిస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 2.44 లక్షల మంది వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమలలో భక్తుల సందడి

తిరుమల: దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమలలో భక్తుల సందడి కన్పిస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 2.44 లక్షల మంది వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కరోనా కారణంగా 2020 మార్చి 21నుంచి  శ్రీవారి ఆలయంలో అన్ని రకాల దర్శనాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల పాటు భక్తుల అనుమతిని రద్దు చేసి శ్రీవారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత దర్శనాలను పరిమిత సంఖ్యలో ప్రారంభించినప్పటికీ సెకండ్‌, థర్డ్‌ వేవ్‌ల ప్రభావంతో దర్శనాల సంఖ్యను పెంచడం సాధ్యం కాలేదు. ఎంతో విశిష్టమైన బ్రహ్మోత్సవాలు వంటి ఉత్సవాలు కూడా ఆలయానికే పరిమితమయ్యాయి. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఇచ్చే టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్ల సంఖ్య పెంచడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ప్రత్యేకించి తమిళనాడు, కర్ణాటక గ్రామీణ ప్రాంత భక్తులతో కొండ కిటికిటలాడుతోంది. సిఫార్సు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని కూడా రద్దు చేయడంతో సామాన్య భక్తులకు అదనపు సమయం లభించింది. ఈ క్రమంలో 24 నుంచి 27వ తేదీ వరకు 2,44,098 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.16.23 కోట్లు లభించింది.

Updated Date - 2022-03-01T00:58:33+05:30 IST